తు యా మై మూవీ రివ్యూ- స్విమ్మింగ్ పూల్‌లో మొసలి బారిన పడే ప్రేమ జంట- రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
బ్యూటిపుల్ షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రేమ జంటగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తు యా మై. బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి తు యా మై రివ్యూలో తెలుసుకుందాం. .
బాలీవుడ్‌లో వెరైటీ కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుల్లో బెజోయ్ నంబియార్ ఒకరు. ఆయన దర్శకత్వంలో, స్టార్ కిడ్ అండ్ బ్యూటిపుల్ షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తు యా మై’ (Tu Yaa Main).

2018 నాటి థాయ్ చిత్రం 'ది పూల్'ఆధారంగా తెరకెక్కింది ఈ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్. వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 13న థియేటర్లలో తు యా మై సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో? నేటి తు యా మై రివ్యూలో చూద్దాం.
కథ:
అవని షా (షనాయా కపూర్) మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా (ఆదర్శ్ గౌరవ్) నలసోపారాకు చెందిన అప్‌కమింగ్ రాపర్. భిన్నమైన లోకాల్లో బతికే వీరిద్దరు ఓ కొలాబరేషన్ వీడియో ద్వారా కలుసుకుంటారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
అవని షా విలాసవంతమైన జీవితం మారుతిని ఆకర్షిస్తే, అతడిలో ఉండే నిజాయితీ ఆమెకు నచ్చుతుంది. ఈ క్రమంలో గోవా వెళ్తున్న సమయంలో వారు అనుకోకుండా ఒక పాడుబడిన హోటల్‌లో చిక్కుకుపోతారు.
ఆ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేద్దామనుకున్న వారు మొసలి బారిన పడతారు. ఆ ప్రాణాంతక పరిస్థితి నుంచి వారు ఎలా బయటపడ్డారు? ప్రాణాలు రక్షించుకునే సమయంలో వారు ఎదుర్కొన్న సవాళ్లేంటి? మొసలి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? లేదా మొసలికే బలి అయిపోయారా? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సినిమా ఫస్ట్ హాఫ్ యువత మధ్య ఉండే ప్రేమ, ఆకర్షణతో సాదాసీదాగా సాగినప్పటికీ.. సెకండ్ హాఫ్ మాత్రం అసలైన 'సర్వైవల్ థ్రిల్లర్' మోడ్‌లోకి వెళ్తుంది. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ సన్నివేశాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. కొన్ని చోట్ల ఈ థ్రిల్లర్ ఎలిమెంట్స్ 'ఖూన్ భరీ మాంగ్' వంటి పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి.
"నీ పుణ్యమా అని నా గోవా ట్రిప్ గల్లీ బాయ్ నుంచి సైరాట్‌లా మారిపోయింది" అని హీరో మారుతి అనే డైలాగ్ వారి మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలను చమత్కారంగా చెప్తుంది. దర్శకుడు బెజోయ్ కేవలం భయాన్ని మాత్రమే కాకుండా, క్లాస్ డిఫరెన్సెస్ (అంతస్తుల భేదాలు) అనే అంశాన్ని కూడా కథలో చక్కగా ఇమిడ్చారు.
సినిమా సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించినట్లు అనిపించినా, సడన్‌గా వచ్చే జంప్ స్కేర్స్ (భయపెట్టే సీన్లు) ప్రేక్షకులను మళ్లీ కథలోకి లాగుతాయి. రొమాంటిక్ సీన్స్, హారర్ ఎలిమెంట్స్‌తో సినిమాను మలిచారు. క్లైమాక్స్ బాగుంది.
నటీనటుల ప్రతిభ
ఆదర్శ్ గౌరవ్: రాపర్ పాత్రలో ఆదర్శ్ గౌరవ్ మరోసారి అదరగొట్టారు. ఒక సాధారణ యువకుడి బాడీ లాంగ్వేజ్ నుంచి రాపింగ్ చేసేటప్పుడు ఉండే వేగం వరకు అన్నింటిలోనూ పరిణతి చూపించారు.
షనయ కపూర్: ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ ఫ్లాప్ తర్వాత షనయ కపూర్ నటించిన సినిమా ఇది. అవని షా పాత్రకు న్యాయం చేసింది షనయ. ఉత్కంఠభరిత సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఊహించని పర్ఫామెన్స్‌తో షనయా అట్రాక్ట్ చేసింది.
సాంకేతిక వర్గం: రెమీ దలై సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. స్విమ్మింగ్ పూల్ వంటి పరిమిత ప్రదేశంలో కూడా క్లాస్ట్రోఫోబిక్ (ఊపిరాడనంతటి ఉత్కంఠ) ఫీల్‌ను తన కెమెరా పనితనంతో తీసుకొచ్చారు. బీజీఎమ్ కూడా బాగా వర్కౌట్ అయింది.
ప్లస్ పాయింట్స్:
ఆదర్శ్ గౌరవ్ నటన
సెకండ్ హాఫ్‌లో వచ్చే థ్రిల్లింగ్ సీన్లు
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించే సెకండ్ హాఫ్
కొంత మేర లాజిక్‌కు దూరంగా ఉండే సీన్లు
ఫైనల్‌గా చెప్పాలంటే?
బాలీవుడ్‌లో ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ ప్రయత్నాలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. ఆ విషయంలో దర్శకుడు బెజోయ్ నంబియార్ సఫలమయ్యారు. కొన్ని చోట్ల సినిమా కాస్త అతిగా అనిపించినా, మొత్తం మీద ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ చూసిన అనుభూతిని మిగిలిస్తుంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు తు యా మైపై లుక్కేయొచ్చు.
రేటింగ్: 2.5/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


