నరసింహలో పవర్‌ఫుల్ నీలాంబరి క్యారెక్టర్-ఫస్ట్ అనుకున్నది రమ్యకృష్ణను కాదంటా-షాకింగ్ విషయం చెప్పిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ 'పడయప్ప' సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తెలుగులో ఇది నరసింహ పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నీలాంబరి పాత్ర కోసం మొదట రమ్యకృష్ణను అడగలేదని, వేరే హీరోయిన్ కోసం వెయిట్ చేశామని రజనీ చెప్పారు.
రజినీకాంంత్ నటించిన 1999 నాటి బ్లాక్‌బస్టర్ మూవీ 'పడయప్ప'. ఇది తెలుగులో నరసింహ పేరుతో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ రమ్యకృష్ణ కెరీర్ లోనే స్పెషల్ గా నిలిచిపోయింది. ఈ పాత్ర ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. అయితే మొదట ఈ క్యారెక్టర్ కు అనుకున్న హీరోయిన్ రమ్యకృష్ణను కాదంటా. ఐశ్వర్య రాయ్ అని రజనీకాంత్ తాజాగా వెల్లడించారు.

ఐశ్వర్య రాయ్ కోసం
పడయప్ప (నరసింహ) మూవీ మళ్లీ రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆ చిత్రం ప్రస్థానంపై ఒక ప్రత్యేక వీడియోలో మాట్లాడుతూ రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సినిమాలో నీలాంబరి పాత్రకు మొదట రమ్యకృష్ణను కాదని, ఐశ్వర్య రాయ్ తన మొదటి ఛాయిస్ అని సూపర్ స్టార్ వెల్లడించారు. అయితే, ఆమె ఆ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తి చూపలేదని తెలిసింది.
రెండేళ్లు అయినా
"మేము ఐశ్వర్య రాయ్ నీలాంబరి పాత్ర చేయాలని అనుకున్నాము. చాలా కష్టపడి ఆమెను సంప్రదించాం. ఆమె సరే అని ఉంటే, ఆ పాత్రకు తగినట్లుగా నేను 2-3 సంవత్సరాలు అయినా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నా. ఆ పాత్ర సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. కానీ ఆమెకు ఆసక్తి లేదని తెలిసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి అనేక పేర్లను పరిశీలించాం. కానీ నీలాంబరి పాత్రకు కావలసిన ఆ గర్వం, హీరోయిన్ కళ్లలో ఆ పవర్ కావాలి. ఆ అహంకారం ఉండాలి. చివరికి రవికుమార్ ఏమో రమ్యకృష్ణ పేరును సూచించారు" అని రజనీకాంత్ పేర్కొన్నారు.
ఆ తర్వాత ఐశ్వర్య రాయ్, రజనీకాంత్ కలిసి 'రోబో' (ఎందిరన్) చిత్రంలో నటించారు. దీనికి శంకర్ డైరెక్టర్. ఇది బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది.
పడయప్ప సీక్వెల్
అదే వీడియోలో రజనీకాంత్ 'పడయప్ప' సీక్వెల్ గురించి కూడా ధృవీకరించారు. ఆ సీక్వెల్ పేరు 'నీలాంబరి: పడయప్ప 2' అని వెల్లడించారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన పడయప్ప చిత్రంలో రజనీకాంత్ టైటిల్ పాత్ర పోషించారు. రమ్యకృష్ణ, సౌందర్య, శివాజీ గణేశన్ ప్రధాన పాత్రలలో నటించారు. లక్ష్మి, రాధా రవి, నాజర్, అబ్బాస్, సీతార, ప్రీత సహాయక పాత్రలు పోషించారు.
పడయప్ప మూవీ అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు రజనీకాంత్, రమ్యకృష్ణలు ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, వినాయకన్, యోగి బాబు, మిర్నా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కలానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్‌లో విడుదల కానుంది.














