CM Vijay: 224 సినిమాలకు 15 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల- ఏడేళ్ల నిరీక్షణకు తెర- ఆ కుటుంబాలకు దక్కిన దీపావళి కానుక అంటూ!

CM Vijay Release 15 Cr Subsidy To 224 Tamil Films: ఏడేళ్లుగా బకాయి ఉన్న సబ్సిడీ నిధులను తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. 224 చిన్న సినిమాలకు గాను రూ.15.68 కోట్లు అందజేస్తూ సీఎం జోసెఫ్ విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సినీ వర్గాలకు ఇది నిజమైన దీపావళి కానుకంటూ నిర్మాత టి శివ అన్నారు.

Published on: Nov 2, 2026, 14:46:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

CM Vijay Release 15 Cr Subsidy To 224 Tamil Films: కోలీవుడ్‌లో నష్టాలతో ఇబ్బంది పడుతున్న చిన్న సినిమా నిర్మాతలను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ నిధులను తక్షణమే విడుదల చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి జోసెఫ్ విజయ్ నిర్ణయం తీసుకున్నారు.

224 సినిమాలకు 15 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల- ఏడేళ్ల నిరీక్షణకు తెర- ఆ కుటుంబాలకు దక్కిన దీపావళి కానుక అంటూ! (PTI)
224 సినిమాలకు 15 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల- ఏడేళ్ల నిరీక్షణకు తెర- ఆ కుటుంబాలకు దక్కిన దీపావళి కానుక అంటూ! (PTI)

రూ.15.68 కోట్ల సబ్సిడీ నిధులు మంజూరు

2015 నుంచి 2022 మధ్య కాలంలో నిర్మించిన 224 తమిళ చిత్రాలకు రూ.15.68 కోట్ల సబ్సిడీ నిధులను దళపతి విజయ్ మంజూరు చేశారు. ఈ మేరకు చెన్నైలోని చేపాక్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తమిళనాడు పర్యాటక, సినిమా శాఖల మంత్రి రాజ్‌మోహన్ అరుణాచలం అర్హులైన నిర్మాతలకు చెక్కులను పంపిణీ చేశారు.

ప్రతీ నిర్మాతకు రూ. 7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళ సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సబ్సిడీ విడుదలపై అమ్మ క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత టి. శివ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ఏడేళ్లుగా ఈ నిధుల కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

ఏడేళ్ల నిరీక్షణకు తెర.. నిర్మాతలకు దీపావళి కానుక

"ఏడేళ్లుగా నానా అవస్థలు పడుతున్న 224 మంది తమిళ సినిమా నిర్మాతల జీవితాల్లో సీఎం జోసెఫ్ విజయ్ కొత్త వెలుగులు నింపారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి కొత్త ఆశలు చిగురించేలా చేశారు. ఇది కేవలం సబ్సిడీ మాత్రమే కాదు, సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలకు దక్కిన దీపావళి కానుక" అని నిర్మాత టి శివ అన్నారు.

"సబ్సిడీ పొందిన వారిలో 90 శాతం మంది సినిమాలు తీసి సర్వస్వం కోల్పోయిన సాధారణ నిర్మాతలే ఉన్నారు. ఈ సహాయం వారి జీవితాలకు పునర్జన్మ నిస్తుంది" అని టి శివ పేర్కొన్నారు. ఈ వేగవంతమైన చర్యలకు తోడ్పడిన మంత్రి రాజ్‌మోహన్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక చైతన్యం తెచ్చే చిత్రాలకే ప్రాధాన్యం

విశ్రాంత న్యాయమూర్తి ఎస్.కె. కృష్ణన్ అధ్యక్షతన ఏర్పడిన ప్రత్యేక ఎంపిక కమిటీ 2015-2022 మధ్య విడుదలైన చిత్రాల నాణ్యత, సామాజిక బాధ్యతలను పరిశీలించి ఈ 224 సినిమాలను ఎంపిక చేసింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రాలను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో మంత్రి రాజ్‌మోహన్ మాట్లాడుతూ.. గతంలో దర్శకుడు భారతిరాజా తీసిన 'కరుత్తమ్మ' (1994) వంటి సినిమాలు ఆడశిశు హత్యలపై సమాజంలో ఎంతటి గొప్ప చైతన్యాన్ని తెచ్చాయో గుర్తుచేశారు.

వ్యాపార దృక్పథంతో కాకుండా

"కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక స్పృహతో సినిమాలు తీసే నిర్మాతలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత. భవిష్యత్తులో ఇచ్చే రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా మాత్రమే అందజేస్తాం" అని మంత్రి స్పష్టం చేశారు.

టాలీవుడ్ నేర్చుకోవాల్సిన పాఠం

తెలుగు సినీ పరిశ్రమలో కూడా అనేక చిన్న సినిమాలు థియేటర్లు దొరక్క, నిర్మించిన తర్వాత ఓటీటీలు పట్టించుకోక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. తమిళనాడులో సీఎం విజయ్ సర్కార్ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం ఇక్కడి చిన్న నిర్మాతలకు కూడా కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చిన్న సినిమాలను ఆదుకునేలా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు సకాలంలో అందించాలని టాలీవుడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More