Heart health : మీ గుండె పదిలంగా ఉండాలంటే- ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇవి చేయాల్సిందే..
ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, నిద్రలేమి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజరాజ్ మీ గుండెను కాపాడుకోవడానికి ఉదయం నుంచి రాత్రి వరకు పాటించాల్సిన సులభమైన అలవాట్లను వివరించారు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో గంటల తరబడి కూర్చుని పనిచేయడం, మితిమీరిన కెఫీన్ (కాఫీ/టీ) వాడకం, రాత్రిపూట ఆలస్యంగా ఫోన్ చూడటం వంటివి మన గుండెపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే మీ గుండె ఆరోగ్యానికి ఇవి అస్సలు మంచివి కావు అని ప్రముఖ లోంజివిటీ మెడిసిన్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజరాజ్ అంటున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పాటించాల్సిన ఒక ప్రత్యేక దినచర్యను ఆయన పంచుకున్నారు.

గుండెకు మంచి చేస్ మార్నింగ్ హాబిట్స్..
డాక్టర్ సంజయ్ ప్రకారం.. నిద్రలేవగానే ఫోన్ చూడటం కంటే ప్రకృతి సిద్ధమైన సూర్యరశ్మిని కళ్లారా చూడటం ఎంతో ముఖ్యం.
సూర్యరశ్మి: “మీ మెదడులోకి ఫోన్లోని కంటెంట్ వెళ్లేకంటే ముందే, మీ కళ్లలోకి సూర్యరశ్మి వెళ్లాలి,” అని ఆయన సూచించారు. ఉదయాన్నే కొద్దిసేపు బయట తిరగడం వల్ల శరీరానికి అవసరమైన సంకేతాలు అందుతాయి.
ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్: కాఫీ తాగడానికి ముందే ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం (గుడ్లు, గ్రీక్ యోగర్ట్ లేదా ప్రోటీన్ స్మూతీ) తీసుకోవాలి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడమే కాకుండా, నాడీ వ్యవస్థను ఉల్లాసంగా ఉంచుతుంది.
ఇవి కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. అనంతరం గుండె ఆరోగ్యానికి రోజంతా ఏం చేయాలో కూడా వివరించారు.
మధ్యాహ్నం: భోజనం తర్వాత నడక తప్పనిసరి..
కార్పొరేట్ ఆఫీసుల్లో గంటల తరబడి కుర్చీకే అతుక్కుపోవడం ఒక ప్రమాదకరమైన అలవాటని డాక్టర్ హెచ్చరించారు.
10 నిమిషాల నడక: మధ్యాహ్న భోజనం తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నడవడం వల్ల గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఆహారం: మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్, పీచు పదార్థం (ఫైబర్), కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలని ఆయన సిఫార్సు చేశారు.
సాయంత్రం, రాత్రి: విశ్రాంతికి ప్రాధాన్యత..
సాయంత్రం వేళల్లో కఠినమైన వ్యాయామాల కంటే సున్నితమైన కదలికలు మేలని డాక్టర్ సంజయ్ తెలిపారు.
వ్యాయామం: వెయిట్ ట్రైనింగ్, యోగా లేదా పిల్లలతో ఆడుకోవడం వంటివి శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి.
డిజిటల్ డిటాక్స్: రాత్రి నిద్రపోయే ముందు లైట్లు తక్కువగా ఉంచుకోవాలి. నిద్రకు ముందు ఫోన్ వాడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది.
నిద్ర: "నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, అదొక హృదయ సంబంధిత ఔషధం," అని ఆయన పేర్కొన్నారు.
గుండె ఆరోగ్యం అంటే ఏదో ఒక రోజు చేసేది కాదు, అది ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న పనుల ఫలితం. "కదలడం, సరిపడా ప్రోటీన్ తీసుకోవడం, సూర్యరశ్మిని పొందడం, గ్లూకోజ్ నిర్వహణ, సరైన విశ్రాంతి.. ఇవే గుండెను కాపాడే ఐదు సూత్రాలు," అని డాక్టర్ సంజయ్ భోజరాజ్ ముగించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటే, దానికి ముందు ప్రోటీన్ ఆహారం ఎందుకు తీసుకోవాలి?
చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్, ‘కార్టిసోల్’ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అస్థిరంగా మారి, గుండెపై ఒత్తిడి పడుతుంది. కాఫీ తాగడానికి ముందు గుడ్లు లేదా పెరుగు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నిలకడగా ఉంటుంది, నాడీ వ్యవస్థ ప్రశాంతంగా రోజును ప్రారంభించడానికి సహాయపడుతుంది.
2. మధ్యాహ్న భోజనం తర్వాత కేవలం 10 నిమిషాల నడక గుండెకు నిజంగా మేలు చేస్తుందా?
అవును, ఖచ్చితంగా మేలు చేస్తుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఆ సమయంలో కనీసం 10 నిమిషాల పాటు అటు ఇటు నడవడం వల్ల కండరాలు ఆ గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకుంటాయి. ఇది డయాబెటిస్ ముప్పును తగ్గించడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారికి, ఈ చిన్న నడక గుండెకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


