...
...
Next Story

Nvidia share : ఎంతపని చేశావు జెన్సన్! ‘అఫైర్’తో ఎన్విడియా ఇన్వెస్టర్ల రూ. 47,10,05,00,00,000 సంపద ఆవిరి

వివాహేతర సంబంధాలు, చైనా గూఢచర్యం ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్న జెన్సన్ హువాంగ్ వ్యవహారం ఎన్విడియా ఇన్వెస్టర్లను నిద్రలేకుండా చేస్తోంది! నాలుగు రోజుల పాటు సాగిన ఈ నాటకీయ పరిణామాలతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 490 నుంచి 500 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 47.10 లక్షల కోట్లు) ఆవిరైంది.

Published on: Nov 13, 2026, 13:53:53 IST
Advertisement

ప్రపంచ కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం ఎన్విడియా చరిత్రలో అత్యంత భారీ కుదుపు సంభవించింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితంలోని వివాహేతర సంబంధాల బాగోతం కాస్తా అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారడంతో కంపెనీ షేర్లు పేకమేడలా కుప్పకూలుతున్నాయి. ఈ వారం కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 490 నుంచి 500 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 47,10,050 కోట్లు) ఆవిరైంది!

ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ (REUTERS/File)
ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ (REUTERS/File)

సింగపూర్ డేటా సెంటర్ సంస్థ 'మెగాస్పీడ్' ఉన్నతోద్యోగిని, అనుమానిత చైనా గూఢచారి ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్ సంబంధంపై వారాంతంలో మొదలైన విచారణ, కేవలం నాలుగు రోజుల్లోనే ఆయన నిష్క్రమణకు దారితీసింది. వరుస వివాదాల ఒత్తిడి తట్టుకోలేక, 33 ఏళ్ల పాటు సంస్థను అగ్రపథాన నడిపించిన 63 ఏళ్ల హువాంగ్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు.

తాజా పరిణామాల మధ్య ఎన్విడియా మార్కెట్ పతనం సాగిన తీరును రోజువారీగా పరిశీలిద్దాము..

ఆదివారం, నవంబర్ 8: తప్పు ఒప్పుకున్న హువాంగ్.. బోర్డు విచారణ

తన భార్యకు నమ్మకద్రోహం చేశానని అంగీకరిస్తూ ఎన్విడియా కో-ఫౌండర్ జెన్సన్ హువాంగ్ వారాంతంలో సంస్థ ఉద్యోగులకు లేఖ రాయడంతో ఈ సంక్షోభం మొదలైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే డేటా సెంటర్ ఆపరేటర్ 'మెగాస్పీడ్ ఇంటర్నేషనల్' మాజీ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో (ఈమెకు జెన్సన్‌తో ఎలాంటి రక్తసంబంధం లేదు) తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆయన ధ్రువీకరించారు. ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారి అన్న అనుమానాలు ఉన్నాయని, ఆమెతో జెన్సన్‌కు సన్నిహిత సంబంధం ఉందని 'ది న్యూయార్క్ టైమ్స్' గత నెలలోనే కథనం ప్రచురించింది. నవంబర్ 6న 'ఫైనాన్షియల్ టైమ్స్' కూడా ఇదే విషయాన్ని బయటపెట్టింది.

సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లు ఎన్విడియా షేర్లను భారీగా అమ్మేశారు. సీబీఎస్ న్యూస్, ది టైమ్స్ కథనాల ప్రకారం, సోమవారం ఎన్విడియా షేర్లు 4.3 శాతం పడిపోగా, మంగళవారం మరో 5.5 శాతం నష్టపోయి 168.47 డాలర్ల వద్ద ముగిశాయి. రెండ్రోజుల్లో కలిపి 9.6 శాతం పతనంతో సంస్థ మార్కెట్ విలువ 430 బిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.

వివాహేతర సంబంధంపై అంతర్గత దర్యాప్తు నేపథ్యంలో, సోమవారం నవంబర్ 9న ట్రేడింగ్ మొదలైన తొలి అరగంటలోనే జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంపద 7.4 బిలియన్ డాలర్లు కరిగిపోయిందని ఫోర్బ్స్ వెల్లడించింది.

మార్కెట్లలో ఈ అలజడి కొనసాగుతుండగానే, ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. అయితే, "జెన్సన్ హువాంగ్ గౌరవనీయమైన వ్యక్తి," అని ట్రంప్ అభివర్ణించారు. మరోవైపు జాతీయ భద్రతా ముప్పుల విషయంలో ఎన్విడియా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియాలో ఒక షేర్ హోల్డర్ క్లాస్-యాక్షన్ దావా వేశారు. ఈ వరుస నష్టాలతో పతనమవుతున్న ఎన్విడియాను వెనక్కి నెట్టిన మైక్రోసాఫ్ట్, ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది.

నవంబర్ 11: కాసేపు ఊరట.. అంతలోనే రెండో బాంబు!

బుధవారం సాధారణ ట్రేడింగ్ సెషన్‌లో ఎన్విడియా షేర్లు కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. ఏఐ క్లౌడ్ భాగస్వామి ‘కోర్‌వీవ్’ బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో ఎన్విడియా షేర్లు 3 నుంచి 4.5 శాతం వరకు ఎగబాకి 173.73 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

కానీ మార్కెట్ ముగిసిన వెంటనే వెలువడిన రెండు సంచలన వార్తలు ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లాయి!

తన కింద పనిచేస్తున్న ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తోనూ జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందని 'ది న్యూయార్క్ టైమ్స్' బయటపెట్టింది. ఇదే సమయంలో హువాంగ్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఎన్విడియా బోర్డు సిద్ధమవుతోందని, ఆయన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే సమావేశం కానుందని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది. ఈ కథనాల దెబ్బకు ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు దాదాపు 8 శాతం కుప్పకూలి 160 డాలర్ల స్థాయికి పడిపోయాయని యాహూ ఫైనాన్స్ పేర్కొంది.

నవంబర్ 12: హువాంగ్ రాజీనామా.. 4 ట్రిలియన్ డాలర్ల వద్ద పరీక్ష

గురువారం మార్కెట్లు తెరవడానికి ముందే ఎన్విడియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ, బోర్డు సభ్యుడి పదవుల నుంచి జెన్సన్ హువాంగ్ తక్షణమే వైదొలిగినట్లు ప్రకటించింది. దీర్ఘకాలంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్​ఓ)గా పనిచేస్తున్న కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా, బోర్డు సభ్యుడు హార్వే జోన్స్‌ను సంస్థ తొలి స్వతంత్ర ఛైర్మన్‌గా నియమించింది.

మార్కెట్ ప్రారంభం కాగానే ఎన్విడియా షేర్లు ఏకంగా 14.3 శాతం పతనమై ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 148.80 డాలర్లను తాకాయి. ది స్ట్రెయిట్స్ టైమ్స్, మింట్ కథనాల ప్రకారం, దీనివల్ల ఒక్కరోజే తాత్కాలికంగా 601 బిలియన్ డాలర్ల విలువ ఆవిరైంది. 2025 మధ్యకాలం తర్వాత తొలిసారి కంపెనీ విలువ 4 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే ముగింపు సమయానికి షేర్లు కాస్త కోలుకుని 4.3 శాతం నష్టంతో 166.19 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

దీనితో ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 4.01 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు శుక్రవారం ముగింపు విలువ 4.498 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే మొత్తంగా దాదాపు 490 బిలియన్ డాలర్ల సంపద కరిగిపోయిందని యాహూ ఫైనాన్స్, ఫోర్బ్స్ గణాంకాలు స్పష్టం చేశాయి.

కుబేరుల జాబితాలో జెన్సన్ పతనం!

ఎన్విడియా షేర్ల పతనం జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంపదపై తీవ్ర ప్రభావం చూపింది. ఆయన నికర ఆస్తుల విలువ సుమారు 144.7 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 13వ స్థానానికి చేరుకున్నారు.

ఒక సాధారణ స్టార్టప్ స్థాయి నుంచి ప్రపంచ ఏఐ రారాజుగా ఎన్విడియాను తీర్చిదిద్దిన జెన్సన్ హువాంగ్ ప్రస్థానం ఇలా వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం కార్పొరేట్ చరిత్రలో పెను సంచలనంగా నిలిచిపోయింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks