Raveena Tandon: ఎల్లో జర్నలిజంపై రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజుల్లో చాలా ఘోరమంటూ ఆవేదన!
Raveena Tandon: 90వ దశకంలో ఎల్లో జర్నలిజం వల్ల ఎదుర్కొన్న నరకాన్ని బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ తాజాగా వెల్లడించింది. అప్పట్లో ఎడిటర్ల దయాదాక్షిణ్యాలపైనే నటీనటుల ఇమేజ్ ఆధారపడి ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Raveena Tandon: 1990వ దశకంలో బాలీవుడ్‌ను శాసించిన స్టార్ హీరోయిన్లలో రవీనా టాండన్ ఒకరు. అప్పట్లో ఆమెతో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టేవారు. అయితే, కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ఆమె ఎల్లో జర్నలిజం వల్ల ఎన్నో ఇబ్బందులు పడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా, అప్పట్లో పత్రికలు తమపై రాసిన అసత్య కథనాల గురించి, సమాజంలో తమ ఇమేజ్‌ను ఎడిటర్లు ఎలా శాసించేవారనే విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

రవీనా టండన్ కామెంట్లు
ఎంత పెద్ద స్టార్ అయినా అప్పట్లో మీడియా చేతుల్లో కీలుబొమ్మలా మారక తప్పలేదని రవీనా టండన్ సెన్సేషనల్ కామెంట్లు చేసింది. అప్పట్లో ఎల్లో జర్నలిజానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని పేర్కొంది. మాలినీ అగర్వాల్ టాక్ షో 'నాట్ డన్ యెట్' సీజన్ 2 ఎపిసోడ్‌లో రవీనా టాండన్ పాల్గొంది.
"ఆ రోజుల్లో ఎల్లో జర్నలిజానికి అస్సలు అడ్డు అదుపు ఉండేది కాదు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి లేదా లైవ్‌లోకి వచ్చి ప్రేక్షకులతో నేరుగా మాట్లాడినంత సులభంగా అప్పట్లో మాపై వచ్చిన రూమర్లను ఖండించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రేక్షకులతో నేరుగా సంబంధాలు పెట్టుకునే వీలుంది, కానీ నాడు ఆ పరిస్థితి లేదు" అని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా చెప్పుకొచ్చింది
ఎడిటర్ల ‘గుడ్ బుక్స్’
అప్పట్లో ఎడిటర్లకు నచ్చినట్లు నడుచుకునే నటీనటులకే పత్రికల్లో మంచి ప్రాధాన్యం దక్కేదని రవీనా ఆరోపించింది. ఎవరైనా తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలని చూస్తే, వారిని ప్రశాంతంగా బతకనిచ్చేవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది. పత్రికల హెడ్‌లైన్స్ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయేవి. ఆ తర్వాత ఎంత క్షమాపణలు చెప్పినా ప్రయోజనం ఉండేది కాదని రవీనా వివరించింది.
తప్పుడు వార్తలు
"తదుపరి హెడ్‌లైన్ వచ్చే వరకు మేము వేచి చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత ఎక్కడో ఒక చిన్న మూలన క్షమాపణలు వేసేవారు. దానికి ఎలాంటి విలువ ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయేది. ఆ తప్పుడు వార్తలు ప్రజల మైండ్‌లో అలానే ఉండిపోయేవి. వాటిని మార్చడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు" అని రవీనా ఆనాటి చేదు జ్ఞాపకాలను పంచుకుంది.
బాడీ షేమింగ్, వ్యక్తిగత దాడులు
రవీనా టండన్ ఇలా మీడియాపై మండిపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె ఈ పద్ధతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కథనాలు రాసిన వారిపై కోర్టుకు వెళ్లి పరువు నష్టం దావా వేయాలని అప్పట్లో తనకు అనిపించేదని చెప్పింది. ఆ రోజుల్లో ప్రెస్ తనను తీవ్రంగా బాడీ షేమింగ్ చేసిందని, వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని రవీనా ఆవేదన వ్యక్తం చేసింది.
క్రేజీ ప్రాజెక్టులు
ఇక రవీనా సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఇటీవలే సంజయ్ దత్‌తో కలిసి ఓ సినిమాలో నటించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్'లో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో సునీల్ శెట్టి, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సి, జాకీ ష్రాఫ్, పరేష్ రావల్, లారా దత్తా వంటి స్టార్లు నటిస్తున్నారు.
వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలోనూ రవీనా టండన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: రవీనా టాండన్ 90ల నాటి మీడియా గురించి ఏం చెప్పింది?
సమాధానం: అప్పట్లో ఎల్లో జర్నలిజానికి అడ్డు అదుపు లేదని, నటీనటుల కెరీర్, వ్యక్తిగత జీవితాలు పూర్తిగా ఎడిటర్ల చేతుల్లోనే ఉండేవని రవీనా చెప్పింది.
ప్రశ్న 2: సోషల్ మీడియా వల్ల నటులకు ఎలాంటి ప్రయోజనం చేకూరిందని రవీనా భావిస్తోంది?
సమాధానం: ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నటులు ఇప్పుడు నేరుగా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడమే కాకుండా, తమపై వచ్చే తప్పుడు వార్తలను వెంటనే ఖండించగలుగుతున్నారని రవీనా అభిప్రాయపడింది.
ప్రశ్న 3: రవీనా టాండన్ రాబోయే చిత్రాలు ఏవి?
సమాధానం: ఆమె ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, సూర్య హీరోగా నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాల్లో నటిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


