Priyavadhana Suicide: 24 ఏళ్ల ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య- ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్- సూర్య సినిమాలో నటించిన ప్రియవదన

TV Anchor Priyavadhana Suicide: ప్రముఖ వార్తా ఛానెల్ యాంకర్, నటి ప్రియవదన (24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. హీరో సూర్య సినిమాలోనూ నటించిన ప్రియవదన మరణవార్త కోలీవుడ్‌తో పాటు బుల్లితెర వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, సూసైడ్‌కు 2 రోజుల ముందు ప్రియవదన షేర్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Published on: Oct 24, 2026, 09:13:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

TV Anchor Actress Priyavadhana Suicide: టీవీ స్క్రీన్‌పై నిత్యం చిరునవ్వుతో కనిపిస్తూ వార్తలు చదివే ఆ గొంతు మూగబోయింది. ఎన్నో ఆశలు, కలలతో భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న 24 ఏళ్ల తమిళ టీవీ యాంకర్, నటి ప్రియవదన ఆత్మహత్య చేసుకోవడం చెన్నై మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

24 ఏళ్ల ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య- ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్- సూర్య సినిమాలో నటించిన ప్రియవదన
24 ఏళ్ల ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య- ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్- సూర్య సినిమాలో నటించిన ప్రియవదన

సూర్య కరుప్పు సినిమాలో పాత్ర

చెన్నైలోని 'తంతి టీవీ'లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ప్రియవదన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరకు సైతం పరిచయమయ్యారు. కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయంలోనే ఆమె ఇలా అకస్మాత్తుగా దూరమవ్వడం అందరినీ తీవ్రంగా బాధించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో చిరునవ్వులు.. అంతలోనే విషాదం!

మరణానికి కేవలం రెండు రోజుల ముందు వరకు ప్రియవదన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చెన్నై మైలాపూర్‌లోని నవరాత్రి కొలువు వేడుకలను సందర్శించిన వీడియోను, పెళ్లికూతురి గెటప్‌లో చేసుకున్న ఫోటోషూట్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియోల్లో ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ప్రియవదన, ఇంతలోనే ప్రాణాలు తీసుకోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఒక్కగానొక్క కుమార్తె- తల్లడిల్లిన తల్లిదండ్రులు

కొద్ది రోజుల కిందటే ప్రియవదన తన 24వ పుట్టినరోజును ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఎంతో సంతోషంగా కనిపించే ప్రియవదన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె. కళ్లముందే ఎంతో భవిష్యత్తు ఉన్న కుమార్తె ఆకస్మికంగా నూరేళ్లు నిండకుండానే వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

నివాళులర్పించిన మీడియా మిత్రులు

చెన్నై జాఫర్‌ఖాన్‌పేటలోని ప్రియా నివాసంలో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు మీడియా రంగ ప్రముఖులు, సహచర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనునిత్యం సమాజంలో జరిగే సంఘటనలను, కష్టాలను వార్తల రూపంలో పాఠకులకు, ప్రేక్షకులకు అందించే జర్నలిస్టులే ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం తోటి విలేఖరులను తీవ్రంగా కలచివేస్తోంది.

సోషల్ మీడియా వెనుక దాగున్న మానసిక వేదన

సామాజిక మాధ్యమాల్లో కనిపించే నవ్వుల వెనుక ఒకరి నిజమైన మానసిక స్థితిని అంచనా వేయడం సాధ్యం కాదని ఈ ఘటన చెబుతోంది. పైకి ఎంతో సంతోషంగా కనిపించే వ్యక్తులు కూడా అంతర్గతంగా ఎంతటి మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారో పక్కనున్న వారు కూడా గుర్తించలేకపోవచ్చు. ప్రియవదన ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే దానిపై ఇప్పటివరకు స్పష్టమైన వివరాలు బయటకు రాలేదు.

బాధను దాచుకోవద్దు.. సహాయం కోరండి

"జీవితంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. మనసులోని బాధను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల పెద్ద ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకూడదు. మానసిక నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం" అని నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదని, క్లిష్ట సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More