Breast Cancer Risk Factors : మహిళల్లో రొమ్ము క్యాన్సర్- కారణాలు, తీసుకోగల జాగ్రత్తలు..
మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న రొమ్ము క్యాన్సర్ వ్యాధికి జీవనశైలి, జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణాలు. మన చేతుల్లో లేని ప్రమాద కారకాలతో పాటు తగిన జాగ్రత్తలతో అదుపు చేయగలిగే అంశాలపై ప్రముఖ వైద్యురాలు డాక్టర్ తాప్తి సేన్ అందించిన సమగ్ర విశ్లేషణను ఇక్కడ చదవండి..
మహిళల ఆరోగ్యాన్ని వేధిస్తున్న తీవ్రమైన వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్ మొదటి వరుసలో నిలుస్తోంది! గత రెండు దశాబ్దాలుగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడం, మహిళల్లో అవగాహన పెరగడం వల్ల వ్యాధి నిర్ధారణ కేసులు ఎక్కువ సంఖ్యలో బయటపడుతున్నాయి. అయినప్పటికీ ఈ తరహా క్యాన్సర్ వెనుక సంక్లిష్టమైన జన్యు, హార్మోన్, పర్యావరణ, జీవనశైలి మార్పులు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇండియా వంటి ఆసియా దేశాల్లో పాశ్చాత్య ప్రాంతాలతో పోలిస్తే చాలా చిన్న వయసులోనే మహిళలు ఈ వ్యాధి బారిన పడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్ ముప్పునకు దారితీసే అంశాలను ముందుగానే గుర్తించి నివారించడం అత్యంత ఆవశ్యకమని కోల్‌కతాలోని ఆర్జీ స్టోన్ ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తాప్తి సేన్ వెల్లడించారు. ఈ వ్యాధికి కారణమయ్యే ప్రమాద కారకాలను మన నియంత్రణలో లేనివి, మన ప్రవర్తన ద్వారా అదుపు చేయగలిగేవి అని రెండు రకాలుగా వర్గీకరించారు. అవి..
రొమ్ము క్యాన్సర్- మన చేతుల్లో లేని ప్రమాద కారకాలు..
వయసు పెరగడం: వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం సాధారణంగా పెరుగుతుంది. అయితే తక్కువ వయసు ఉన్నంత మాత్రాన ఈ వ్యాధి రాదని నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ సేన్ స్పష్టం చేశారు.
కుటుంబ చరిత్ర, జన్యువులు: "తల్లి, సోదరి లేదా కుమార్తె వంటి మొదటి వరుస రక్తసంబంధీకుల్లో ఎవరికైనా చిన్న వయసులోనే రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉంటే, ఆ కుటుంబంలో ఉండే ఇతర మహిళలకు కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది," అని డాక్టర్ సేన్ వివరించారు. ముఖ్యంగా వారసత్వంగా వచ్చే BRCA1, BRCA2 జన్యు ఉత్పరివర్తనాలు (Mutations) రొమ్ము, అండాశయ క్యాన్సర్ల ముప్పును గణనీయంగా పెంచుతాయని తెలిపారు.
వ్యక్తిగత వైద్య చరిత్ర: చిన్న వయసులో ఉన్నప్పుడు ఛాతీ భాగానికి రేడియేషన్ థెరపీ పొందిన మహిళల్లో భవిష్యత్తులో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ! అంతేకాకుండా, గతంలో రొమ్ములో వచ్చిన కొన్ని రకాల గడ్డలు కూడా ముప్పును పెంచుతాయి.
హార్మోన్లు, రీప్రొడక్టివ్ అంశాలు: మేనోపాజ్ (రుతుక్రమం ఆగడం) తర్వాత ఈస్ట్రోజెన్-ప్రొజెస్టిన్ కాంబినేషన్ హార్మోన్ థెరపీని సుదీర్ఘకాలం వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని రకాల గర్భనిరోధక మాత్రల వల్ల కూడా స్వల్ప ప్రమాదం ఉంటుంది. అయితే వైద్యుని సలహా లేకుండా హార్మోన్ మాత్రలను సొంతంగా ఆపకూడదని, లాభనష్టాలను సమీక్షించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు.
మన చేతుల్లో ఉండే జీవనశైలి కారకాలు..
శరీర బరువు నిర్వహణ: మేనోపాజ్ దశ దాటిన తర్వాత అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. పోషకాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
మద్యం, ధూమపానం: మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అలాగే ధూమపానం చేయడం వల్ల అనేక రకాల శరీర అవయవాల క్యాన్సర్లతో పాటు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం హెచ్చుతుంది. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా మానడం శ్రేయస్కరం.
"ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రమాద కారకాలు ఉన్నంత మాత్రాన ప్రతీ మహిళకు క్యాన్సర్ వస్తుందని అర్ధం కాదు. అదే సమయంలో ఎలాంటి ప్రమాద సంకేతాలు లేనివారికి కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంది! కాబట్టి మన చేతుల్లో లేని అంశాల గురించి ఆందోళన చెందకుండా, మార్చుకోగలిగే జీవనశైలిపై దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా వయసుకు తగిన రీతిలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమమైన మార్గం," అని డాక్టర్ సేన్ స్పష్టం చేశారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పూర్తి అవగాహన కోసం మీ వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


