Salman Khan Shraddha: యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్ ఖాన్- నా కళ్లముందే పెరిగిన పిల్లలంటూ కామెంట్స్

Salman Khan Apologises Shraddha Kapoor: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్షమించమని అడిగినట్లు చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. మాతృభూమి, ఈతా రెండు సినిమాల బాక్సాఫీస్ క్లాష్ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Nov 22, 2026, 10:30:19 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Salman Khan Apologises Shraddha Kapoor: బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు ఒకే రోజు తలపడుతున్నాయంటే చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఇప్పుడు బాలీవుడ్‌లో నెలకొంది.

యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్ ఖాన్- నా కళ్లముందే పెరిగిన పిల్లలంటూ కామెంట్స్
యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్ ఖాన్- నా కళ్లముందే పెరిగిన పిల్లలంటూ కామెంట్స్

ఒకేరోజున రెండు సినిమాలు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన వార్ డ్రామా 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' (Maatrubhumi: May War Rest in Peace), యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ఈతా' (Eetha) చిత్రాలు 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ బాక్సాఫీస్ పోటీపై సల్మాన్ ఖాన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏబీపీ (ABP) ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ఈ విషయంపై మనసు విప్పి మాట్లాడారు.

శ్రద్ధా కపూర్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పా

తమ సినిమా విడుదల తేదీని ప్రకటించే సమయానికి శ్రద్ధా కపూర్ చిత్రం కూడా అదే రోజు వస్తోందన్న విషయం తనకు తెలియదని సల్మాన్ ఖాన్ చెప్పారు. ముందే తెలిసి ఉంటే కచ్చితంగా వేరే తేదీని ఎంచుకునేవాడినని ఆయన పేర్కొన్నారు.

"డిసెంబర్ 4న సినిమా విడుదల చేస్తున్నట్లు మేము ప్రకటించినప్పుడు, శ్రద్ధా సినిమా కూడా అదే రోజు వస్తోందని నాకు తెలియదు. ఈ విషయం తెలిశాక నాకు చాలా బాధేసింది. ముందే తెలిసి ఉంటే శ్రద్ధా సినిమాతో పోటీగా వచ్చేవాడిని కాదు. వెంటనే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాను. శ్రద్ధా వాళ్లంతా నా కళ్లముందే పెరిగిన పిల్లలు. అందుకే ఆమెకు ఫోన్ చేసి, 'నాకు నిజంగా తెలియదు, నన్ను క్షమించు' అని చెప్పాను" అని సల్మాన్ ఖాన్ వివరించారు.

బాక్సాఫీస్ వద్ద తగినంత చోటు ఉంది

సల్మాన్ ఫోన్ కాల్‌కు శ్రద్ధా కపూర్ ఎంతో హుందాగా స్పందించారని ఆయన తెలిపారు. రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించే అవకాశం ఉందని శ్రద్ధా తనకు భరోసా ఇచ్చినట్లు సల్మాన్ గుర్తుచేసుకున్నారు. "లేదు సార్, పర్వాలేదు. మన రెండు సినిమాలు ఆడటానికి బాక్సాఫీస్ వద్ద తగినంత చోటు ఉంది" అని శ్రద్ధా అన్నట్లు సల్మాన్ చెప్పారు.

ఆమె మాటలకు తాను ఎంతో సంతోషించానని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, ప్రేక్షకులందరూ తప్పకుండా 'ఈతా' సినిమాను చూడాలని ఆయన కోరారు. గతంలోనూ సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ఈతా' పోస్టర్‌ను పంచుకుంటూ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

'మాతృభూమి' విడుదల వాయిదా వెనుక అసలు కారణం

నిజానికి సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' సినిమాను డిసెంబర్ 4 కంటే ముందే విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. తొలుత నవంబర్ 20న, ఆ తర్వాత నవంబర్ 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు రచించారు.

అయితే ఒక స్క్రీనింగ్ సమయంలో సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆశించిన స్థాయిలో లేవని సల్మాన్ ఖాన్ గుర్తించారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో, గ్రాఫిక్స్ పనులను మరింత మెరుగుపరిచేందుకు చిత్ర బృందానికి అదనపు సమయం కావాలని భావించి డిసెంబర్ 4కు వాయిదా వేశారు.

భారత్-చైనా సరిహద్దుల్లోని

అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన మాతృభూమి చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై సల్మా ఖాన్ నిర్మించారు. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల స్ఫూర్తితో ఈ కథను తెరకెక్కించారు. ఇందులో సల్మాన్ ఖాన్ శక్తివంతమైన ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనుండగా, చిత్రాంగద సింగ్ కీలక పాత్ర పోషించారు.

సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రానికి యూ/ఏ 16+ (U/A 16+) సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి దాదాపు 2 గంటల 34 నిమిషాలు ఉండనుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ సల్మాన్ ఖాన్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, దేశభక్తి నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై ఇక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

జానపద కళాకారిణి జీవిత కథతో 'ఈతా'

మరోవైపు శ్రద్ధా కపూర్ నటిస్తున్న 'ఈత' కూడా బలమైన కథాంశంతో రాబోతోంది. మహారాష్ట్ర జానపద కళారూపాలైన లావణి, తమాషా రంగాల్లో ఎంతో పేరుగాంచిన విఠాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో ఒదిగిపోయారు.

రణ్‌దీప్ హుడా, మహమ్మద్ జీషన్ అయూబ్, సిద్ధార్థ్ జాదవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మాడాక్ ఫిల్మ్స్, కట్‌పుట్లీ క్రియేషన్స్ సంస్థలపై దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్ సంయుక్తంగా ఈతా సినిమాను నిర్మించారు. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ ఈ సినిమాకు బాణీలు సమకూర్చారు.

ఆసక్తికర బాక్సాఫీస్ పోరు

ఒకవైపు సరిహద్దు వీరుల పోరాటాన్ని చూపించే సల్మాన్ ఖాన్ 'మాతృభూమి', మరోవైపు కళాకారిణి జీవిత పోరాటాన్ని ఆవిష్కరించే శ్రద్ధా కపూర్ 'ఈతా' ఒకే రోజు విడుదలవుతుండటంతో డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు ఖాయమైంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.