మతిమరుపునకు కాఫీతో చెక్.. తాజా పరిశోధనలో మైండ్ బ్లోయింగ్ విషయాలు
రోజూ పరిమితంగా కాఫీ లేదా టీ తాగడం వల్ల మతిమరుపు (డెమెన్షియా) ముప్పు తగ్గుతుందని 40 ఏళ్ల పాటు సాగిన ఓ సుదీర్ఘ అధ్యయనం వెల్లడించింది. రోజుకు రెండు కప్పుల కెఫీన్ కలిగిన పానీయాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధకులు గుర్తించారు.
కాఫీ.. ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, కోట్లాది మందికి రోజును ఉత్సాహంగా ప్రారంభించే ఒక ఎనర్జీ డ్రింక్. మధ్యాహ్నం వేళ ఆవరించే కునుకును వదిలించుకోవాలన్నా, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నా చాలామందికి కాఫీనే మొదటి ఛాయిస్. అయితే, కాఫీ ప్రియులకు ఇప్పుడు సైన్స్ ఒక తీపి కబురు చెప్పింది. రోజూ కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో మతిమరుపు (డెమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తాజాగా ఒక సుదీర్ఘ పరిశోధనలో తేలింది.

40 ఏళ్ల పరిశోధన.. 1.3 లక్షల మందిపై అధ్యయనం
ప్రముఖ వైద్య జర్నల్ 'జామా నెట్‌వర్క్' (JAMA Network) ఈ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇది ఏదో ఒకట్రెండు రోజులు చేసిన పరిశోధన కాదు.. ఏకంగా 37 ఏళ్ల పాటు సుమారు 1.3 లక్షల మంది ఆరోగ్య అలవాట్లను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు మందగించడం, ఆలోచనా సామర్థ్యం తగ్గడం వంటి 'న్యూరో డీజెనరేటివ్' సమస్యలను ఎదుర్కోవడంలో కెఫీన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ప్రముఖ శాస్త్రవేత్త, వైద్య నిపుణులు డాక్టర్ ఎరిక్ టోపోల్ ఈ పరిశోధన ఫలితాలను విశ్లేషిస్తూ ఒక కీలక పోస్ట్ చేశారు.
"కెఫీన్ కలిగిన కాఫీ లేదా టీ తాగే వారిలో మెదడు చురుకుదనం మెరుగ్గా ఉండటమే కాకుండా, మతిమరుపు ముప్పు కూడా తగ్గింది. ముఖ్యంగా రోజుకు సుమారు రెండు కప్పుల కాఫీ తాగే వారిలో ఈ సానుకూల మార్పులు స్పష్టంగా కనిపించాయి" అని ఆయన వివరించారు.
అన్ని కాఫీలు ఒకేలా పనిచేస్తాయా?
ఈ అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రయోజనాలన్నీ కేవలం 'కెఫీన్' ఉన్న కాఫీ లేదా టీ తాగినప్పుడే కనిపిస్తాయి. కెఫీన్ లేని (Decaffeinated) కాఫీ తాగిన వారిలో ఇలాంటి మార్పులేవీ కనిపించలేదు. కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజూ పరిమితంగా తాగే వారికి జ్ఞాపకశక్తి సమస్యలు తక్కువగా ఉన్నాయని, వారు కాగ్నిటివ్ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారని ఈ నివేదిక చెబుతోంది.
అతి సర్వత్ర వర్జయేత్
కాఫీ మంచిది కదా అని గంటకో కప్పు తాగేస్తే ప్రయోజనం ఉండదు, పైగా.. అది నష్టం కలిగిస్తుంది. ఏదైనా పరిమితంగా ఉన్నప్పుడే దానికి విలువ. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలేమీ ఉండవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాఫీని ఒక 'మ్యాజిక్ మందు'లా కాకుండా, ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మాత్రమే చూడాలి.
మెదడు ఆరోగ్యానికి కాఫీ ఒక్కటే సరిపోదు
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కాఫీ తాగితే సరిపోదని, జీవనశైలిలో మార్పులు కూడా ముఖ్యమని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఒక నిపుణుడు స్పందిస్తూ.. "మీకు మెదడు రక్షణ కావాలంటే వ్యాయామం చేయండి, నడవండి, కంటినిండా నిద్రపోండి, బలమైన ఆహారం తీసుకోండి. వీటితో పాటు బోనస్‌గా రోజుకు 1-2 కప్పుల కాఫీని ఆస్వాదించండి" అని సూచించారు.
సరైన నిద్ర లేకపోయినా, జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా, రోజంతా సోషల్ మీడియాలో మునిగితేలుతూ శారీరక శ్రమ చేయకపోయినా.. ఎన్ని కప్పుల కాఫీ తాగినా మెదడును కాపాడుకోలేమని గుర్తించాలి. కాఫీ అనేది మీ ఆరోగ్య ప్రయాణంలో ఒక చిన్న తోడు మాత్రమే, అది పూర్తి పరిష్కారం కాదు.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు లేదా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


