సిగరెట్ మానేయాలని ఉందా? కేవలం 'స్ట్రాంగ్ విల్ పవర్' ఉంటే సరిపోదు

పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా, దానిని వదిలిపెట్టడం ఎందుకు అంత కష్టమవుతోంది? కేవలం పట్టుదల ఉంటే సరిపోతుందా లేక శాస్త్రీయ మద్దతు అవసరమా? సిప్లా హెల్త్ మెడికల్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఉషా చెన్నూరు విశ్లేషణ.

Published on: May 25, 2026, 13:11:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధూమపానం చేసే ప్రతి ఒక్కరికీ తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆ అలవాటును వదిలేయాలనే ఆలోచన వచ్చే ఉంటుంది. ప్రారంభంలో "నేనెప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలను" అని భావించే ధూమపాన ప్రియులు, కాలక్రమేణా ఆ వ్యసనంలో కూరుకుపోతారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడో, ఇంట్లో వారి ఒత్తిడి వల్లో లేదా విపరీతమైన నీరసం ఆవహించినప్పుడో.. "ఇక చాలు, సిగరెట్ మానేయాలి" అని బలంగా నిర్ణయించుకుంటారు. కానీ, ఆ సంకల్పం ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారిపోతోంది. భారత్‌లో పొగాకు మానేయాలనుకునే వారి సంఖ్య భారీగా ఉన్నా, అందులో విజయం సాధించే వారు మాత్రం చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

స్మోకింగ్ మానేసేందుకు సంకల్పం మాత్రమే సరిపోదంటున్న వైద్య నిపుణులు
స్మోకింగ్ మానేసేందుకు సంకల్పం మాత్రమే సరిపోదంటున్న వైద్య నిపుణులు

సంకల్పం ఉంది.. కానీ ఆచరణేది?

గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (GATS) 2016-17 గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో పొగాకు వాడకం 34.6% నుంచి 28.6%కి తగ్గింది. అయితే, మానేయాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ, వాస్తవంగా ఆచరణలో విఫలమవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

డేటా ప్రకారం, ధూమపానం చేసేవారిలో 42 శాతం మంది రాబోయే 3 నుంచి 6 నెలల్లోపు మానేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరో 33 శాతం మంది 1 నుంచి 3 నెలల్లోపు ఈ అలవాటుకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నారు. అంటే, వారిలో ప్రేరణ (Motivation) లోపించలేదు. కానీ, కేవలం 37 శాతం మంది మాత్రమే నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) వంటి శాస్త్రీయ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. సంకల్పానికి, సరైన ఆచరణాత్మక పద్ధతులకు మధ్య ఉన్న ఈ అంతరమే వైఫల్యానికి ప్రధాన కారణం.

పట్టుదల ఒక్కటే ఎందుకు సరిపోదు?

ధూమపానం మానేయడం అనేది కేవలం మెదడు తీసుకునే నిర్ణయం మాత్రమే కాదు, అది శరీరానికి సంబంధించిన సమస్య కూడా. మన దైనందిన జీవితంలో ఒత్తిడి కలిగినా, పనిలో చిన్న విరామం దొరికినా వెంటనే సిగరెట్ వెలిగించడం ఒక అలవాటుగా మారిపోతుంది. ఈ 'హ్యాబిట్ లూప్' మన ప్రమేయం లేకుండానే అసంకల్పితంగా జరిగిపోతుంటుంది.

"పొగాకు మానేయాలని మనసు గట్టిగా కోరుకుంటున్నా, మెదడులో లోతుగా పాతుకుపోయిన ఆ అలవాటు మిమ్మల్ని వెనక్కి లాగుతుంది" అని డాక్టర్ ఉషా వివరించారు. అందుకే, కేవలం మనోబలంపైనే ఆధారపడటం వల్ల ఎక్కువ కాలం సిగరెట్‌కు దూరంగా ఉండటం సాధ్యపడటం లేదు.

మొదటి నెల.. అత్యంత కీలకం

సిగరెట్ మానేయాలని నిర్ణయించుకున్న మొదటి కొన్ని రోజులు అత్యంత కఠినంగా ఉంటాయి. నికోటిన్ అందకపోవడం వల్ల కలిగే చికాకు, నిద్రలేమి, విపరీతమైన కోరికలు (Cravings) తట్టుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ దశలో చాలామంది "ఇది మన వల్ల కాదు" అని చేతులెత్తేస్తారు. వాస్తవానికి, ఇది మానేసే ప్రక్రియలో ఒక సహజమైన భాగం. గణాంకాల ప్రకారం, మానేయడానికి ప్రయత్నించిన వారిలో సగం మంది మొదటి నెలలోనే మళ్ళీ ధూమపానం మొదలుపెడుతున్నారు.

అవగాహన ఉన్నా.. అడుగు ముందుకు పడట్లేదు

ప్రస్తుతం ధూమపానం మానేయడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని మెజారిటీ ప్రజలకు తెలుసు. కానీ, ఆ పద్ధతులను పాటించడానికి రకరకాల అడ్డంకులు ఎదురవుతున్నాయి. చికిత్సకు అయ్యే ఖర్చు, ఇతర ప్రత్యామ్నాయ ఉత్పత్తుల పట్ల ఉన్న అపోహలు, ఎక్కడ ప్రారంభించాలో తెలియని అయోమయం వంటివి ధూమపాన ప్రియులను వెనకడుగు వేయిస్తున్నాయి. చాలామంది హఠాత్తుగా మానేయాలని నిర్ణయం తీసుకుంటారు, కానీ ఆ సమయంలో వారికి సరైన నిపుణుల మద్దతు లేదా కౌన్సెలింగ్ లభించకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమవుతోంది.

పరిష్కారం ఏమిటి?

ధూమపానం వదిలిపెట్టడం అనేది ఒక రోజులో జరిగే మ్యాజిక్ కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ. దీనికి సరైన సన్నద్ధత, అవగాహన, సమయానికి అందే మద్దతు చాలా అవసరం. నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వంటి శాస్త్రీయ మార్గాలను అనుసరించడం ద్వారా శరీరానికి కలిగే విత్ డ్రాయల్ లక్షణాలను తట్టుకోవచ్చు.

బలమైన సంకల్పం అనేది ఒక ప్రారంభం మాత్రమే, కానీ ఆ ప్రయాణాన్ని గమ్యానికి చేర్చేది మాత్రం సరైన శాస్త్రీయ మద్దతు మాత్రమే.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సిగరెట్ మానేయడానికి విల్ పవర్ ఒక్కటే సరిపోదా?

లేదు. పట్టుదల ప్రాథమిక అవసరమే అయినా, నికోటిన్ వ్యసనం మెదడుపై చూపే ప్రభావం వల్ల శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) మరియు నిపుణుల సలహాలు తీసుకుంటే విజయావకాశాలు పెరుగుతాయి.

2. సిగరెట్ మానేయడం వల్ల వచ్చే విత్ డ్రాయల్ లక్షణాలు ఏమిటి?

సిగరెట్ మానేసిన కొత్తలో విపరీతమైన కోపం, చికాకు, ఏకాగ్రత లోపించడం, నిద్ర పట్టకపోవడం మరియు విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికమే.

3. నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) అంటే ఏమిటి?

సిగరెట్ ద్వారా కాకుండా గమ్స్, ప్యాచెస్ లేదా ఇతర రూపాల్లో తక్కువ మోతాదులో నికోటిన్‌ను శరీరానికి అందిస్తూ, క్రమంగా ఆ వ్యసనం నుంచి బయటపడేలా చేసే శాస్త్రీయ పద్ధతి ఇది.

4. మానేసిన తర్వాత మళ్ళీ తాగాలనిపిస్తే ఏం చేయాలి?

అలాంటి సమయంలో నీళ్లు తాగడం, వేరే పనిలో నిమగ్నమవ్వడం లేదా లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. అవసరమైతే వెంటనే డాక్టర్ లేదా కౌన్సెలర్‌ను సంప్రదించాలి.

- డాక్టర్ ఉషా చెన్నూరు,

వైద్య నిపుణులు, సిప్లా హెల్త్

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More