...
...
Next Story

జంక్ ఫుడ్ తింటే డిప్రెషన్ పెరుగుతుందా? అసలు నిజాలు..

డిప్రెషన్‌తో బాధపడేవారు ప్రాసెస్ చేసిన ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం వల్ల మానసిక ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

Published on: Sep 25, 2026, 07:30:40 IST
Advertisement

డిప్రెషన్ అనేది మన మధ్య చాలామందిని వేధిస్తున్న తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. జన్యుపరమైన లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన ఒత్తిడి, జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక మానసిక గాయాలు డిప్రెషన్‌కు ప్రధాన కారణాలని మనం సాధారణంగా భావిస్తుంటాం. అయితే, మనం రోజువారీ తీసుకునే ఆహార అలవాట్లు కూడా మానసిక ఆరోగ్యంపై నేరుగా తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రముఖ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రసిద్ధ వైద్య పత్రిక ‘జామా సైకియాట్రీ’లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే ఉపశమనం!

జంక్ ఫుడ్ తింటే డిప్రెషన్ పెరుగుతుందా?
జంక్ ఫుడ్ తింటే డిప్రెషన్ పెరుగుతుందా?

మేజర్ డిప్రెషన్ డిసార్డర్​తో బాధపడుతున్న 20 మంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఈ ప్రాథమిక (పైలట్) అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరిపై రెండు విభిన్న దశల్లో పరిశోధనలు జరిపారు. ఒక దశలో వారు రోజూ తినే సాధారణ ఆహారాన్ని, మరో నాలుగు వారాల పాటు ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్’ అత్యంత కనిష్టంగా ఉన్న ప్రత్యేక ఆహారాన్ని అందించారు.

ఈ పరిశోధనలో పాల్గొన్నవారు తమ ఆహారంలో ప్రాసెస్ చేసిన పదార్థాలను 85 శాతానికి పైగా తగ్గించగా, వారిలో డిప్రెషన్ లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దానితో పాటు ఆందోళన స్థాయిలు కూడా తగ్గడం విశేషం. ప్యాకేజ్డ్ ఫుడ్స్ తగ్గించడం వల్ల డిప్రెషన్ బాధితులకు మేలు జరుగుతుందని ఈ అధ్యయనం ప్రాథమికంగా నిరూపించింది.

నాలుక రుచి వెనుక అసలు రహస్యం!

మన చుట్టూ దొరికే జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ పదార్థాలను మానడం ఎందుకు అంత కష్టమో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నియాషా చాజ్వెడెరా వివరించారు.

"అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా చౌకగా, సులువుగా దొరకడమే కాకుండా నాలుకకు అమితమైన రుచిని ఇస్తాయి. అందుకే వీటిని మానడం పెద్ద సవాలు. ఇవి మెదడులో ఆనందాన్ని ఇచ్చే 'డోపమైన్' హార్మోన్‌ను విడుదల చేసి, మళ్లీ మళ్లీ తినాలనే కోరికను రేకెత్తిస్తాయి. ప్రజలు వీటిని ఎక్కువగా తినేలా చేయడానికి ఆహార తయారీ సంస్థలు నిపుణుల సహాయంతో చక్కెర, ఉప్పు, కొవ్వులను ఖచ్చితమైన పరిమాణంలో కలుపుతాయి," అని డాక్టర్ నియాషా పేర్కొన్నారు.

ఏవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్?

ఆహారానికి, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం వెనుక 'గట్-బ్రెయిన్ కనెక్షన్' (జీర్ణవ్యవస్థ-మెదడు అనుబంధం) కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన జీర్ణవ్యవస్థలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. మనం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్టలో మంట ఏర్పడి, అది మెదడు పనితీరుపై, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. దీనికి తోడు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాల నుంచి శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు లభించవు.

మందులు అపేయవచ్చా?

ఈ అధ్యయనం ప్రాథమికమైనదేనని, కేవలం ఆహారం మార్చడం ద్వారానే డిప్రెషన్‌ను పూర్తిగా నయం చేయవచ్చని భావించి వాడుతున్న మందులను ఆపకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ అనేది ఒక సంక్లిష్టమైన వైద్య సమస్య. డాక్టర్ల సలహాతో కౌన్సెలింగ్, థెరపీ, మందులను కొనసాగిస్తూనే.. ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం మంచిదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై మరింత విస్తృతమైన పరిశోధన చేయడానికి రెండవ దశ ప్రయోగాలను 2028లో ప్రారంభించనున్నట్లు పరిశోధక బృందం వెల్లడించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON