మనం యూత్.. మనకేం కాదనుకుంటున్నారా? షుగర్ ముప్పు పొంచి ఉంది.. ఆ 7 లక్షణాలు ఇవే

మధుమేహం ఇప్పుడు వృద్ధులకే పరిమితం కాకుండా యువతను కూడా వేగంగా పలకరిస్తోంది. ఒత్తిడి, అలసటగా భావించి పట్టించుకోని 7 ప్రారంభ లక్షణాలు, పరీక్షల గురించి వైద్య నిపుణులు కీలక విషయాలు వివరించారు.

Published on: Nov 24, 2026, 16:30:50 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మధుమేహం (డయాబెటిస్) అంటే ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో, వృద్ధాప్యంలో వచ్చే సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువతలోనూ టైప్-2 డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, తొలి దశలో కనిపించే లక్షణాలను చాలామంది సాధారణ ఒత్తిడి, అలసట లేదా డీహైడ్రేషన్‌గా పొరబడి పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో యువత గమనించాల్సిన ప్రారంభ లక్షణాలు, సకాలంలో చేయాల్సిన పరీక్షలపై వైద్య నిపుణులు విలువైన సూచనలు చేశారు.

మనం యూత్.. మనకేం కాదనుకుంటున్నారా? షుగర్ ముప్పు పొంచి ఉంది.. ఆ 7 లక్షణాలు ఇవే
మనం యూత్.. మనకేం కాదనుకుంటున్నారా? షుగర్ ముప్పు పొంచి ఉంది.. ఆ 7 లక్షణాలు ఇవే

"40 ఏళ్లు దాటిన తర్వాతే మధుమేహం గురించి ఆలోచించాల్సిన రోజులు పోయాయి. యువత కూడా ఇప్పుడు ఈ ముప్పును ఎదుర్కొంటోంది. ప్రారంభ లక్షణాలను అలసట, ఒత్తిడి, డీహైడ్రేషన్ వంటి రోజువారీ సమస్యలుగా తప్పుగా అంచనా వేయడమే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. దినచర్యలో చిన్న మార్పులా అనిపించేవి, శరీరంలో ఏదో లోపం ఉందనే సంకేతాలు కావచ్చు" అని కళ్యాణ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అర్చనా పేట్ తెలిపారు.

శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోయినా లేదా సమర్థంగా వినియోగించుకోలేకపోయినా టైప్-2 డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు పెరుగుతాయి. కొందరిలో ఆరంభంలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోయినా, సూక్ష్మమైన మార్పులను గుర్తిస్తే వ్యాధిని త్వరగా కనిపెట్టవచ్చు.

"నిరంతర అలసట, పదేపదే చర్మ ఇన్ఫెక్షన్లు లేదా కారణం లేని బరువు మార్పులతో యువకులు నా క్లినిక్‌కు వచ్చినప్పుడు, వారికి డయాబెటిస్ ఉండవచ్చని వారే మొదట అనుమానించరు. వయసు పైబడిన వారికే ఇది వస్తుందని లేదా తాము యువకులం కాబట్టి చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉంటాయని చాలామంది భావిస్తారు. ఈ అంచనా వల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతుంది" అని ముంబయిలోని సూర్య హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ సుయశ్ కులకర్ణి వివరించారు.

యువతలో కనిపించే 7 ప్రారంభ లక్షణాలు

1. తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కనిపించే స్పష్టమైన లక్షణాల్లో తరచుగా మూత్రవిసర్జన ఒకటి. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ పెరిగినప్పుడు మూత్రపిండాలు అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి. దీంతో శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్లి తీవ్రమైన దాహం కలుగుతుంది. "రాత్రిపూట పలుమార్లు మూత్రవిసర్జనకు లేవడం లేదా స్పష్టమైన కారణం లేకుండా తరచూ నీరు తాగాలనిపించడం జరిగితే, రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవాలి" అని డాక్టర్ కులకర్ణి సూచించారు.

2. తగినంత నిద్ర ఉన్నా తగ్గని అలసట

ఒత్తిడి, ఎక్కువ గంటలు పనిచేయడం, క్రమం తప్పిన నిద్ర వల్ల అలసట రావచ్చు. కానీ తగ్గని నీరసం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కూడా సంకేతం కావచ్చు. "గ్లూకోజ్‌ను శరీరం సరిగా వాడుకోలేనప్పుడు విపరీతమైన నీరసం కలుగుతుంది. దీనికి తోడు అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన లేదా కారణం లేని బరువు మార్పులు ఉంటే బ్లడ్ షుగర్ పరీక్ష చాలా అవసరం" అని డాక్టర్ కులకర్ణి చెప్పారు.

3. నిరంతర ఆకలి, కారణం లేని బరువు మార్పులు

తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేయడం లేదా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ మార్చకపోయినా బరువు అకస్మాత్తుగా తగ్గడం వంటివి శరీరం గ్లూకోజ్‌ను సమర్థంగా వినియోగించుకోవడం లేదనడానికి సూచనలు కావచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తి లేదా పనితీరు దెబ్బతిన్నప్పుడు గ్లూకోజ్ వినియోగంపై ప్రభావం పడుతుందని, ఇది నిరంతర ఆకలికి, కారణం లేని బరువు మార్పులకు దారితీయవచ్చని డాక్టర్ పేట్ వివరించారు.

4. మెడ, చంకల వద్ద నల్లని మచ్చలు

చర్మంలో వచ్చే కొన్ని మార్పులు జీవక్రియ సమస్యను సూచిస్తాయి. 'అకాంథోసిస్ నిగ్రికన్స్' వల్ల మెడ, చంకలు, గజ్జ ప్రాంతాల్లో నల్లగా, కొద్దిగా మందంగా లేదా మృదువుగా మచ్చలు ఏర్పడతాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో ముడిపడి ఉంటుంది. దీన్ని చాలామంది టానింగ్ లేదా పిగ్మెంటేషన్‌గా పొరబడతారు. "కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్న యువతలో లేదా పొత్తికడుపు వద్ద కొవ్వు పెరిగిన వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం పరీక్షించడం మంచిది" అని డాక్టర్ కులకర్ణి తెలిపారు.

5. దృష్టి మసకబారడం లేదా మారడం

రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు దృష్టి అప్పుడప్పుడు మసకబారడం వంటి మార్పులు రావచ్చు. గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే కంటిలోని ద్రవ సమతుల్యతపై ప్రభావం పడి, కంటి కటకం ఆకారంలో తాత్కాలిక మార్పు వస్తుంది. "దృష్టి మసకబారడం పదేపదే జరిగితే, దాన్ని కేవలం స్క్రీన్ అలసటకో లేదా కళ్లద్దాల పవర్ మారడానికో పరిమితం చేయకుండా వైద్యులను సంప్రదించాలి" అని డాక్టర్ కులకర్ణి హితవు పలికారు.

6. పదేపదే ఇన్ఫెక్షన్లు, నెమ్మదిగా మానే గాయాలు

ముఖ్యంగా జననాంగాల ప్రాంతం, చర్మం మడతల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు పదేపదే రావడం అధిక బ్లడ్ షుగర్‌కు సంకేతం కావచ్చు. రక్తంలో గ్లూకోజ్ పెరిగితే ఫంగస్ వృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యంపైనా ప్రభావం పడుతుంది. చిన్నపాటి కోతలు, గాయాలు మానడానికి అసాధారణంగా ఎక్కువ సమయం పడుతున్నా పరీక్షించుకోవాలి. "చికిత్స తీసుకున్నా ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ వస్తుంటే, కేవలం ఇన్ఫెక్షన్ వరకే చూడకుండా జీవక్రియ సమస్య ఏమైనా ఉందేమో తనిఖీ చేయాలి" అని డాక్టర్ కులకర్ణి సూచించారు.

7. పెరుగుతున్న నడుము చుట్టుకొలత, పొత్తికడుపు కొవ్వు

"తమ బరువు సాధారణంగానే ఉందని భావించి, జీవక్రియ ముప్పును పట్టించుకోని వారిని నేను చూశాను. నడుము చుట్టుకొలత, కుటుంబ చరిత్ర, ఇతర జీవక్రియ కొలమానాలు అంచనాలో కీలక భాగాలు" అని డాక్టర్ కులకర్ణి స్పష్టం చేశారు.

యువతలో టైప్-2 డయాబెటిస్ ముప్పు ఎందుకు పెరుగుతోంది?

టైప్-2 డయాబెటిస్ నుంచి వయసు పూర్తి రక్షణ ఇవ్వలేదు. కుటుంబ చరిత్ర, కూర్చొని చేసే జీవనశైలి, పొత్తికడుపు ఊబకాయం, క్రమం తప్పిన నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు జీవక్రియ ముప్పును పెంచుతాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్న మహిళలు లేదా గర్భధారణ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) చరిత్ర కలిగిన వారు దీర్ఘకాల ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలి.

"తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో మధుమేహ చరిత్ర ఉన్నవారు ఈ లక్షణాలను తప్పనిసరిగా గమనించాలి. జన్యుపరమైన కారణాల వల్ల వీరికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ చరిత్ర లేని వారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. వయసును బట్టి ఈ లక్షణాలను కొట్టిపారేయకూడదు" అని డాక్టర్ పేట్ అన్నారు.

ఎప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవాలి?

రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేయడానికి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష, హెచ్‌బీఏ1సీ (HbA1c) పరీక్షలను సాధారణంగా ఉపయోగిస్తారు. ఫాస్టింగ్ పరీక్ష నిర్దిష్ట సమయంలో గ్లూకోజ్‌ను చూపిస్తే, హెచ్‌బీఏ1సీ సుమారు మూడు నెలల సగటు రక్త చక్కెర స్థాయిని అంచనా వేస్తుంది. వయసు, వైద్య చరిత్ర, ఇతర కారణాలను బట్టి తగిన పరీక్షలు, వాటి వ్యవధి ఆధారపడి ఉంటాయి.

"ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన డయాబెటిస్ ఉన్నట్లే కాదని యువత తెలుసుకోవాలి. అయినప్పటికీ, వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయమే. వైద్యుల సలహా తీసుకోవాలి. సాధారణ రక్త పరీక్షతో చక్కెర స్థాయి తెలుస్తుంది" అని డాక్టర్ పేట్ తెలిపారు.

"అనారోగ్య లక్షణాలు స్పష్టంగా కనిపించే వరకు వేచి చూడకుండా జీవక్రియ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడమే యువతకు నా సూచన. పదేపదే వచ్చే ఇన్ఫెక్షన్, కారణం లేని అలసట లేదా చర్మంలో మార్పులు డయాబెటిస్‌కు సంకేతం కాకపోవచ్చు. కానీ అవి కొనసాగితే పరీక్షించుకోవడం అవసరం. రక్తంలో చక్కెర పెరిగిన విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే, దాన్ని నియంత్రించడానికి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా అడ్డుకోవడానికి అంత మంచి అవకాశం ఉంటుంది" అని డాక్టర్ కులకర్ణి పేర్కొన్నారు.

సకాలంలో వ్యాధి నిర్ధారణ, తగిన వైద్య సంరక్షణ, జీవనశైలి మార్పులతో టైప్-2 డయాబెటిస్‌ను సమర్థంగా నియంత్రించవచ్చు. దీర్ఘకాల సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.

(గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే; వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యపై సందేహాలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

ABOUT THE AUTHOR

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.