జేబులోని స్మార్ట్‌ఫోన్ వైబ్రేట్ అయినట్లు అనిపించడం, లేదా ఎలాంటి మెసేజ్ లేదా నోటిఫికేషన్ శబ్దం రాకపోయినా నిమిషానికి ఒకసారి స్క్రీన్ ఆన్ చేసి చూడటం.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది చాలా సాధారణమైన అలవాటుగా మారిపోయింది. పనిలో ఉన్నా, ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నా లేదా టీవీ చూస్తున్నా సరే చేతులు మాత్రం దానంతట అవే ఫోన్ వైపు వెళ్తుంటాయి. పైకి ఇది చాలా చిన్న విషయంగా కనిపించినప్పటికీ, దీని వెనుక మన మెదడు ఆడే పెద్ద మెంటల్ గేమ్ దాగి ఉందని మీకు తెలుసా?

నోటిఫికేషన్లు ఏవీ లేకున్నా సరే పదే పదే స్మార్ట్‌ఫోన్ చూడాలనే ఆరాటానికి అసలు కారణమేంటి? ఈ అలవాటు మన మెదడును, దైనందిన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తోంది? అనే విషయాలపై ప్రముఖ కెడాబమ్స్ హాస్పిటల్స్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ అనిత బీ అనేక సంచలన విషయాలను పంచుకున్నారు.
మన మెదడులోని 'రివార్డ్ సిస్టమ్' మాయ!
పదే పదే స్మార్ట్‌ఫోన్ అన్‌లాక్ చేయడం అనేది మనం తెలియకుండానే నేర్చుకున్న ఒక ప్రవర్తనా అలవాటు అని డాక్టర్ అనిత స్పష్టం చేశారు. మన మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ ఈ అలవాటును నిరంతరం ప్రోత్సహిస్తుంది.
మనం ప్రతిసారి ఫోన్ అన్‌లాక్ చేసినప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయం, సోషల్ మీడియా లైక్, మెసేజ్ లేదా ఏదైనా ఆసక్తికరమైన సమాచారం దొరికే అవకాశం ఉంటుంది. ఈ "ఏదో ఒక కొత్త విషయం దొరకవచ్చు" అనే అనిశ్చయ వాతావరణమే మెదడులో డోపమైన్‌ని విడుదల చేస్తుంది. నోటిఫికేషన్ టోన్ వినపడకపోయినా సరే, ఏదో ఒక రివార్డ్ లభిస్తుందనే ఆశతో మెదడు మనల్ని ఫోన్ వైపు నెడుతుంది. కాలక్రమేణా ఇది మన ప్రమేయం లేకుండానే ఒక ఆటోమేటిక్ అలవాటుగా మారిపోతుంది.
ఒంటరితనం, బోరింగ్‌ను తట్టుకోలేకపోవడమే ప్రధాన కారణం!
మానసిక విశ్లేషణ కోణంలో చూస్తే.. ఈ అలవాటు ప్రధానంగా బోర్‌గా అనిపించడం, ఆందోళన, కాసేపు ఊరికే ఖాళీగా ఉండలేకపోవడం నుంచి పుట్టుకొస్తుంది. చాలామంది మానసికంగా చిన్నపాటి అసౌకర్యం, ఒంటరితనం లేదా క్లిష్టమైన ఆలోచనలు రాగానే వాటితో ఒంటరిగా గడపడానికి భయపడతారు.
{{/usCountry}}మానసిక విశ్లేషణ కోణంలో చూస్తే.. ఈ అలవాటు ప్రధానంగా బోర్‌గా అనిపించడం, ఆందోళన, కాసేపు ఊరికే ఖాళీగా ఉండలేకపోవడం నుంచి పుట్టుకొస్తుంది. చాలామంది మానసికంగా చిన్నపాటి అసౌకర్యం, ఒంటరితనం లేదా క్లిష్టమైన ఆలోచనలు రాగానే వాటితో ఒంటరిగా గడపడానికి భయపడతారు.
{{/usCountry}}"చిన్నపాటి మానసిక అసౌకర్యం కలగగానే చాలామంది తమ మెదడుకు తక్షణ ఉపశమనం లేదా ఉద్దీపన కోసం వెంటనే ఫోన్‌ను ఆశ్రయిస్తుంటారు. సోషల్ మీడియా రీల్స్, మెసేజ్‌లు చూడటం ద్వారా లభించే ఈ తక్షణ ఉపశమనం, ఆ తర్వాత అసంతృప్తిని మిగిల్చినప్పటికీ అలవాటుగా స్థిరపడిపోతుంది," అని డాక్టర్ అనిత వివరించారు.
దీనికి తోడు 'ఫోమో' (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) అంటే సమాజంలో ఏమైనా కొత్త అప్‌డేట్ వస్తే తాను మిస్ అయిపోతానోమోననే భయం కూడా ప్రజలను పదే పదే ఫోన్ స్క్రీన్ చెక్ చేసుకునేలా చేస్తుంటుంది. అలాగే మన చుట్టూ ఉన్నవారు ఫోన్లు వాడుతుండటం, ఫోన్ ఎప్పుడూ చేతికి అందుబాటులోనే ఉండటం వంటి పర్యావరణ కారకాలు కూడా ఈ అలవాటును పెంచుతాయి.
ఇది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?
అప్పుడప్పుడు ఫోన్ చూడటం వేరు, నిరంతరం అదే పనిలో ఉండటం వేరు. ఒక వ్యక్తికి ఏకాగ్రత దెబ్బతింటున్నా, ఫోన్ పక్కన పెడితే విపరీతమైన ఆందోళన చెందుతున్నా, లేదా ఆపాలని ఎంత ప్రయత్నించినా పదే పదే ఫోన్ తీస్తుంటే.. వారు డిజిటల్ అడిక్షన్‌కు గురవుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇది మనస్సుకు ఒక రకమైన కోపింగ్ మెకానిజంగా మారిపోతుంది.
ఈ అలవాటు నుంచి బయటపడటం ఎలా?
స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని పూర్తిగా ఆపేయడం దీనికి పరిష్కారం కాదని, అసలు మనం ఎందుకు ఫోన్ పట్టుకుంటున్నామో ఆ ‘ట్రిగ్గర్ల’ను గుర్తించడం ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు:
అనవసర నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి: సోషల్ మీడియా, గేమ్స్ వంటి అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లను నిలిపివేయండి.
ఫోన్‌ను దూరంగా ఉంచండి: ఆఫీస్ పని లేదా చదువుకునే సమయంలో ఫోన్‌ను కంటికి కనిపించకుండా, చేతికి అందనంత దూరంలో ఉంచాలి.
ఖాళీగా ఉండటం అలవాటు చేసుకోండి: రోజులో కాసేపు ఎలాంటి డిజిటల్ డివైజ్ లేకుండా ప్రశాంతంగా కూర్చోవడం లేదా ప్రకృతితో సమయం గడపడం ద్వారా మెదడును తిరిగి రీ-సెట్ చేయవచ్చు.
షాపింగ్ మాల్స్, ఆఫీసులు, చివరికి ప్రయాణాల్లోనూ అందరి దృష్టి ఫోన్లపైనే ఉంటున్న ఈ రోజుల్లో.. ఈ మానసిక సూత్రాలను అర్థం చేసుకుని ప్రవర్తిస్తే డిజిటల్ అడిక్షన్ నుంచి సులభంగా బయటపడవచ్చు.