RK Selvamani: దళపతి విజయ్ జన నాయగన్ లీక్, 500 కోట్ల బ్యాంక్ దోపిడీతో సమానం.. రోజా భర్త ఆర్కే సెల్వమణి విమర్శలు
RK Selvamani Slams Thalapathy Vijay Jana Nayagan Leak: దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్' ఇంటర్నెట్‌లో లీక్ కావడంపై చిత్ర పరిశ్రమ భగ్గుమంటోంది. ఇది వ్యవస్థ వైఫల్యమని, నిర్మాతలకు రూ. 500 కోట్ల నష్టం వాటిల్లిందని ఫెఫ్సీ అధ్యక్షుడు, నటి రోజా భర్త ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
RK Selvamani On Thalapathy Vijay Jana Nayagan Leak: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు స్వస్తి పలికే ముందు నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ చుట్టూ ఇప్పుడు తీవ్ర విషాదం అలుముకుంది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే జన నాయగన్ హై క్వాలిటీ (HD) ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.

ఈ ఘటనపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (FEFSI) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా లీక్ కాదని, వ్యవస్థాగతమైన వైఫల్యమని ఆర్కే రోజా భర్త, డైరెక్టర్ సెల్వమణి అభివర్ణించారు.
రిజర్వ్ బ్యాంక్ దోపిడీతో పోలిక
ఈ లీకేజీని ఒక భారీ బ్యాంకు దోపిడీతో పోల్చారు సెల్వమణి. "రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎవరైనా రూ. 500 కోట్లు దొంగిలిస్తే దేశమంతా గగ్గోలు పెడుతుంది. కానీ, ఒక నిర్మాత రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా చోరీకి గురైతే అటు ప్రభుత్వం గానీ, ఇటు ప్రజలు గానీ పెద్దగా స్పందించడం లేదు. హాలీవుడ్ సినిమాలు లీక్ అయితే నిందితులు వెంటనే పట్టుబడతారు. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు" అని సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడ లోపం జరిగింది?
జన నాయగన్ సినిమా ఎడిటింగ్ టేబుల్ నుంచి బయటకు వచ్చిందా లేక డబ్బింగ్ సమయంలో లీక్ అయిందా అనే దానిపై సెల్వమణి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్ విభాగం నుంచి సమాచారం సేకరించగా.. సినిమా కాపీలను డబ్బింగ్ కోసం కర్ణాటకకు, ఆడియో మిక్సింగ్ కోసం హైదరాబాద్‌కు పంపినట్లు తెలిసిందని సెల్వమణి పేర్కొన్నారు.
ఈ రెండు చోట్ల ఎక్కడో ఒకచోట ఈ భారీ చోరీ జరిగి ఉండొచ్చని సెల్వమణి అనుమానం వ్యక్తం చేశారు. దొంగిలించిన వస్తువులను ఎటువంటి భయం లేకుండా నేరుగా ప్రజల ఇళ్లకే ఇంటర్నెట్ ద్వారా పంపిణీ చేయడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
కమల్ హాసన్ మద్దతు.. ప్రభుత్వాలకు విన్నపం
ఈ విషయంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను సెల్వమణి సమర్థించారు. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం వల్లే పైరసీ రాయుళ్లు చెలరేగిపోతున్నారని కమల్ హాసన్ గతంలో ట్వీట్ చేశారు. చట్టపరమైన మార్గాలు మూసుకుపోయినప్పుడు ఇలాంటి అక్రమ మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సెల్వమణి కోరారు. ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేసి నిందితులను జైలుకు పంపాలని, సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా విధించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ
దళపతి విజయ్ సినిమా అంటే థియేటర్ల వద్ద ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఆ పండగ ఇప్పుడు పైరసీ వల్ల ఆగిపోయిందని సెల్వమణి పేర్కొన్నారు. థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం పంపిణీదారులకు, అక్కడి నుంచి నిర్మాతలకు, చివరికి వేలాది మంది సినీ కార్మికులకు చేరుతుందని.. ఇప్పుడు ఆ గొలుసు తెగిపోయిందని ఆయన ఆవేదన చెందారు.
కాగా, ఈ ఘటనపై తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే రంగంలోకి దిగి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


