ఎండలో బైక్ నడిపేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. వేడి నుండి తప్పించుకునేందుకు చిట్కాలు!

Summer Bike Riders Tips : వేసవిలో బైకుల మీద ఎక్కువగా తిరిగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ దూరాలు ప్రయాణించకూడదు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

Published on: Apr 24, 2026, 11:03:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూర్యుడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. బయటకు వెళ్లాలంటే.. వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజురోజుకీ వేడి పెరుగుతుండటంతో ఉదయం 9 గంటలకే సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అయితే చాలా మంది ఆఫీసులకు వెళ్లేవారి, అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక గిగ్‌వర్కర్ల పరిస్థితి దారుణం. బస్సుల్లో వెళ్లినా ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఇక ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మండుటెండలో బైక్ నడుపుతూ.. ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోవడం చెప్పలేని బాధ.

వేసవి బైక్ రైడింగ్ చిట్కాలు
వేసవి బైక్ రైడింగ్ చిట్కాలు

ఇంతటి తీవ్రమైన వేడిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. డీహైడ్రేషన్, తీవ్రమైన అలసట, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందువల్ల ఎండలో బైక్ నడుపుతున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి.

అన్నిటికంటే ముందు శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడం ఉత్తమం. బైక్ నడుపుతున్నప్పుడు పొట్టి చేతుల చొక్కాలకు బదులుగా ఫుల్ హ్యాండ్స్ ఉన్నా చొక్కాలు, కాటన్ దుస్తులు ధరించడం వల్ల చర్మాన్ని సూర్యకిరణాల నుండి రక్షించుకోవచ్చు. దీనివల్ల మీ చేతులు నల్లబడకుండా ఉంటాయి. మీ శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది.

హెల్మెట్ ధరించినప్పుడు చెమట మీ జుట్టుకు, ముఖానికి హాని కలిగించవచ్చు. దీనిని నివారించడానికి మీ తల చుట్టూ ఒక పలుచని స్కార్ఫ్ లేదా చేతి రుమాలు కట్టుకుని, దానిపై హెల్మెట్ ధరించడం వల్ల అది చెమటను పీల్చుకుని, మీ ముఖాన్ని, మెడను చల్లబరుస్తుంది. జుట్టు కూడా పాడు అవ్వదు.

ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు శరీరం డీహైడ్రేట్ అవ్వడం సాధారణం. మీతో ఎల్లప్పుడూ ఒక నీటి సీసాను తీసుకెళ్లడం మంచిది. ప్రయాణ సమయంలో క్రమం తప్పకుండా నీరు తాగడం మిమ్మల్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. అదేవిధంగా ఖాళీ కడుపుతో ఎండలో బైక్ నడపడం మానుకోవాలి. తేలికపాటి భోజనం చేయడం అలసట, నీరసాన్ని నివారిస్తుంది. ఖాళీ కడుపుతో ప్రయాణించడం వల్ల ఎండ ప్రభావం పెరిగి, తల తిరగడం లేదా వడదెబ్బ తగలవచ్చు.

హెల్మెట్ తలను రక్షించినప్పటికీ.. కళ్ళను కాపాడుకోవడానికి నాణ్యమైన సన్ గ్లాసెస్ పెట్టుకోవడం ముఖ్యం. యూవీ కిరణాలను నిరోధించే కళ్ళద్దాలను ఉపయోగించడం వల్ల కళ్ళు చల్లబడతాయి, ప్రత్యక్ష సూర్యరశ్మి నుండి రక్షణ దొరుకుతుంది. మీరు ఎక్కువసేపు ట్రాఫిక్‌లో ఉండాల్సి వస్తే బైక్ ఇంజిన్‌ను ఆపివేయడం మంచిది. దీనివల్ల వాహనం నుండి వెలువడే వేడి తగ్గుతుంది.

ఎక్కువ ప్రయాణాలు చేసేవారు తమ బైక్‌లను నిరంతరాయంగా నడపకూడదు. చెట్ల నీడలో లేదా ఏకాంత ప్రదేశాలలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఎక్కువ సేపు ఎండలో నిరంతరాయంగా ప్రయాణించడం శరీరానికి మంచిది కాదు. బయటకు వెళ్లే ముందు చర్మానికి సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల ఎండదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది. చర్మ క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది.

ప్రయాణిస్తున్నప్పుడు మీకు తలనొప్పి, వాంతులు, అధికంగా చెమట పట్టడం లేదా కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వాహనాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. ఇవి వడదెబ్బ ప్రారంభ సంకేతాలు అని గుర్తుంచుకోండి. నిర్లక్ష్యం చేయవద్దు, అనవసరంగా ఎండకు గురికాకుండా ఉండాలి. వేసవిలో బైక్ మీద వెళ్లేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమదం కావొచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More