సాంకేతిక విప్లవంలో భాగమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు మన దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఆఫీస్ ఈమెయిళ్లు రాయడం, ప్రాజెక్ట్ నోట్స్ తయారు చేయడం, ప్లాన్లు వేసుకోవడం నుంచి సృజనాత్మక ఆలోచనల వరకు ప్రతీదానికి చాట్‌జీపీటీ, జెమినీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఇవి ఉద్యోగులు, విద్యార్థుల ఉత్పాదకతను విపరీతంగా పెంచుతున్న మాట వాస్తవమే అయినా.. మరోవైపు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాడీ వ్యవస్థ. వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.

రోజువారీ పనుల నుంచి మానసిక ప్రశాంతత వరకు ప్రతీదానికి అల్గారీథమ్‌ల ఆధారంగా స్పందించే చాట్‌బాట్స్‌పై ఆధారపడటం వల్ల మనుషులు తమ 'స్వయం ఆలోచనా శక్తిని' కోల్పోతున్నారు. క్రమంగా ఇది ఒక రకమైన మానసిక సమస్యకు దారితీస్తోందని న్యూరాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను పని సులభతరం చేసే సాధనంగా వాడటంలో తప్పు లేదు. కానీ సొంతంగా ఆలోచించే శక్తిని, భావోద్వేగాలను అదుపు చేసుకునే సామర్థ్యాన్ని, తోటి మనుషులతో సంబంధాలను ఏఐతో భర్తీ చేయడమే అసలైన ప్రమాదం," అని మరెంగో ఆసియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ స్పైన్ ఛైర్మన్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా స్పష్టం చేశారు.
ఏఐపై అతిగా ఆధారపడటానికి 5 ప్రమాదకర సంకేతాలు..
టెక్నాలజీ వాడకం ఉత్పాదకతను దాటి మానసిక వ్యసనంగా మారిందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్ ప్రవీణ్ గుప్తా 5 ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలను వివరించారు.
1.సొంత నిర్ణయాలపై నమ్మకం కోల్పోవడం-
ఏఐకి బానిసవుతున్నారని చెప్పడానికి మొదటి సంకేతం ఆత్మవిశ్వాసం తగ్గడం! చిన్నచిన్న విషయాల్లో కూడా ఏం ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై ఏఐ నమూనాలను సంప్రదించడం మొదలుపెడతారు. ఒక చిన్న సమస్యను పరిష్కరించాలన్నా లేదా ఒక మెసేజ్‌కు సమాధానం ఇవ్వాలన్నా చాట్‌బాట్ సలహా లేనిదే అడుగు ముందుకు వేయలేరు. ఇది మెదడు స్వతంత్ర విశ్లేషణ శక్తిని బలహీనపరుస్తుంది.
2. మనుషులతో కాకుండా చాట్‌బాట్స్‌తో బాధలు చెప్పుకోవడం-
{{/usCountry}}2. మనుషులతో కాకుండా చాట్‌బాట్స్‌తో బాధలు చెప్పుకోవడం-
{{/usCountry}}బాధ, ఒత్తిడి, ఏకాంతం ఆవహించినప్పుడు తోటి మనుషులు లేదా స్నేహితులతో కాకుండా చాట్‌బాట్స్‌తో మాట్లాడటం ప్రమాదకరం. చాట్‌బాట్‌లు వెంటనే స్పందించి, ఓదార్పు ఇచ్చేలా మాట్లాడవచ్చు. కానీ వాటికి నిజమైన మానవ సానుభూతి కానీ, భావోద్వేగాల మార్పిడి కానీ ఉండవు. మనుషులతో మాట్లాడటం మాని డిజిటల్ సాధనాలతో ఉద్వేగాలను పంచుకోవడం వల్ల వ్యక్తిగతంగా మరింత ఒంటరితనం పెరుగుతుంది.
3. ఏఐ అందుబాటులో లేకపోతే తీవ్ర ఒత్తిడి, ఆందోళన-
సర్వర్ డౌన్ కావడం వల్ల లేదా ఇంటర్నెట్ లేకపోవడం వల్ల చాట్‌బాట్ ఓపెన్ కానప్పుడు తీవ్రమైన ఆందోళన, కోపం, అయోమయానికి గురికావడం అతి పెద్ద ప్రమాదకర సంకేతం. సాంకేతికత అనేది సౌకర్యం కోసం ఉండాలి కానీ, అది లేకపోతే నిత్యకృత్యాలు స్తంభించిపోయేలా మారకూడదు.
4. ముఖాముఖి సంభాషణలను నివారించడం-
తోటి మనుషులతో మాట్లాడేటప్పుడు వారి హావభావాలు, శరీర భాష, ఉద్వేగాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏఐతో మాట్లాడేటప్పుడు ఎలాంటి మానసిక శ్రమ అవసరం ఉండదు. దీనితో చాలామంది ప్రత్యక్ష సంభాషణలను నివారించి సృజనాత్మక లేదా కృత్రిమ చాటింగ్‌కే పరిమితమవుతారు. ఇది రోజురోజుకూ సామాజిక సంబంధాలను దెబ్బతీస్తుంది.
5. రోజువారీ జీవితం దెబ్బతినడం-
నైపుణ్యాలు పెంచుకోవడం పక్కనబెట్టి గంటల తరబడి ఏఐ చాట్‌బాట్స్‌తో కాలక్షేపం చేయడం, నిద్ర, ఉద్యోగం, చదువు వంటి నిత్యకృత్యాలను నిర్లక్ష్యం చేయడం వ్యసనంగా మారేందుకు సూచిక. ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నా చాట్‌బాట్స్‌ను వదల్లేకపోవడం ప్రవర్తనా నియంత్రణను కోల్పోతున్నారనడానికి నిదర్శనం.
కృత్రిమ మేధను ఒక పనిముట్టుగా మాత్రమే పరిగణించాలని, దానికి మన ఆలోచనా శక్తిని తాకట్టు పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సమయానుకూలంగా డిజిటల్ డిటాక్స్ (టెక్నాలజీకి విరామం ఇవ్వడం) పాటించడం, మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడవచ్చు.