Gut health : ఆఫీస్ టెన్షన్‌కి.. కడుపు ఉబ్బరానికి లింక్ ఉందా? ఒత్తిడి వల్ల మోషన్స్ ఎందుకు ఫ్రీగా అవ్వవు?
Stress and Digestion : మన జీర్ణక్రియ వ్యవస్థను ప్రభావితం చేసే అంశాల్లో ఒత్తిడి కూడా ఉంటుందని మీకు తెలుసా? ఎందుకిలా? అసలు రెండింటికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
మానసిక ఒత్తిడి, ఆందోళన బుర్రను మాత్రమే కాదు.. మన పొట్టను, జీర్ణవ్యవస్థను కూడా నేరుగా దెబ్బతీస్తాయని మీకు తెలుసా? చాలామంది ఆఫీస్ టెన్షన్లలో ఉన్నప్పుడు లేదా పరీక్షల సమయంలో కడుపునొప్పి, గ్యాస్, మోషన్స్ ఫ్రీగా అవ్వకపోవడం లేదా విరేచనాలు కావడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఒత్తిడికి, మన 'మలవిసర్జన అలవాట్లకు' మధ్య ఉన్న వింత సంబంధాన్ని సైన్స్ ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాము..

ఫైట్ ఆర్ ఫ్లైట్..
ప్రముఖ హెల్త్ షో 'డాక్టర్ వర్సెస్ ఇంటర్నెట్' ఇటీవలి ఎపిసోడ్‌లో సోవా హెల్త్ చీఫ్ సైన్స్ ఆఫీసర్, ప్రముఖ జెనెటిసిస్ట్ మాక్స్ కుష్నిర్ దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన మానవ పరిణామ క్రమాన్ని వివరించారు. పూర్వం అడవుల్లో బతికిన మనుషులకు ఒత్తిడి అనేది కేవలం రెండు విషయాల చుట్టూనే తిరిగేది: "నేను ఏం తినాలి?", "నన్ను ఏదైనా జంతువు తినకుండా ఎలా తప్పించుకోవాలి?". అప్పట్లో ఉద్యోగాలు, ఈఎంఐలు, అత్తమామల గొడవలు లాంటివి లేవు. కేవలం బతుకు పోరాటం మాత్రమే ఉండేది.
ఆ కాలంలో క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడానికి మన శరీరంలో 'ఫైట్-ఆర్-ఫ్లైట్' అనే ఒక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. అయితే, గత కొన్ని శతాబ్దాలుగా ఉద్యోగ భద్రత, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వంటి కొత్త రకం ఒత్తిళ్లు మన జీవితాల్లోకి వచ్చాయి. కానీ, మన శరీరం వీటికి విడిగా స్పందించేలా ఇంకా పరిణామం చెందలేదు. శారీరక శాస్త్రం ప్రకారం.. మీ మెదడుకు ఎదురుగా ఉన్న పులికి, ఇంటికొచ్చిన కరెంట్ బిల్లుకు లేదా ఆఫీస్ డెడ్‌లైన్‌కు పెద్దగా తేడా తెలియదు. ప్రమాదం ఏదైనా శరీరం 'నేను డేంజర్‌లో ఉన్నాను' అని భావించి వెంటనే కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది.
ఒత్తిడి రాగానే జీర్ణక్రియ ఎందుకు ఆగిపోతుంది?
ఈ హార్మోన్లు శరీరంలోకి విడుదల కాగానే కొన్ని వ్యవస్థలను యాక్టివేట్ చేసి, మరికొన్నింటిని మూసేస్తాయి. అందులో మెదడు మొదటగా ఆఫ్ చేసే స్విచ్.. జీర్ణవ్యవస్థ!
"మనం తినే ఆహారం నుంచి వచ్చే క్యాలరీలలో మూడో వంతు కేవలం ఆ ఆహారాన్ని అరిగించడానికే ఖర్చవుతుంది. మనకు ఏదైనా ఒత్తిడి లేదా ప్రమాదం ఎదురైనప్పుడు, ఆ సమస్యను తక్షణమే ఎదుర్కోవడానికి శరీరానికి భారీగా శక్తి అవసరం. ఆహారం అరిగిన తర్వాత వచ్చే శక్తి కోసం బాడీ అంతసేపు ఆగలేదు. అందుకే, ఫైట్-ఆర్-ఫ్లైట్ రెస్పాన్స్‌లో భాగంగా శరీరం జీర్ణక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, ఆ మిగిలిన శక్తిని అత్యవసర అవసరాలకు వాడుకుంటుంది," అని సోవా హెల్త్‌కి చెందిన మాక్స్ కుష్నిర్
పొట్ట బాగుండాలంటే.. మైండ్ ప్రశాంతంగా ఉండాలి!
మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగించడం వల్లే కడుపులో తిప్పడం, అజీర్తి, మలబద్ధకం లేదా ఇర్రెగ్యులర్ మోషన్స్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మెదడు నుంచి పొట్టకు ఉండే ఈ కనెక్షన్‌ను సైన్స్ భాషలో ‘గట్-బ్రెయిన్ యాక్సిస్’ అని పిలుస్తారు.
అందుకే, మీ పొట్ట ఆరోగ్యంగా ఉండాలన్నా, విసర్జన ప్రక్రియ సజావుగా సాగాలన్నా కేవలం మంచి ఆహారం తింటే సరిపోదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ప్రశాంతమైన మనస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన, క్రమబద్ధమైన జీర్ణవ్యవస్థకు దారితీస్తుంది. యోగా, ధ్యానం లేదా చిన్నపాటి వాకింగ్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటే పొట్ట సమస్యలు చాలా వరకు అవే మాయమవుతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


