Vinayaka Chavithi 2026 : మట్టి గణపతులకే జై! ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలను ఎందుకు ఎంచుకోవాలి?
వినాయక చవితి ఉత్సవాల వేళ దేశవ్యాప్తంగా పర్యావరణ హిత గణపతుల హవా పెరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు సీడ్ గణపతులను ప్రోత్సహిస్తుండగా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు జల వనరులకు కలిగిస్తున్న ముప్పు, ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలను ఎంచుకుంటే కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక విశ్లేషణ.
వినాయక చవితి శోభతో దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈసారి చవితి వేడుకల్లో ఒక అద్భుతమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో, వినాయక విగ్రహాల ఎంపికలో ప్రజలు మట్టి, సీడ్ గణపతులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. రంగంలోకి సినీ ప్రముఖులు!
మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' పిలుపుతో పర్యావరణ ఉద్యమం మరింత ఊపందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కథానాయిక పూజా హెగ్డే వంటి ప్రముఖులు ఈ 'సీడ్ గణేష్' ప్రతిమలను స్వీకరించి, తమ అభిమానులను సహజసిద్ధమైన మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు.
క్యాంపెయిన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంటూ, ప్రతి ఒక్కరూ ప్రకృతికి హాని చేయని మట్టి గణపతులను మాత్రమే ఇంట్లోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. మరోవైపు నవీ ముంబైలో 10,000 మంది విద్యార్థులు శాడు మట్టితో విగ్రహాలు తయారుచేసి గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా పాల్గొన్నారు.
ఏంటీ ఈ 'సీడ్ గణేష్'? దీని ప్రత్యేకత ఏంటి?
సహజ సిద్ధమైన మట్టి, కొబ్బరి పీచు (Cocopeat & Coconut fibre) కాంబినేషన్‌తో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. వీటి కడుపులో వేప, చింత వంటి మన దేశవాళీ చెట్ల విత్తనాలను నిక్షిప్తం చేస్తారు. నదులు, చెరువుల వద్దకు వెళ్లకుండా.. పూజ ముగిసాక ఇంట్లోనే ఒక కుండీలో నీరు పోస్తే విగ్రహం కరిగిపోతుంది. కొద్దిరోజుల్లోనే ఆ విగ్రహం ఉన్న స్థానంలో విత్తనాలు మొలకెత్తి పచ్చని మొక్కగా మారుతాయి.
ప్రజల్లో ఈ ఆలోచన ఎంతగా చొచ్చుకెళ్లిందో గణాంకాలే చెబుతున్నాయి. గత వారం రోజుల్లో గూగుల్‌లో 'ఈకో ఫ్రెండ్లీ గణపతి' కోసం చేసే సెర్చ్‌లు ఏకంగా 120 శాతం పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో #ecofriendlyganpati హ్యాష్‌ట్యాగ్‌తో 71.9 వేలకు పైగా పోస్టులు, రీల్స్ నమోదయ్యాయి.
పీఓపీ విగ్రహాలతో పొంచి ఉన్న జల గండం
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) తో తయారు చేసే విగ్రహాలు నీటిలో అంత సులభంగా కరగవు. దీనికి తోడు వాటికి వేసే రసాయనిక రంగులు, ప్లాస్టిక్ అలంకరణలు జల వనరులకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి.
"పీఓపీ అనేది కృత్రిమమైన, కరగని పదార్థం. దీనికి పూసే విషపూరితమైన రంగులు, కెమికల్స్ నీటి అడుగుభాగానికి చేరి జలచరాల ఆక్సిజన్‌ను హరిస్తాయి. చేపలు వీటిని ఆహారంగా భావించి తిని ప్రాణాలు కోల్పోతున్నాయి," అని ఫారెస్ట్ స్పిరిట్ లెర్నింగ్ సంస్థ వ్యవస్థాపకురాలు జ్యోతి రాఘవన్ ఖండూజా హెచ్చరించారు.
సమస్య తీవ్రతను మహారాష్ట్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో ఒక్క ముంబైలోనే 1.97 లక్షల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయగా, ఏకంగా 1,982 మెట్రిక్ టన్నుల పీఓపీ వ్యర్థాలు మిగిలిపోయాయని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఏటా 4,500 టన్నుల పీఓపీని విగ్రహాల కోసం వాడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 2026 గణేష్ ఉత్సవాల కోసం ఉచితంగా 858 టన్నుల 'శాడు మట్టి'ని శిల్పులకు బీఎంసీ పంపిణీ చేసింది.
రంగుల ఎంపికలోనూ జాగ్రత్త అవసరం..
"ఏ పదార్థమైనా మితిమీరి వాడితే సమస్యే. పండుగను ఆపడం పరిష్కారం కాదు, విధానపరమైన మార్పులు తీసుకురావడం ద్వారా సమగ్ర వ్యవస్థను పర్యావరణహితంగా మార్చాలి," అని ఇస్రో మాజీ శాస్త్రవేత్త, పర్యావరణ నిపుణురాలు పంక్తి పాండే స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు చెందిన క్లైమేట్ ఎడ్యుకేటర్, జీరో వేస్ట్ అడ్వొకేట్ రితికా చావ్లా రంగుల ప్రాధాన్యతను వివరిస్తూ కీలక సూచన చేశారు:
"విగ్రహానికి వేసే రంగులు, మెరుపులు కూడా ముఖ్యమే. ఆక్రిలిక్ పెయింట్స్ ప్లాస్టిక్ ఆధారితమైనవి. మట్టి విగ్రహం చేసినప్పటికీ రసాయన రంగులు వేస్తే అది నిజమైన ఈకో-ఫ్రెండ్లీ విగ్రహం కాజాలదు. ఆర్గానిక్ లేదా సహజ రంగులు వాడినప్పుడే పూర్తి ప్రయోజనం ఉంటుంది," అని ఆమె పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


