Indians arrested in US : అమెరికాలో 10మంది భారతీయులు అరెస్ట్​! వీసాా కోసం షాకింగ్​ ఫ్రాడ్​..

Indians arrested in US : అమెరికాలో 10మంది భారతీయులు అరెస్ట్​ అయ్యారు! ఏదైనా దోపిడీ, హింసకు గురయ్యే వారికి ఇచ్చే ‘యూ’ వీసా కోసం వీరు ఫ్రాడ్​కి పాల్పడ్డారు. వీరికి జైలు శిక్షతో పాటు రూ. 2కోట్లకుపైగా జరిమానా విధించే అవకాశం ఉంది.

Published on: Mar 14, 2026, 06:45:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో అక్రమంగా నివసించేందుకు కొందరు భారతీయులు వేసిన మాస్టర్ ప్లాన్‌ను ఎఫ్‌బీఐ అధికారులు ఛేదించారు. వీసా ప్రయోజనాల కోసం ఏకంగా 'సాయుధ దోపిడీ' డ్రామాలాడుతున్న ముఠాను గుర్తించి, శుక్రవారం అమెరికాలోని నాలుగు వేర్వేరు రాష్ట్రాల్లో 10 మంది భారతీయ పౌరులను అరెస్ట్ చేశారు.

The FBI said 11 Indians have been charged in connection with staged armed robberies. (X/FBI Boston)
The FBI said 11 Indians have been charged in connection with staged armed robberies. (X/FBI Boston)

అసలేం జరిగింది?

అమెరికాలో ‘యూ’ కేటగిరీ కింద వీసా పొందడం కోసం ఈ నిందితులు నకిలీ దోపిడీలను సృష్టించారు. సాధారణంగా అమెరికాలో ఏదైనా హింసాత్మక నేరానికి గురై, శారీరక లేదా మానసిక వేధింపులు అనుభవించిన బాధితులకు అక్కడి ప్రభుత్వం 'యూ' వీసా మంజూరు చేస్తుంది.

దీనిని ఆసరాగా చేసుకున్న ఈ ముఠా, తాము బాధితులమని నిరూపించుకోవడానికి దొంగతనాల డ్రామాలు ఆడారు.

ఫేక్​ దోపిడీలు ఎలా జరిగేవి?

2023 నుంచి మసాచుసెట్స్ రాష్ట్రంలోని లిక్కర్ స్టోర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కన్వీనియెన్స్ స్టోర్లలో ఈ నకిలీ దోపిడీలు జరుగుతున్నాయి.

వ్యూహం: ఒక వ్యక్తి ఆయుధంతో స్టోర్‌లోకి వచ్చి క్లర్క్‌ను బెదిరించి, నగదు పట్టుకుని పారిపోతాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది.

పోలీసులకు సమాచారం: దొంగ పారిపోయిన కనీసం ఐదు నిమిషాల తర్వాతే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తద్వారా దొంగ దొరక్కుండా జాగ్రత్తపడతారు.

నిందితుల పాత్ర: ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి రాంభాయ్ పటేల్ అని తెలుస్తోంది. 'యూ' వీసా కోసం బాధితులుగా నటించే వారు రాంభాయ్‌కు భారీగా డబ్బులు ఇస్తుంటారు. అతను ప్లాన్​ని అమలు చేస్తుంటాడు. స్టోర్‌లో దోపిడీ జరగనిచ్చినందుకు యజమానికి, అలాగే 'బాధితుడిగా' నటించినందుకు క్లర్క్‌కు రాంభాయ్ డబ్బులు చెల్లిస్తాడు.

ఈ డ్రామా పూర్తయ్యాక, తాము హింసాత్మక నేరానికి గురయ్యామని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి, ఆ సాక్ష్యాలతో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు.

ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలిన నిజాలు..

ఈ కేసులో మొత్తం 11 మంది భారతీయులపై అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో 10 మందిని అరెస్ట్ చేయగా, 11వ నిందితుడిని ఇప్పటికే భారత్‌కు డిపోర్ట్ (దేశం నుంచి పంపించివేయడం) చేశారు.

అరెస్టయిన వారిలో జితేంద్రకుమార్ పటేల్, మహేష్‌కుమార్ పటేల్, సంజయ్‌కుమార్ పటేల్, అమితాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మితుల్ పటేల్ (మసాచుసెట్స్), రమేష్‌భాయ్ పటేల్, రోనక్కుమార్ పటేల్, సోనాల్ పటేల్, మినేష్ పటేల్ (కెంటుకీ, మిస్సౌరీ, ఒహియో) ఉన్నారు.

దోపిడీలు చేసిన రాంభాయ్ పటేల్, అతడి డ్రైవర్‌ను అధికారులు ఇదివరకే పట్టుకుని శిక్షించారు.

శిక్ష ఏముంటుంది?

వీసా మోసానికి పాల్పడినందుకు నిందితులపై కుట్ర కేసులు నమోదు చేశారు. వీరికి ఐదేళ్ల జైలు శిక్ష, మూడు సంవత్సరాల పర్యవేక్షణ, 2.50 లక్షల డాలర్ల (సుమారు రూ. 2.10 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. అమెరికాలో 'యూ' వీసా అంటే ఏంటి? ఇది ఎవరికి ఇస్తారు?

అమెరికాలో ఏదైనా హింసాత్మక నేరానికి (ఉదాహరణకు: సాయుధ దోపిడీ, అత్యాచారం, కిడ్నాప్ వంటివి) గురైన బాధితులకు 'యూ' నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాను మంజూరు చేస్తారు. నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించే బాధితులకు, వారు ఎదుర్కొన్న మానసిక లేదా శారీరక వేధింపుల ఆధారంగా అక్కడ నివసించే అవకాశం కల్పిస్తారు. నిందితులు ఇదే వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఈ మోసానికి పాల్పడ్డారు.

2. ఈ నకిలీ దోపిడీల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు?

ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారి రాంభాయ్ పటేల్. ఇతడు ఇతర భారతీయుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, వారు 'బాధితులుగా' కనిపించేలా స్టోర్లలో నకిలీ దోపిడీలను ప్లాన్ చేసేవాడు. ఇందుకోసం స్టోర్ యజమానులకు కూడా కమీషన్లు ఇచ్చేవాడు. ఎఫ్‌బీఐ దర్యాప్తులో ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు తేలింది.

3. పట్టుబడిన భారతీయులకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది?

వీసా మోసం కోసం కుట్ర పన్నినందుకు వీరిపై ఫెడరల్ కేసులు నమోదయ్యాయి. ఈ నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, సుమారు రూ. 2.10 కోట్ల (2,50,000 డాలర్లు) జరిమానా పడే అవకాశం ఉంది. శిక్షాకాలం పూర్తయ్యాక వారిని శాశ్వతంగా భారత్‌కు డిపోర్ట్ (దేశం నుంచి పంపించివేయడం) చేసే అవకాశం లేకపోలేదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More