Post festive weight loss tips : పండుగల్లో విపరీతంగా తినేశారా? ఈ 7-డే రీసెట్ ప్లాన్‌తో బరువు తగ్గండి..
పండుగ పూట పిండివంటలు, తీపి పదార్థాలు తిన్న తర్వాత అకస్మాత్తుగా బరువు తగ్గాలని క్రాష్ డైట్లు పాటిస్తే ఆరోగ్యానికే ముప్పు! నిపుణులు సూచించిన సమతుల్య ఆహార పద్ధతులు, 7 రోజుల రీసెట్ ప్లాన్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
పండుగల సీజన్ ముగియగానే ప్రతీ ఇంట కనిపించే ప్రధాన సమస్య బరువు పెరగడం! పండుగ రోజుల్లో లడ్డూలు, అరిసెలు, నూనె పదార్థాలు, బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు ఆస్వాదించిన తర్వాత చాలామందిలో ఒకరకమైన గిల్ట్ మొదలవుతుంది. దీనివల్ల తొందరగా, ఇంకా చెప్పాలంటే పెరిగిన బరువును వారం రోజుల్లోనే వదిలించుకోవాలని, సన్నబడిపోవాలనే ఆరాటంతో కఠినమైన ఉపవాసాలు, క్రాష్ డైట్లు ప్రారంభించేస్తుంటారు. అయితే, అకస్మాత్తుగా ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం వల్ల నీరసం రావడం, శక్తి నశించడం, ఆకలి పెరిగి మళ్లీ ఎక్కువగా తినేయడం వంటి అనర్థాలు జరుగుతాయి.

పండుగ ముగియగానే బరువు తగ్గడానికి సోషల్ మీడియాలో కనిపించే 'డిటాక్స్ డ్రింక్స్', 'ఫాస్ట్ వెయిట్ లాస్' ట్రెండ్లను చాలా మంది గుడ్డిగా పాటిస్తుంటారు. అయితే, వారం రోజుల్లో శరీరంలో ఉండే కొవ్వు అంతా కరిగిపోవడం సాధ్యం కాదు. కానీ శారీరక జీవక్రియను సరైన మార్గంలో పెట్టడానికి, మంచి అలవాట్లను మళ్లీ మొదలుపెట్టడానికి ఒక వారం సమయం అద్భుతమైన ప్రారంభ వేదికగా పనిచేస్తుంది.
ఇదీ డైట్ ప్లాన్..
శరీరాన్ని రీసెట్ చేయడానికి అన్ని రకాల పోషకాలు ఉన్న సమతుల్య ఆహార ప్రణాళికను ప్రసిద్ధ న్యూట్రిషనిస్ట్ లీమా మహాజన్ అందించారు. ఇది అందరికీ ఒకేలా వర్తించే సూత్రం కాకపోయినా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు ఒక మంచి నమూనాగా నిలుస్తుంది.
ఉదయాన్నే పరగడుపున: నిద్రలేవగానే ఒక గ్లాసు మంచినీళ్లు తాగాలి. మీ దేహదారుఢ్యానికి తగినట్లుగా 45 నిమిషాల నుంచి గంటపాటు వాకింగ్ చేయాలి.
ఉదయం అల్పాహారం : నానబెట్టిన 7-8 ఎండుద్రాక్షలు, బాదం, వాల్నట్స్ తీసుకోవాలి. కొద్దిగా నల్ల ఉప్పు, ఒక చెంచా సబ్జా గింజలు కలిపిన కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి డీహైడ్రేషన్ ముప్పు తప్పుతుంది.
ఉదయం అల్పాహారం : పన్నీర్ పరోటా లేదా జొన్న రొట్టెతో పాటు కప్పు పెరుగు తీసుకోవచ్చు.
మధ్యాహ్న భోజనం : శనగలు, రాజ్మా, క్విన్వా, దానిమ్మ గింజలు, చిలగడదుంప, కొత్తిమీర, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌తో తయారు చేసిన ప్రొటీన్ సలాడ్ ఎంచుకోవాలి. భోజనం తర్వాత సోంపు-వాము టీ తాగితే అరుగుదల బాగుంటుంది.
సాయంత్రం పూట: ప్రొటీన్ షేక్ లేదా ప్రొటీన్ స్మూతీ తీసుకోవచ్చు.
రాత్రి భోజనం : వెజిటబుల్ నూడుల్స్ లేదా చిరుధాన్యాల (మిల్లెట్స్) సేమియాతో చేసిన ఎగ్-డ్రాప్ వెజిటబుల్ సూప్ తేలికపాటి ఆహారంగా పనిచేస్తుంది.
పడుకునే ముందు: పావు చెంచా మెంతులను నీటిలో నానబెట్టి, దాల్చినచెక్క ముక్కతో మరిగించిన మెంతులు-దాల్చినచెక్క నీటిని తాగడం మంచిది.
"దాల్చినచెక్క లేదా మెంతుల నీళ్లు నేరుగా కొవ్వును కరిగించే మంత్రదండాలు కావు. కానీ ఇవి జీర్ణక్రియకు సహాయపడే సాధనాలు," అని లీమా మహాజన్ స్పష్టం చేశారు.
బరువు తగ్గే ప్రయాణంలో చేయకూడని పొరపాట్లు..
బరువు తగ్గాలనే ఆతురతలో చాలామంది సొంత ప్రయోగాలు చేస్తుంటారు. ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ ప్రకారం బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి తొందరపడకూడదు. సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్ల వెనుక పరిగెత్తకుండా, మన సాంప్రదాయ ఆహారాలను తగిన మోతాదులో తీసుకోవడమే సరైన మార్గం.
ఏదో ఒక పోషకాహార రకాన్ని (కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వులు) పూర్తిగా బంద్ చేయడం వల్ల ఆహార నియమాలు ఎక్కువ కాలం పాటించడం కష్టమవుతుంది. కూరగాయలు, ప్రొటీన్, తగినంత పిండి పదార్థాలు ఉన్న సమతుల్య ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి.
అమెరికా నివారణ, ఆరోగ్య నియంత్రణ సంస్థ (సీడీసీ) మార్గదర్శకాల ప్రకారం బరువు తగ్గడానికి ఆహారంతో పాటు సరైన నిద్ర, శారీరక వ్యాయామం, మానసిక ఒత్తిడి లేకపోవడం ఎంతో ముఖ్యం. అకస్మాత్తుగా తగ్గే బరువు కంటే క్రమంగా తగ్గే బరువు మాత్రమే దీర్ఘకాలం నిలిచి ఉంటుంది!
ఆహార కాంబినేషన్ల భ్రమలు తెలుసా?
రొట్టె-అన్నం కలిపి తింటే బరువు పెరుగుతారని, పండ్లతో పాటు పానీయాలు తాగొద్దని, పప్పు-పెరుగు కలిపి తినకూడదని రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. న్యూట్రిషనిస్ట్ నటాషా మోహన్ ప్రకారం ఇటువంటి కాంబినేషన్ల వల్లనే నేరుగా బరువు పెరుగుతారని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
మనం తినే మొత్తం ఆహార పరిమాణం, రోజువారీ క్యాలరీల వినియోగం మాత్రమే బరువు పెరుగుదలను నిర్ణయిస్తాయి. కాబట్టి ఆహారాల కలయికల గురించి భయపడటం మానేసి, తగిన పరిమాణంలో సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.
వారం రోజుల్లో బరువు తగ్గడం నిజమేనా?
పండుగల తర్వాత వారం రోజుల్లోనే కిలోల కొద్దీ బరువు తగ్గిపోవాలని ఆశించడం సరైనది కాదు! వారం రోజుల్లో మీ వేయింగ్ మెషిన్లో తేడా కనిపిస్తే అది కొవ్వు కరగడం వల్ల వచ్చింది కాదు. శరీరంలో నీటి శాతం మారడం, జీర్ణ వ్యవస్థలోని వ్యర్థాలు ఖాళీ అవ్వడం వల్ల మాత్రమే ఆ మార్పు కనిపిస్తుంది.
కాబట్టి ఒక వారంలో బరువు తగ్గడం అనే లక్ష్యం కంటే, రాబోయే వారాల్లో కూడా కొనసాగించగలిగే మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడమే నిజమైన విజయం.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అర్హత కలిగిన డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


