Halloween 2026 : అసలు 'హాలోవీన్' అంటే ఏంటి? అక్టోబర్ 31నే ఎందుకు జరుపుకుంటారు?
ప్రతి ఏటా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే ‘హాలోవీన్’ పండుగ కేవలం దీపాలు, స్వీట్లు, భయానక అలంకరణలకే పరిమితం కాదు. అసలు హాలోవీన్ అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? రకరకాల దుస్తులు ఎందుకు ధరిస్తారు? వంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 రాత్రి రాగానే పాశ్చాత్య దేశాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది! ‘హాలోవీన్’ పేరుతో రకరకాల దెయ్యాలు, వికారమైన వేషధారణలు, గుమ్మడికాయల దీపాలు, ఇళ్ల ముందు భయానక బొమ్మలు దర్శనమిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లోనూ ఈ హాలోవీన్ వేడుకల సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. పండుగ కేవలం వినోదం, స్వీట్లు, కాస్ట్యూమ్ పార్టీలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే! దీని వెనుక వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మికత, వాతావరణ మార్పుల చరిత్ర దాగి ఉంది.

'ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్' కథనం ప్రకారం.. హాలోవీన్ పండుగ మూలాలు ప్రాచీన కెల్టిక్ తెగల కాలానికి చెందినవి. కాలక్రమేణా ఇది ఎలా రూపాంతరం చెందిందో లోతుగా పరిశీలిద్దాము.
అక్టోబర్ 31నే హాలోవీన్ ఎందుకు జరుపుకుంటారు?
నవంబర్ 1న క్రైస్తవ సాంప్రదాయంలో ‘ఆల్ సెయింట్స్ డే’ జరుపుకుంటారు. దానికి ముందు రోజు రాత్రిని ‘ఆల్ హాలోస్ ఈవ్’ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరే 'హాలోవీన్'గా మారింది.
ప్రాచీన కెల్టిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31 అనేది పంటల కాలం ముగిసి, సుదీర్ఘమైన శీతాకాలం ఆరంభమయ్యే రోజు. పంటలు చేతికి వచ్చే వెలుగుల కాలాన్ని ముగించి, చీకటి- చలి ఎక్కువగా ఉండే డార్క్ కాలంలోకి అడుగుపెట్టే ఈ సంధి సమయాన్ని వారు ఒక ప్రత్యేకమైన పండుగగా మలుచుకున్నారు.
‘సామ్హైన్’ అంటే ఏంటి? దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..
ప్రాచీన కెల్టిక్ సమాజం ఆచరించిన ఈ పండుగను 'సామ్హైన్' (Samhain) అని పిలిచేవారు. అక్టోబర్ 31 రాత్రి జీవించి ఉన్న మానవుల లోకానికి, చనిపోయిన పితృదేవతల (ఆత్మల) లోకానికి మధ్య ఉండే సరిహద్దు పొర అత్యంత పలచబడుతుందని వారు గట్టిగా నమ్మేవారు.
ఈ సమయంలో పితృదేవతల ఆత్మలు భూమి మీదికి వచ్చి తమ బంధువులను సందర్శిస్తాయని భావించేవారు. చెడు ఆత్మల నుంచి తమను తాము కాపాడుకోవడానికి వారు ఆరుబయట పెద్ద ఎత్తున మంటలు వేసేవారు. దుష్టశక్తులు తమను గుర్తుపట్టకుండా ఉండటానికి విచిత్రమైన ముసుగులు, వికారమైన వేషధారణలు ధరించేసేవారు. ఈ కాలక్రమేణా వచ్చిన మార్పులే నేటి 'హాలోవీన్ కాస్ట్యూమ్స్'గా మారాయి.
నేటికీ కొన్ని పాగన్, విక్కన్ కమ్యూనిటీలు పూర్వీకులకు నివాళులర్పిస్తూ ఈ రోజంతా ఆధ్యాత్మిక వేడుకగా జరుపుకుంటాయి.
హాలోవీన్ స్కార్పియో సీజన్..
హాలోవీన్ అనేది ఎల్లప్పుడూ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలోని 'వృశ్చిక రాశి' (Scorpio Season) కాలంలో వస్తుంది. వృశ్చిక రాశి అంతర్గత మార్పు, భావోద్వేగాల లోతు, పునరుజ్జీవనంస పాత విషయాలను వదిలిపెట్టడానికి సంకేతంగా నిలుస్తుంది.
ఈ పండుగ ద్వారా మన జీవితాల్లో పనికిరాని అలవాట్లను, ప్రతికూల ఆలోచనలను వదిలేసి, సరికొత్త నిర్ణయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టవచ్చనే అంతరార్థం ఉంది. మన ఇష్టమైన సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదొక అవకాశంగా భావిస్తారు.
గుమ్మడికాయ దీపాలు వెనుక కథ..
హాలోవీన్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది కళ్లు, నోరు చెక్కి లోపల క్యాండిల్ వెలిగించిన పసుపు రంగు గుమ్మడికాయ! ఐరిష్ జానపద కథల ప్రకారం.. ప్రారంభంలో వారు టర్నిప్ దుంపలను తొలిచి లోపల నిప్పు కణికలు పెట్టి ఇంటి బయట ఉంచేవారు. చెడు ఆత్మలను ఇంటి నుంచి తరిమికొట్టడానికి ఇది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని నమ్మేవారు.
తదనంతర కాలంలో ఐర్లాండ్ ప్రజలు ఉత్తర అమెరికాకు వలస వెళ్లినప్పుడు, అక్కడ విస్తారంగా లభించే గుమ్మడికాయలను ఈ సంప్రదాయానికి ఉపయోగించడం ప్రారంభించారు. క్రమంగా అది నేటి 'జాక్-ఓ-లాంటర్న్'గా స్థిరపడింది.
హాలోవీన్ 2026ని అర్థవంతంగా ఎలా జరుపుకోవచ్చు?
హాలోవీన్ అంటే కేవలం దుస్తులు మార్చడం, హారర్ సినిమాలు చూడటం లేదా పార్టీలు చేసుకోవడమే కాదు. వ్యక్తిగత ప్రశాంతత కోసం ఈ రోజంతా కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవచ్చు:
మీ జీవితం నుంచి తొలగించుకోవాలనుకుంటున్న చెడు అలవాట్లను ఒక కాగితంపై రాసి దానికి దూరంగా ఉండటం.
మరణించిన మీ పూర్వీకులను, కనుమరుగైన కుటుంబ పెద్దలను గౌరవంగా స్మరించుకోవడం.
శీతాకాలం ఆరంభమయ్యే వేళ మీ శరీరానికి, మనస్సుకు అవసరమైన విశ్రాంతిని అందిస్తూ అంతర్మథనం చేసుకోవడం.
వాతావరణ మార్పులు, రుతుపవనాల గమనం మానవ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఈ 'హాలోవీన్' ఒక గొప్ప చారిత్రక నిదర్శనం!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


