Healthy breakfast : ఉదయాన్నే అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం, అలసట ఖాయం!

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం అత్యంత కీలకమని ప్రముఖ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, వెంటనే నీరసానికి గురిచేసే టిఫిన్లకు దూరంగా ఉంటూ.. ప్రొటీన్ ఆధారిత ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలో ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి.

Published on: Oct 4, 2026, 09:10:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కొన్ని రోజులు నిద్రలేవగానే ఎంతో ఉత్సాహంగా, రోజంతా చురుగ్గా పనిచేస్తాం. కానీ మరికొన్ని రోజులు అందుకు భిన్నంగా తీవ్రమైన బద్ధకం, నీరసం ఆవహిస్తాయి. ఎలాంటి పని చేయాలనిపించదు. దీనికి వాతావరణ మార్పులో లేక నిద్ర లేమియో కారణమని భావిస్తుంటాం. కానీ మన శక్తి స్థాయిలను నిర్ణయించడంలో మనం ఉదయం తీసుకునే అల్పాహారానిదే ప్రధాన పాత్ర అని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ అంటున్నారు.

ఉదయాన్నే అల్పాహారంలో ఇవి తింటున్నారా?
ఉదయాన్నే అల్పాహారంలో ఇవి తింటున్నారా?

మనం ఉదయాన్నే తినే టిఫిన్ మన జీవక్రియలను నిర్దేశిస్తుందని ఆమె వివరించారు. సాధారణంగా మనం తినే కొన్ని రకాల టిఫిన్లు మన ఆరోగ్యానికి, శక్తి స్థాయిలకు ఎలా నష్టం కలిగిస్తున్నాయో ఇన్​స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియోలో విశ్లేషించారు.

బ్లడ్ షుగర్ పెంచే చేసే సాధారణ టిఫిన్లు..

మనదేశంలో చాలామంది ఉదయాన్నే ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ, పోహా (అటుకులు) లేదా బ్రెడ్, ప్యాన్‌కేక్‌లు, పాలు-సిరియల్స్, పండ్ల రసాలు తీసుకోవడం అలవాటు. ఇవి రుచిగా ఉండి, కడుపు నిండిన భావనను ఇచ్చినప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా వేగంగా పెంచుతాయని అంజలి ముఖర్జీ హెచ్చరించారు.

రక్తంలో షుగర్ స్థాయిలు ఉన్నపళంగా పెరిగి, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. దీనివల్ల తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం, తీవ్రమైన నీరసం, అలసట ఆవహించడం జరుగుతుంది.

శక్తినిచ్చే ప్రొటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్..

అలసటను తరిమికొట్టి, రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం పూట ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న టిఫిన్ తింటే కడుపు ఎక్కువ సేపు నిండినట్లు ఉండటమే కాకుండా, పదే పదే పిండి పదార్థాలు తినాలనే కోరికలు అదుపులోకి వస్తాయి.

గుడ్డు, పన్నీర్ ప్రత్యామ్నాయాలు: ఎగ్ భూర్జీ, టోఫు భూర్జీ, పన్నీర్ భూర్జీ, శనగపిండితో చేసే బేసన్ చిల్లా వంటివి అల్పాహారంలో చేర్చుకోవాలి.

శాకాహారులకు ప్రత్యేక ఆప్షన్లు: పెనంపై కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి కాల్చిన 100 గ్రాముల పన్నీర్ లేదా పన్నీర్ పరాఠా, పన్నీర్ భూర్జీ తీసుకోమని సూచించారు. వీటితో పాటు తాజా వెజిటబుల్ జ్యూస్ తాగడం మంచిది.

మాంసాహారుల కోసం: ఉదయాన్నే పండ్లతో రోజును ప్రారంభించి, ఆ తర్వాత 1-2 గుడ్లతో (హోల్ ఎగ్ లేదా ఎగ్ వైట్) పాటు టోస్ట్ తీసుకోవచ్చు. ఆపై టమోటా-క్యారెట్-బీట్‌రూట్ జ్యూస్ లేదా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగి బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయవచ్చు.

మెటబాలిజం మెరుగుపడుతుంది..

ఉదయాన్నే ప్రొటీన్ తీసుకోవడం వల్ల మజిల్ మాస్ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే శరీర జీవక్రియ రేటు పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతూ శక్తి స్థాయిలు రోజంతా స్థిరంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

అలాగే అలసట నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి రోజూవారీ ఆహారంలో పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలతో పాటు బెర్రీలు, సిట్రస్ (నారింజ, నిమ్మ) పండ్లను చేర్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

"మీ రోజును ప్రొటీన్‌‌తో ప్రారంభించండి.. మీ శరీర జీవక్రియ మీకు ధన్యవాదాలు చెబుతుంది," అని అంజలి ముఖర్జీ తెలిపారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More