The Paradise Collection: నాని ది ప్యారడైజ్ బాక్సాఫీస్ బీభత్సం- తొలిరోజే రూ.75 కోట్లు- బాహుబలి, వార్ రికార్డ్ అవుట్!
Nani The Paradise Box Office Collection Day 1: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. నెగెటివ్ రివ్యూలను తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
Nani The Paradise 1st Day Worldwide Box Office Collection: తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' థియేటర్లలోకి వచ్చి రావడంతోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

వరల్డ్ వైడ్‌గా 75 కోట్లు
ప్రీమియర్ షోల నుంచే వసూళ్ల పరంపర ప్రారంభించిన ది ప్యారడైజ్ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. నాని కెరీర్‌లోనే ఇది అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా మొదటి స్థానంలో నిలిచింది.
దేశీయంగా, ఓవర్సీస్‌లో కలెక్షన్ల సునామీ
బాక్సాఫీస్ అంకెల వివరాల్లోకి వెళ్తే.. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి వేసిన పెయిడ్ ప్రీమియర్ల ద్వారానే భారత్‌లో ఈ సినిమా రూ.11.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. గురువారం (సెప్టెంబర్ 24) రోజున పూర్తిస్థాయిలో థియేటర్లలోకి వచ్చి మరో రూ.34.60 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.
దీంతో ఒక్క భారత్‌లోనే తొలిరోజు మొత్తంగా ది ప్యారడైజ్ సినిమా రూ.46 కోట్ల నెట్, రూ.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ భారీ వసూళ్లకు తెలుగు వెర్షన్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. డబ్బింగ్ భాషలైన హిందీ, తమిళ వెర్షన్లు రెండూ కలిపి ఇప్పటివరకు రూ.4 కోట్లలోపే వసూలు చేశాయి.
తుడిచిపెట్టేసిన ప్యారడైజ్
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ది ప్యారడైజ్ చిత్రం సంచలనం సృష్టించింది. ప్రీమియర్లు, మొదటి రోజు వసూళ్లు కలిపి అంతర్జాతీయ మార్కెట్‌లో 2 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును తాకింది నాని ది ప్యారడైజ్ సినిమా.
గతేడాది విడుదలైన నాని 'హిట్ 3' సినిమా సాధించిన రూ.40 కోట్ల ఓపెనింగ్ రికార్డును 'ది ప్యారడైజ్' చాలా సునాయాసంగా తుడిచిపెట్టేసింది. తొలిరోజే రూ.75 కోట్లు సాధించడంతో భారతీయ సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ టాప్-40 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో 'ది ప్యారడైజ్' చేరింది.
'బాహుబలి', 'వార్' రికార్డులు క్రాస్
బాలీవుడ్ హిట్ చిత్రం 'స్త్రీ 2' (రూ.80 కోట్లు) రికార్డుకు సమీపంలో నిలిచిన ఈ సినిమా, భారతీయ చిత్రసీమలో బెంచ్‌మార్క్‌గా నిలిచిన 'బాహుబలి: ది బిగినింగ్' (రూ.73 కోట్లు), హృతిక్ రోషన్ 'వార్' (రూ.74 కోట్లు) చిత్రాల తొలిరోజు రికార్డులను సైతం అధిగమించడం విశేషం.
'దసరా' కాంబో మ్యాజిక్.. అసలు కథేంటంటే?
'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం కావడంతో ది ప్యారడైజ్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ విషయానికి వస్తే.. 'ప్యారడైజ్' అనే ఒక ఊహాజనిత ప్రాంతంలో నివసించే 'సవారీ' అనే తెగ ప్రజల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ప్రభుత్వం నుంచి చట్టబద్ధమైన గుర్తింపు పొందడానికి, తమను దోచుకుంటున్న ఒక దౌర్జన్యకరమైన భూస్వామ్య వర్గం నుంచి తప్పించుకోవడానికి ఆ తెగ చేసే ఆత్మగౌరవ పోరాటమే ఈ సినిమా.
విజయంవైపు ది ప్యారడైజ్
ఇక ది ప్యారడైజ్ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించారు. విమర్శకుల నుంచి కొన్ని నెగెటివ్ అభిప్రాయాలు వచ్చినప్పటికీ, మాస్ ఆడియన్స్ ఆదరణతో ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


