పింక్ అనార్కలీలో మెరిసిపోయిన 'ఎఫ్ 2' బ్యూటీ మెహ్రీన్.. నిరాడంబరంగా వివాహం

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మెహ్రీన్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల మిత్రుడు అర్ష్ ఔలఖ్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని చైల్ అనే ప్రాంతంలో అత్యంత నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా పెళ్లాడారు. ఏప్రిల్ 26న జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated on: Apr 27, 2026 10:11 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ 'హనీ' ఈజ్ వెరీ వెరీ హ్యాపీ! 'కృష్ణగాడి వీరప్రేమ గాధ', 'ఎఫ్ 2' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి మెహ్రీన్ పిర్జాదా ఇల్లాలయ్యారు. గత కొన్నాళ్లుగా తన వ్యక్తిగత జీవితాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ, సడన్‌గా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసి అభిమానులకు తీపి కబురు అందించారు. తన భాగస్వామి అర్ష్ ఔలఖ్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

వివాహ బంధంలో అడుగుపెట్టిన మెహ్రీన్ పిర్జాదా
వివాహ బంధంలో అడుగుపెట్టిన మెహ్రీన్ పిర్జాదా

హిమాచల్ కొండల్లో.. ఆనంద్ కరాజ్ వేడుక

ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిల్ స్టేషన్ 'చైల్' (Chail) వేదికగా ఈ వివాహ వేడుక జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం 'ఆనంద్ కరాజ్' పద్ధతిలో మెహ్రీన్ - అర్ష్‌ వివాహం జరిగింది. "26.04.26 #ArshDiMehr" అంటూ మెహ్రీన్ తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుక మెహ్రీన్ అభిరుచికి తగ్గట్టుగా అత్యంత కళాత్మకంగా సాగింది.

పింక్ థీమ్‌లో మెరిసిన జంట

ఈ వివాహ వేడుక కోసం మెహ్రీన్ పింక్, వైట్ థీమ్‌ను ఎంచుకున్నారు. పెళ్లి దుస్తుల విషయంలో మెహ్రీన్ ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రముఖ డిజైనర్ సావన్ గాంధీ రూపొందించిన అద్భుతమైన పింక్ కలర్ అనార్కలీ సెట్‌లో మెహ్రీన్ దేవకన్యలా మెరిసిపోయారు. ముత్యపు రంగుతో కూడిన ఈ పింక్ అనార్కలీపై మెరిసే రత్నాలు, అద్దాల పనితనం (Mirror work), సీక్విన్స్ మరియు సిల్వర్ గోటా వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దుస్తులకు తగ్గట్టుగా రెండు భారీ దుపట్టాలను ఆమె ధరించారు. ఒకదానిని భుజంపై వేసుకోగా, మరొకటి తలపై ముసుగులా (Veil) అలంకరించుకున్నారు. ఇక నగలు విషయానికి వస్తే.. పొరలుగా ఉన్న పోల్కీ నెక్ సెట్, చోకర్, మాంగ్ టీకా, పింక్ రంగు గాజులు మరియు వెండితో చేసిన కలీరా (Kaleeras) ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. మెహ్రీన్ తన మేకప్‌ను చాలా సింపుల్‌గా ఉంచుకుంటూనే, తన కళ్లను, పెదాలను హైలైట్ చేసేలా జాగ్రత్త పడ్డారు. వరుడు అర్ష్ ఔలఖ్ కూడా మెహ్రీన్‌కు పోటీగా పింక్ కలర్ షేర్వానీ, టర్బన్ ధరించి రాజకుమారుడిలా కనిపించారు.

కెరీర్ నుంచి మ్యారేజ్ వరకు..

నటిగా, మోడల్‌గా మెహ్రీన్ పిర్జాదాకు మంచి గుర్తింపు ఉంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, పంజాబీ చిత్రాల్లో ఆమె నటించారు. నాని సరసన 'కృష్ణగాడి వీరప్రేమ గాధ'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, ఆ తర్వాత 'జవాన్', 'పంతం', 'కవచం' వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 'ఎఫ్ 2' సినిమాలో ఆమె పోషించిన 'హనీ' పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో 'నీ సిగువరేగు' సినిమాతో అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మెహ్రీన్ సోదరుడు గుర్ ఫతే పిర్జాదా కూడా నటుడే కావడం గమనార్హం. గత కొన్నేళ్లుగా తన వ్యక్తిగత విషయాలపై ఎక్కడా స్పందించని మెహ్రీన్, నేరుగా తన వివాహ వార్తను పంచుకోవడంతో అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More