Renault Duster : 2026 రెనాల్ట్ డస్టర్ కొనాలా? వద్దా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ఇదిగో..
Renault Duster review : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్ మునుపెన్నడూ లేనంతగా వేడెక్కుతోంది. ఈ పోటీని తట్టుకుని, తన పాత వైభవాన్ని చాటుకోవడానికి 'రెనాల్ట్ డస్టర్' సరికొత్త హంగులతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2026 రెనాల్ట్ డస్టర్‌కి సంబంధించిన మా ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఇక్కడ చూసేయండి..
భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ రోజురోజుకూ విస్తరిస్తోంది. వాహన తయారీ సంస్థలు నిరంతరం కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతుండటంతో, ఈ విభాగంలో పోటీ 'కట్-త్రోట్' (అత్యంత కఠినంగా) మారుతోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, మారుతీ సుజుకీ విక్టోరిస్, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, టాటా సియెర్రా, మహీంద్రా థార్ రాక్స్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి హేమాహేమీలు ఉన్నాయి.

ఇంతటి తీవ్రమైన పోటీ మధ్య, రెనాల్ట్ సంస్థ తన లెజెండరీ బ్రాండ్ పేరును పునరుద్ధరిస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. అదే.. 'రెనాల్ట్ డస్టర్'! రూ. 10.49 లక్షల (ఆర్-పాస్ లేకుండా ఎక్స్-షోరూమ్) ఆకర్షణీయమైన ధరతో, ఇది పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, నేటి కాలానికి తగ్గ ఆధునిక స్టైలింగ్, సౌకర్యాలతో మన ముందుకు వచ్చింది. రెనాల్ట్ కంపెనీకి ప్రస్తుతం ఇది 'ఫ్లాగ్‌షిప్' ఉత్పత్తి. మా హెచ్‌టీ ఆటో టీమ్ ఈ కొత్త డస్టర్‌ను ఒక రోజంతా డ్రైవ్ చేసింది. ఈ నేపథ్యంలో 2026 రెనాల్ట్ డస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఇక్కడ చూసేయండి..
2026 రెనాల్ట్ డస్టర్: ఎక్స్‌టీరియర్..
డస్టర్ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్ విషయంలో రెనాల్ట్ చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంది. ఈ కారు రోడ్డుపై వెళుతుంటే కచ్చితంగా అందరూ వెనక్కి తిరిగి చూస్తారు! దీని రోడ్ ప్రెజెన్స్ అలాంటిది మరి. హెచ్‌టీ ఆటో టీమ్ డెహ్రాడూన్ నుంచి తెహ్రీ లేక్ వరకు, మళ్లీ వెనక్కి ప్రయాణించినప్పుడు, ఈ కారును గమనించని వ్యక్తి ఒక్కరు కూడా లేరట! జనం టీమ్ దగ్గరకు వచ్చి, కారు గురించి ఆరా తీశారు. ఇది భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని కుతూహలంగా అడిగారు.
కొత్త డస్టర్ బాహ్య రూపంలో ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, ఫ్రంట్ గ్రిల్ కింది భాగంలో అమర్చిన ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. దీనికి అదనంగా, కారుకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్, అప్పీల్ ఇచ్చేలా భారీ ఫ్రంట్ బంపర్‌ను రూపొందించారు. బంపర్ అంచుల్లో ఫంక్షనల్ ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి. బంపర్‌పై ఉన్న క్లాడింగ్‌కు సిల్వర్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు, ఇది భారత్‌లో గతంలో అమ్ముడైన డస్టర్ డిజైన్ అంశాలను గుర్తు చేస్తుంది.
ముందు బంపర్‌పై రెనాల్ట్ లోగోకు బదులుగా 'Duster' అని రాసి ఉన్న బ్యాడ్జింగ్ ఉంది. అంతేకాకుండా, ఇందులో 360-డిగ్రీ కెమెరా సెటప్‌లో భాగంగా ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా అమర్చారు. ముందు నుంచి చూస్తే ఈ కారు చాలా అగ్రెసివ్‌గా, శక్తివంతంగా కనిపిస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. తమ కారు చూడటానికి సున్నితంగా కాకుండా, అగ్రెసివ్‌గా ఉండాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!

2026 రెనాల్ట్ డస్టర్ సైడ్ ప్రొఫైల్ చూస్తే.. బ్లాక్ క్లాడింగ్, రూఫ్ రైల్స్‌తో ఇది పక్కా ఎస్‌యూవీలా అనిపిస్తుంది. ఈ రూఫ్ రైల్స్ కేవలం షో కోసం మాత్రమే కాదు, ఇవి 50 కిలోల బరువును మోయగలవు. కొత్త డస్టర్ 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. హోండా ఎలివేట్ (220 ఎంఎం) తర్వాత ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యుత్తమం. ఫ్రంట్ డోర్‌పై 'డస్టర్ ఐకానిక్' బ్యాడ్జింగ్, ఓఆర్వీఎంలపై టర్న్ ఇండికేటర్లు, రూఫ్‌పై షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు ఉన్నాయి.
వెనుక భాగం కూడా ముందు భాగంలాగే అగ్రెసివ్‌గా, పటిష్టంగా కనిపిస్తుంది. రియర్ డెఫాగర్, రియర్ వైపర్, వాషర్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, నాలుగు పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. భారీ క్లాడింగ్‌తో ఉన్న రియర్ బంపర్ దీనికి పెద్ద ఎస్‌యూవీ రూపాన్ని ఇచ్చింది. ఈ కారులో పవర్డ్ టెయిల్‌గేట్ ఉంది, అంటే సామాన్లు లోడ్ చేసేటప్పుడు డిక్కీని ఎత్తడానికి లేదా మూయడానికి మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. క్యాబిన్ లోపల బూట్ రిలీజ్ బటన్ ఉండటమే కాకుండా, డిక్కీపై ఉన్న బటన్ ద్వారా కూడా దీనిని ఆపరేట్ చేయవచ్చు. కొత్త డస్టర్‌లో 518 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, పార్సెల్ ట్రే తొలగిస్తే దీనిని 700 లీటర్ల పైగా పెంచుకోవచ్చు.
2026 రెనాల్ట్ డస్టర్: ఇంటీరియర్..
ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్లతో పోలిస్తే ఇది అత్యుత్తమ ఇంటీరియర్స్ కలిగిన మోడల్ అని చెప్పవచ్చు. డస్టర్ కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా భారీ స్థాయిలో శబ్దం చేస్తుంది (అంటే ఫీచర్ల పరంగా బలమైన ముద్ర వేస్తుంది). కారు లోపలికి ప్రవేశించగానే, ఇది ఏ విషయంలోనూ తక్కువ కాదని మనకు అర్థమవుతుంది. డ్యాష్‌బోర్డ్ కార్బన్ ఫైబర్ లాంటి ఫినిషింగ్‌తో పాటు లెదర్ టచ్‌ను కలిగి ఉంది, ఇది క్యాబిన్ లుక్‌ను ప్రీమియంగా మారుస్తుంది.
డస్టర్‌లో అందించిన ఫీచర్ల జాబితా చాలా పెద్దది:
6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్, కో-ప్యాసింజర్ సీట్లు.
ఫిజికల్ బటన్లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్.
10.1 ఇంచ్ డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (గూగుల్ మ్యాప్స్ ఇన్-బిల్ట్). ఇది డ్రైవర్‌కు అనువుగా కొంచెం వంగి ఉంటుంది.
10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో).
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్.
రెండు యూఎస్బీ టైప్ సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, 12వీ ఛార్జింగ్ సాకెట్.
లెదరెట్ సీట్లు సౌకర్యవంతంగా ఉండి, డ్రైవర్‌కు మంచి సపోర్ట్ ఇస్తాయి. అయితే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా అలసట కలగవచ్చు. వెనుక సీట్లు కూడా చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. 6 అడుగుల లోపు ఎత్తు ఉన్నవారికి మోకాళ్ల వద్ద, తల వద్ద తగినంత స్థలం ఉంది. అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారికి కొంచెం ఇరుకుగా అనిపించవచ్చు. వెనుక సీటు ప్రయాణీకుల కోసం ఏసీ వెంట్స్, రెండు యూఎస్బీ-సీ పోర్ట్స్, స్మార్ట్‌ఫోన్‌ను పెట్టుకోగల ఆర్మ్‌రెస్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
2026 రెనాల్ట్ డస్టర్- ఇంజిన్ ఆప్షన్లు..
రెనాల్ట్ డస్టర్ 2026 ప్రస్తుతం రెండు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది:
టీసీఈ 100: ఇది 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ మూడు సిలిండర్ల ఇంజిన్. ఇది 98 bhp పవర్‌ని, 166 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు.
టీసీఈ 160: ఇది 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇది ఏకంగా 160 bhp పవర్‌ని, 280 Nm గరిష్ట టార్క్‌ని అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
2026 రెనాల్ట్ డస్టర్- డ్రైవింగ్ రివ్యూ..
డస్టర్ పాత తరం మాదిరిగానే అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇది డ్రైవింగ్ పిచ్చి ఉన్నవారికి సరైన కారు! ఈ కారు నడుపుతున్నంత సేపు టీమ్ ముఖంపై చిరునవ్వు చెదరలేదు. డెహ్రాడూన్ నుంచి తెహ్రీ లేక్ వరకు ఉన్న ఇరుకైన రోడ్లు, హెయిర్‌పిన్ బెండ్లు వంటి క్లిష్టమైన మలుపుల్లో కూడా కారు తన పట్టును కోల్పోలేదు. కారు పరిమాణం పెద్దదైనా, మలుపుల్లో బాడీ రోల్ చాలా తక్కువగా ఉంది.
స్టీరింగ్ వీల్ చాలా ఖచ్చితంగా ఉంది. మనం స్టీరింగ్‌ను ఎటు తిప్పితే కారు అటు వైపుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఎస్‌యూవీ దూసుకుపోతుంది. సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉంది, కొండ ప్రాంతాల్లోని గతుకుల రోడ్లపై వెళ్లినప్పుడు టీమ్‌కి ఇది అర్థమైంది. అయితే, దీని ధరను పరిగణనలోకి తీసుకుంటే బ్రేకింగ్ వ్యవస్థ ఇంకా కొంచెం మెరుగ్గా ఉండవచ్చని వారికి అనిపించింది. ముఖ్యంగా కిందికి దిగే ప్రయాణంలో బ్రేకులు పూర్తి నమ్మకాన్ని ఇవ్వలేదు! దీనివల్ల వారు వేగాన్ని తగ్గించడానికి బ్రేకుల కంటే ఇంజిన్ బ్రేకింగ్‌పైనే ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది.
1.3 లీటర్ ఇంజిన్ ఇచ్చే శబ్దాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా టర్బో విజిల్ శబ్దం వినడానికి అద్భుతంగా ఉంది, ఇది సాధారణంగా జేడీఎం కార్లలో మాత్రమే వినిపిస్తుంది.
మొత్తం మీద, ఈ సెగ్మెంట్‌లో కొత్త కారు కొనాలనుకునే వారికి రెనాల్ట్ డస్టర్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీ అని హెచ్‌టీ ఆటో టీమ్ చెప్పింది. దీని లుక్స్, డ్రైవింగ్ సామర్థ్యంస పర్ఫార్మెన్స్ ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తాయి. రూ. 10.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో, ఇది మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. రెనాల్ట్ చేతిలో మళ్లీ ఒక సక్సెస్ ఫుల్ ప్రాడక్ట్ దొరికినట్టే కనిపిస్తోంది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


