OTT Release South Producers: 8 వారాల ఓటీటీ రిలీజ్ నిబంధనలపై గరం గరం.. సిఫ్పా ఏర్పాటు.. దక్షిణాది నిర్మాతల సంచలన నిర్ణయం!

South Producers SIFPA On OTT Release Rule: థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత ఓటీటీలో ఎప్పుడు రావాలనే నిబంధనలపై దక్షిణాది చిత్ర పరిశ్రమ భగ్గుమంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని నిర్మాతలు తేల్చిచెప్పారు. ఓటీటీ రిలీజ్ విషయంలో సౌత్ ప్రొడ్యూసర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Apr 20, 2026, 11:17:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

South Producers SIFPA On OTT Release Rule: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా దక్షిణాది సినీ రంగాన్ని ఓటీటీ విండో (OTT Window) వ్యవహారం కుదిపేస్తోంది. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం ఎనిమిది వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయకూడదనే ప్రతిపాదనలపై నిర్మాతలు భగ్గుమంటున్నారు.

8 వారాల ఓటీటీ రిలీజ్ నిబంధనలపై గరం గరం.. సిఫ్పా ఏర్పాటు.. దక్షిణాది నిర్మాతల సంచలన నిర్ణయం!
8 వారాల ఓటీటీ రిలీజ్ నిబంధనలపై గరం గరం.. సిఫ్పా ఏర్పాటు.. దక్షిణాది నిర్మాతల సంచలన నిర్ణయం!

సౌత్ స్టేట్స్ నిర్మాతలు

ఆదివారం (ఏప్రిల్ 19) హైదరాబాద్‌లోని హోటల్ దశపల్లాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు అత్యవసరంగా భేటీ అయ్యారు. చిత్ర నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఈ సమావేశంలో దక్షిణాది నిర్మాతలు సుదీర్ఘంగా చర్చించారు.

ఏకపక్ష నిర్ణయాలపై యుద్ధం

సినిమా నిర్మాణంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, రిస్క్ తీసుకునేది నిర్మాతలేనని, అలాంటప్పుడు ఇతర స్టేక్ హోల్డర్లు (Stakeholders) తమను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా థియేట్రికల్ టర్మ్స్ లేదా 8 వారాల ఓటీటీ విండో నిబంధనలను ఏకపక్షంగా రుద్దడాన్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఖండించింది. ప్రస్తుతం ఉన్న చిత్ర నిర్మాణ వ్యవస్థ వేల కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోందని, ఇలాంటి ఆకస్మిక మార్పులు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను చిక్కుల్లో నెట్టేస్తాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి 'సిఫ్పా' (SIFPA)

నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు భాషల చిత్ర పరిశ్రమలను ఏకం చేస్తూ 'సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' (SIFPA-సిఫ్పా)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా దక్షిణాది రాష్ట్రాల నిర్మాతలకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలని నిర్ణయించారు. దీని పర్యవేక్షణ కోసం ప్రతి భాషా పరిశ్రమ నుంచి సభ్యులతో కూడిన ఒక హై-లెవల్ స్టీరింగ్ కమిటీని కూడా నియమించారు.

నిర్మాతలకు కీలక సూచనలు

ఈ సమావేశం అనంతరం స్టీరింగ్ కమిటీ సభ్యులు నిర్మాతలకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు:

స్వతంత్ర నిర్ణయాలు: ప్రస్తుతం నిర్మాతలు అనుసరిస్తున్న నిర్మాణ ప్రక్రియ, వివిధ హక్కుల విక్రయాలు, విడుదల తేదీల విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గకూడదు.

ఓటీటీ లెటర్స్ వద్దు: ఓటీటీ రిలీజ్ విషయానికి సంబంధించి ఏ అసోసియేషన్‌కు లేదా ఇతర విభాగాలకు ఎలాంటి హామీ పత్రాలు (Commitment Letters) ఇవ్వొద్దని కమిటీ స్పష్టం చేసింది.

సమిష్టి నిర్ణయమే ఫైనల్: ఆర్థిక పరమైన వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని, అందరితో చర్చించిన తర్వాతే ఓటీటీ విండోపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

"పరిశ్రమలో ప్రాథమిక రిస్క్ తీసుకునే నిర్మాత ఎప్పుడూ స్వతంత్రంగానే ఉండాలి. నిర్ణయ ప్రక్రియలో నిర్మాత ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి" అని స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రముఖ నిర్మాత శ్రీనివాస కుమార్ అలియాస్ ఎస్కేఎన్ (SKN) తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రానున్న రోజుల్లో ఈ స్టీరింగ్ కమిటీ తరచుగా సమావేశమై పరిస్థితులను సమీక్షించనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఓటీటీ విండో (OTT Window) అంటే ఏమిటి?

ఒక సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, అది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కావడానికి మధ్య ఉండాల్సిన కనీస సమయాన్ని ఓటీటీ విండో అంటారు. ప్రస్తుతం దీనిని 8 వారాలకు పెంచాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.

2. కొత్తగా ఏర్పడిన SIFPA ఉద్దేశం ఏమిటి?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (SIFPA) ప్రధానంగా దక్షిణాది నిర్మాతలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి, వారి ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడింది.

3. ఓటీటీ రిలీజ్ విషయంలో నిర్మాతల అభ్యంతరం ఏంటి?

ముందస్తు సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిబంధనలు విధిస్తే సినిమా బిజినెస్ దెబ్బతింటుందని, నిర్మాతలకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More