విడాకుల తర్వాత ఎవరినీ నమ్మాలనిపించలేదు.. అదృష్టం కొద్దీ రాజ్ దొరికాడు.. అతని వల్లే మెరుగయ్యాను: సమంత
సమంత రూత్ ప్రభు తన విడాకులు, రాజ్ నిడిమోరుతో రిలేషన్‌షిప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. చైతన్యతో విడాకుల తర్వాత ఎవరినీ నమ్మాలని అనిపించలేదని, అయితే అదృష్టం కొద్దీ రాజ్ దొరికాడని చెప్పింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత రూత్ ప్రభు.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి, అలాగే దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏర్పడిన బంధం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. విడాకుల తర్వాత తాను పూర్తిగా కుంగిపోయానని, మళ్లీ ఇంకొకరిపై ఆధారపడతానని ఎప్పుడూ అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రాజ్ నిడిమోరు తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తనలో ఎంతో సానుకూల మార్పు వచ్చిందని సమంత చెప్పుకొచ్చింది.

"నా ప్రపంచాన్ని పూర్తిగా మూసేశాను.."
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన సొంత బ్యానర్‌పై నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) సినిమా పనులతో ఎంతో బిజీగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో చోటుచేసుకున్న భావోద్వేగభరితమైన మార్పుల గురించి సంచలన విషయాలు వెల్లడించింది.
తన మాజీ భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తాను మళ్లీ ఇంకొకరి దగ్గరికి వెళ్తానని కానీ, మరొకరితో సన్నిహితంగా ఉంటానని కానీ కలలో కూడా ఊహించలేదని సమంత తెలిపింది. కానీ ఇప్పుడు తన జీవితంలో రాజ్ నిడిమోరు ఉన్నందుకు తాను ఎంతో కృతజ్ఞురాలినని చెప్పింది.
"నేను విడాకులు తీసుకున్న సమయంలో.. మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. నా ప్రపంచాన్ని పూర్తిగా మూసేశాను. ఇంకొకరిపై ఆధారపడటం అనేది ఇక నా జీవితంలో సాధ్యం కాదని అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తూ అలాంటి ప్రేమను, స్నేహాన్ని అంగీకరించగలిగేంత సున్నితమైన మనసు నాకు అప్పటికి మిగిలే ఉంది. ఇప్పుడు నేను ఒక మంచి బంధంలో ఉన్నాను. అందుకే మునుపటి కంటే మరింత మెరుగైన వ్యక్తిగా మారగలిగాను. దానికి కారణం రాజ్ నిడిమోరు లాంటి వ్యక్తి నాకు దొరకడమే" అని సమంత ఎమోషనల్ అయింది.
"స్నేహితులు కూడా నాలో ఆ మార్పును గమనించారు"
తనలో వచ్చిన ఈ మార్పు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ స్పష్టంగా కనిపిస్తోందని సమంత చెప్పింది. "కొద్ది రోజుల క్రితం నా పాత స్నేహితురాలు ఒకరు నన్ను కలిసింది. ఆ తర్వాత ఆమె నాకు ఒక వాయిస్ నోట్ పంపింది.. 'చాలా కాలం తర్వాత ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు నాకు అనిపిస్తోంది. నువ్వు ఇకపై ఏదీ నటిస్తున్నట్లుగా లేదు' అని ఆమె చెప్పింది. నిజానికి విడాకుల తర్వాత కొన్ని రోజులు నేను చాలా కుంగిపోయాను. కానీ ఎప్పుడైతే రాజ్‌తో స్నేహం మొదలైందో.. అప్పటి నుంచి జీవితం పట్ల నా దృక్పథం పూర్తిగా మారిపోయింది" అని ఆమె వివరించింది.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' నుంచి 'మా ఇంటి బంగారం' వరకు..
సమంత, రాజ్ నిడిమోరు తొలిసారిగా 2021లో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ సెట్స్‌లో కలుసుకున్నారు. రాజ్ అండ్ డీకే ద్వయం ఈ సిరీస్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, సంవత్సరాలు గడిచేకొద్దీ బలమైన బంధంగా మారి, గతేడాది వివాహానికి దారితీసింది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ నిడిమోరు ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆమెకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


