స్నేహితుడిని చూడగానే మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? ఫ్రెండ్‌షిప్ వెనుక ఉన్న ‘న్యూరోసైన్స్’ సీక్రెట్..
Friendship day 2026 : స్నేహం అనేది కేవలం ఒక సామాజిక అనుబంధం మాత్రమే కాదు, మన నాడీ వ్యవస్థను, మెదడు పనితీరును ప్రభావితం చేసే బలమైన జీవశాస్త్ర అవసరం! స్నేహితులతో ఉన్నప్పుడు మెదడులో విడుదలయ్యే రసాయనాలు, హార్మోన్లు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని ఎలా పెంచుతాయో న్యూరోసైన్స్ స్పష్టం చేస్తోంది.
ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే. అప్పుడెప్పుడో ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అంటూ ఓ యాడ్ వచ్చింది. ఫ్రెండ్స్ లైఫ్‌లో చాలా అవసరం అని అందరూ అంగీకరించే విషయమే. అయితే స్నేహం అనేది కేవలం ఒక సామాజిక అనుబంధం మాత్రమే కాదు, మన నాడీ వ్యవస్థ, మెదడు నిర్మాణంపై అత్యంత ప్రభావం చూపే బంధం అని న్యూరో సైన్స్ చెబుతోంది.

న్యూరోసైన్స్ ప్రకారం స్నేహం ఏర్పడటం, కొనసాగడం, అది మానసిక స్థితిని మార్చడం వెనుక మెదడులోని నిర్దిష్ట వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూద్దాం.
ఫ్రెండ్‌షిప్ వెనుక దాగున్న న్యూరోసైన్స్..
స్నేహితులతో సంభాషిస్తున్నప్పుడు లేదా వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు మెదడులోని కొన్ని ప్రత్యేక నెట్‌వర్క్‌లు యాక్టివేట్ అవుతాయి.
డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ : మనం ఇతర వ్యక్తుల ఆలోచనలు, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఈ నెట్‌వర్క్ పనిచేస్తుంది. స్నేహితుడు ఏం ఆలోచిస్తున్నాడో ఊహించడానికి, వారి బాధను పంచుకోవడానికి ఈ డీఎంఎన్ కీలక పాత్ర పోషిస్తుంది.
వెంట్రల్ మెడియల్ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ : ఇది ‘ఆత్మ సన్నిహితత్వం’, సామాజిక విలువల మూల్యాంకనానికి సంబంధించింది. సన్నిహిత స్నేహితుల గురించి ఆలోచించినప్పుడు, మన సొంతం గురించి ఆలోచించినట్లే వీఎంపీఎఫ్సీలో ఒకే విధమైన న్యూరల్ యాక్టివిటీ కనిపిస్తుంది.
టెంపోరోప్రియేటల్ జంక్షన్ అండ్ సుపీరియర్ టెంపోరల్ సల్కస్ : ఎదుటివారి శారీరక సంకేతాలు, ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్‌ను ప్రాసెస్ చేసి సామాజిక సంకేతాలను అర్థం చేసుకోవడానికి ఇవి సహాయపడతాయి.
న్యూరో ట్రాన్స్ మీటర్స్ ప్రభావం..
స్నేహం బాండింగ్ ఏర్పడటానికి, ఆనందాన్ని ఇవ్వడానికి నాలుగు ప్రధాన రసాయనాలు తోడ్పడతాయి. ఆక్సిటోసిన్ భయాన్ని, ఆందోళనను తగ్గిస్తూ నమ్మకాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. డోపమైన్ మెదడులోని రివార్డ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తుంది. స్నేహితులతో సమయం గడపడం ఆనందాన్ని, తృప్తిని ఇవ్వడానికి ఇది కారణం. స్నేహితులతో కలిసి నవ్వడం, ముచ్చటించడం వల్ల ఎండోర్ఫిన్లు విడుదలై సహజమైన నొప్పుల ఉపశమనాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాయి. సెరటోనిన్ సామాజిక సంబంధాలు స్థిరంగా ఉన్నప్పుడు మూడ్ స్వైంగ్స్ లేకుండా మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది.
ఒకే స్పందన..
ఎఫ్ఎంఆర్ఐ స్కాన్‌ల ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించిన అంశం న్యూరల్ కపులింగ్!
ఇద్దరు సన్నిహిత మిత్రులు ఒకే రకమైన వీడియో చూస్తున్నప్పుడు లేదా ఒకే విషయాన్ని వింటున్నప్పుడు వారి మెదడులోని సెన్సరీ, ఎమోషనల్, అటెంషనల్ ప్రాంతాలలోని న్యూరాన్లు ఒకే పద్ధతిలో ఫైర్ అవుతాయి. మెదడు సామాజిక దూరాన్ని ముందే అంచనా వేయగలదు. మనం ఎవరితో ఎక్కువ క్లోజ్‌గా ఉన్నామో వారి ఆలోచనా విధానంతో మన మెదడు స్పందనలు మ్యాచ్ అవుతాయి.
మెదడులోని అమిగ్డాలా అనేది భయం, ఆందోళన, ప్రమాద హెచ్చరికలను ప్రాసెస్ చేసే కేంద్రం. మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు నమ్మకమైన స్నేహితుడు పక్కన ఉంటే లేదా వారి చేతిని పట్టుకుంటే, మెదడులోని అమిగ్డాలా తీవ్రత తగ్గిపోతుంది.
కార్టిసోల్ విడుదలను నిరోధించి, శరీరంలో "ఫైట్ లేదా ఫ్లైట్ ప్రతిస్పందనను శాంతపరుస్తుంది. సానుకూల స్నేహబంధాలు మెదడు నిర్మాణాన్ని సానుకూలంగా మారుస్తాయి. నాణ్యమైన సామాజిక అనుబంధాలు ఉన్న వారిలో కొత్త న్యూరాన్ల పెరుగుదలకు, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటానికి తోడ్పడుతుంది. స్నేహపూర్వక సంభాషణలు మెదడుకు నిరంతర వ్యాయామంలా పనిచేసి వృద్ధాప్యంలో డిమెన్షియా అల్జీమర్స్, జ్ఞాపకశక్తి క్షీణతను ఆలస్యం చేస్తాయి.
న్యూరోసైన్స్ దృక్కోణంలో స్నేహం అనేది కేవలం ఎమోషన్ మాత్రమే కాదు.. అది మన మెదడును ఒత్తిడి నుంచి రక్షించే న్యూరోలాజికల్ షీల్డ్, రివార్డ్ సిస్టమ్‌ను ఉత్తేజపరిచే బయోలాజికల్ నీడ్.
-డాక్టర్ దిట్టకవి జయలక్ష్మి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


