...
...
Next Story

పిల్లల గుండె శస్త్రచికిత్స.. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు

పిల్లల గుండె శస్త్రచికిత్స గురించి తల్లిదండ్రుల్లో చాలా భయాలు ఉంటాయి. దీనిగురించి అనేక విషయాలు తెలుసుకోవాలి. తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ దిలీప్ రాట్టి చెప్పారు.

Published on: Aug 29, 2026, 13:28:22 IST
Advertisement

ఏ తల్లిదండ్రులకైనా “మీ బిడ్డకు గుండెలో సమస్య ఉంది.. ఆపరేషన్ అవసరం కావచ్చు” అనే మాట వినగానే భయం కలగడం సహజం. “ఇంత చిన్న వయసులో గుండె ఆపరేషన్ ఎలా చేస్తారు? మా బిడ్డకు ఏమైనా ప్రమాదమా? మళ్లీ మామూలుగా స్కూలుకు వెళ్లగలడా? అందరి పిల్లల్లా ఆడుకోగలడా? భవిష్యత్తులో సాధారణ జీవితం గడపగలడా?” ఇలా ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రుల మనసులో మెదులుతాయి.

ప్రతీకాత్మక  చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల గుండె వైద్యం, శస్త్రచికిత్స రంగం గత కొన్ని సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. పుట్టుకతో వచ్చే అనేక గుండె సమస్యలకు ఇప్పుడు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. సరైన సమయంలో చికిత్స పొందిన చాలామంది పిల్లలు తిరిగి సాధారణ జీవితంలోకి వెళ్లగలుగుతున్నారు.

పిల్లలకు గుండె ఆపరేషన్ ఎందుకు అవసరమవుతుంది?

కొంతమంది పిల్లలు గుండె నిర్మాణంలో లోపాలతో పుడతారు. వీటిని పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు (Congenital Heart Defects) అంటాం. సాధారణంగా చెప్పాలంటే.. గుండెలో రంధ్రం ఉండవచ్చు, వాల్వ్ లేదా రక్తనాళం సన్నగా ఉండవచ్చు, రక్తప్రసరణ మార్గంలో అసాధారణ అనుసంధానం ఉండవచ్చు లేదా మరికొన్ని క్లిష్టమైన సమస్యలు ఉండవచ్చు. అయితే గుండెలో సమస్య ఉందంటే ప్రతి బిడ్డకూ వెంటనే ఆపరేషన్ అవసరం అని కాదు.

కొన్ని చిన్న లోపాలను క్రమం తప్పకుండా పరీక్షిస్తూ గమనిస్తే సరిపోతుంది. కొన్ని సమస్యలను కాథెటర్ ద్వారా చికిత్స చేయవచ్చు. మరికొన్నింటికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఎప్పుడు చికిత్స చేయాలి అనేది గుండె సమస్య రకం, బిడ్డ వయసు, బరువు, లక్షణాలు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

కొంతమంది పిల్లలకు గుండె సమస్య ఉన్నప్పటికీ బయటకు చూస్తే ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఆడుకుంటారు, స్కూలుకు వెళ్తారు. దీంతో “ఇప్పుడేం ఇబ్బంది లేదు కదా... ఇంకొంతకాలం చూద్దాం” అని తల్లిదండ్రులు చికిత్సను వాయిదా వేయవచ్చు.

కానీ కొన్ని గుండె సమస్యలను ఎక్కువకాలం వదిలేస్తే క్రమంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం, గుండె పనితీరు దెబ్బతినడం, పిల్లల ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల పిల్లల గుండె వైద్యుడు లేదా కార్డియాక్ సర్జన్ ఒక నిర్దిష్ట సమయంలో చికిత్స అవసరమని సూచిస్తే, భయంతో వాయిదా వేయకుండా ఎందుకు ఆ సమయంలో చేయాలో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.

ఆపరేషన్ తర్వాత ఏం జరుగుతుంది?

శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత సాధారణంగా బిడ్డను పిల్లల కార్డియాక్ ఐసీయూకి తరలిస్తారు. అక్కడ గుండె పనితీరు, శ్వాస, రక్తపోటు, మూత్ర విసర్జన, శరీరంలోని ద్రవాల సమతుల్యత వంటి అంశాలను వైద్య బృందం నిరంతరం గమనిస్తుంది. నొప్పి తగ్గించడం, సరైన పోషణ అందించడం, ఇన్ఫెక్షన్ రాకుండా చూడటం కూడా చికిత్సలో ముఖ్యమైన భాగాలు.

ఆపరేషన్ తర్వాత మొదటిసారి ఐసీయూలో తమ బిడ్డను చూసినప్పుడు చుట్టూ మానిటర్లు, ట్యూబులు, వైర్లు కనిపించి తల్లిదండ్రులు భయపడవచ్చు. కానీ వాటిలో చాలావరకు బిడ్డ కోలుకునే సమయంలో శరీరానికి సహాయం చేయడానికి, ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనించడానికి ఉపయోగించే సాధనాలే. బిడ్డ ఆరోగ్యం మెరుగుపడే కొద్దీ వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తారు.

ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కోలుకునే ప్రక్రియ కొనసాగుతుంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతోనే చికిత్స పూర్తయినట్లు కాదు. వైద్యులు సూచించిన మందులను సమయానికి ఇవ్వాలి. ఆపరేషన్ గాయాన్ని శుభ్రంగా ఉంచాలి. సూచించిన తేదీల్లో తప్పకుండా ఫాలో-అప్‌కు రావాలి. ఆపరేషన్‌ను బట్టి కొంతకాలం కొన్ని శారీరక కార్యకలాపాలను పరిమితం చేయాల్సి రావచ్చు.

మొదటి కొన్ని వారాల్లో పిల్లలు త్వరగా అలసిపోవచ్చు. ఆకలి కొద్దిగా తగ్గవచ్చు. తిరిగి పూర్తిగా మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ప్రతి బిడ్డ కోలుకునే వేగం ఒకేలా ఉండదు.

ఎప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి?

ఆపరేషన్ తర్వాత జ్వరం, గాయం చుట్టూ ఎర్రబడటం లేదా చీము రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పదేపదే వాంతులు, సరిగా ఆహారం తీసుకోకపోవడం, అసాధారణంగా ఎక్కువగా నిద్రపోవడం లేదా పిల్లల సాధారణ చురుకుదనం గణనీయంగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య బృందాన్ని సంప్రదించాలి. “తర్వాతి అపాయింట్‌మెంట్‌లో చూపిద్దాం” అని వేచి ఉండటం కంటే అనుమానం వచ్చినప్పుడే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

గుండె ఆపరేషన్ అనేది పిల్లలకు కేవలం శారీరక అనుభవం మాత్రమే కాదు. కొంతమందిలో అది మానసికంగా కూడా ప్రభావం చూపవచ్చు. ఆపరేషన్ తర్వాత కొందరు పిల్లలు చిరాకు పడవచ్చు, హాస్పిటల్ అంటే భయపడవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు తమ ఛాతీపై ఉన్న మచ్చ గురించి ఆందోళన చెందవచ్చు. “నేను మళ్లీ స్కూలుకు వెళ్లగలనా? నా స్నేహితులతో ఆడుకోగలనా?” అని భయపడవచ్చు. పిల్లల్లో ఇలాంటి ఆందోళన, సాధారణ జీవితంలోకి తిరిగి వెళ్లడానికి సంకోచం ఉండవచ్చు.

ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. బిడ్డతో సానుకూలంగా మాట్లాడండి. వైద్యులు అనుమతించిన తర్వాత క్రమంగా స్కూలుకు, ఆటలకు, స్నేహితులతో గడపడానికి ప్రోత్సహించండి. గుండెకు ఆపరేషన్ జరిగిందనే కారణంతో ఆ బిడ్డను జీవితాంతం “రోగి”లా చూడకండి.

తల్లిదండ్రులకు ఒక చిన్న సందేశం

తమ బిడ్డకు పుట్టుకతో గుండె సమస్య ఉందని తెలిసిన రోజు ఏ తల్లిదండ్రులకైనా చాలా కష్టమైన రోజు. కానీ భయం వల్ల సరైన సమయంలో అందాల్సిన చికిత్స ఆలస్యం కాకూడదు. ఆధునిక పిల్లల గుండె శస్త్రచికిత్స ఎంతో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు చికిత్స చేయడం అత్యంత క్లిష్టంగా భావించిన అనేక గుండె సమస్యలకు ఇప్పుడు మంచి చికిత్సా మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

అయితే ప్రతి బిడ్డ, ప్రతి గుండె సమస్య వేరు. అందుకే వ్యాధి స్వభావం, చికిత్సకు సరైన సమయం, ఆపరేషన్ తర్వాత కోలుకునే విధానం, దీర్ఘకాలిక ఫాలో అప్ గురించి పిల్లల గుండె వైద్యుడు, కార్డియాక్ సర్జన్‌తో స్పష్టంగా చర్చించాలి. చివరిగా ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. మీ బిడ్డ అంటే కేవలం ఒక గుండె జబ్బు కాదు. ఆ చిన్న గుండె వెనుక... పరిగెత్తాలనుకునే ఒక చిన్నారి ఉంది, స్నేహితులతో ఆడుకోవాలనుకునే బాల్యం ఉంది, స్కూలుకు వెళ్లాలనే ఉత్సాహం ఉంది, రేపటి గురించి ఎన్నో చిన్న చిన్న కలలు ఉన్నాయి.

పిల్లల గుండె శస్త్రచికిత్స లక్ష్యం కేవలం గుండెలోని లోపాన్ని సరిచేయడం మాత్రమే కాదు.. ఆ చిన్నారికి తిరిగి తన బాల్యాన్ని, తన కలలను, తన భవిష్యత్తును అందించడానికి ఒక అవకాశం ఇవ్వడం.

డాక్టర్ దిలీప్ రాట్టి,

సీటీవీఎస్ కన్సల్టెంట్,

మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON