జేఈఈ స్కోరు లేకపోయినా ఐఐటీలో చదవాలా? ఈ 5 కోర్సులే మీకు మార్గం!

ఐఐటీల్లో చదవాలంటే కేవలం జేఈఈ పరీక్షే ఏకైక మార్గం అనే పాత నమ్మకాన్ని చెరిపేసే సమయం వచ్చింది! జేఈఈ స్కోరుతో సంబంధం లేకుండానే అనేక ఐఐటీలు పలు కీలక కోర్సులను ఆఫర్​ చేస్తున్నాయి. పైగా నేటి టెక్​ యుగంలో ఇవి చాలా అవసరం కూడా! ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Feb 16, 2026, 06:45:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా ఐఐటీల్లో (ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ) సీటు సాధించాలంటే అత్యంత కఠినమైన జేఈఈ పరీక్ష రాయాల్సిందే అని అందరూ భావిస్తారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఐటీలు తమ విద్యా విధానాన్ని సమూలంగా మార్చుకుంటున్నాయి. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆర్ట్స్, కామర్స్ నేపథ్యం ఉన్నవారికి కూడా తమ తలుపులు తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ స్కోర్‌తో సంబంధం లేకుండా ఐఐటీలు అందిస్తున్న కొన్ని ప్రముఖ కోర్సుల వివరాలు ఇక్కడ చూసేయండి..

జేఈఈ స్కోరు లేకపోయినా ఐఐటీలో చదవాలా?
జేఈఈ స్కోరు లేకపోయినా ఐఐటీలో చదవాలా?

జేఈఈ మెయిన్స్​ లేకుండానే ఐఐటీల్లో ప్రవేశం- ఈ కోర్సుల ద్వారా..

1. జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్స్ - ఐఐటీ గువాహటీ

లైఫ్ సైన్సెస్ లేదా బయోటెక్నాలజీ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం. ఈ ఎన్​పీటీఈఎల్​ కోర్సు ద్వారా జెనెటిక్ ఇంజనీరింగ్ మూలాలు, మోడరన్ మాలిక్యులర్ బయాలజీ, క్లోనింగ్ వంటి అధునాతన అంశాలను నేర్చుకోవచ్చు. పరిశోధన రంగంపై ఆసక్తి ఉన్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం.

2. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ - ఐఐటీ ఖరగ్‌పూర్

గణితంలో పట్టు సాధించాలనుకునే సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్ ఈ ఆన్‌లైన్ కోర్సును అందిస్తోంది. ఇందులో డిఫరెన్షియల్ కాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా వంటి ముఖ్యమైన టాపిక్స్ ఉంటాయి. ఎనలిటికల్ స్కిల్స్ పెంచుకోవాలనుకునే వారు జేఈఈ రాయకుండానే నేరుగా ఈ కోర్సులో చేరవచ్చు.

3. రోబోటిక్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ - ఐఐటీ దిల్లీ

ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ లేదా మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పనిచేసే నిపుణుల కోసం ఈ 5 నెలల ఆన్‌లైన్ కోర్సును డిజైన్ చేశారు.

ఫీజు: రూ. 1.69 లక్షలు (+18శాతం జీఎస్టీ).

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.

ప్రత్యేకత: తరగతులు వారాంతాల్లో (శని, ఆదివారాలు) మాత్రమే ఉంటాయి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్​) అప్లికేషన్లపై ప్రత్యేక దృష్టి పెడతారు.

4. థర్మోడైనమిక్స్ - ఐఐటీ మద్రాస్

బయోటెక్నాలజీ, థర్మల్ సైన్సెస్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఈ ఎన్​పీటీఈఎల్​ కోర్సు అందుబాటులో ఉంది. కేవలం థియరీ మాత్రమే కాకుండా, నిత్య జీవితంలో థర్మోడైనమిక్స్ నియమాలు ఎలా పనిచేస్తాయో ఇందులో వివరిస్తారు.

5. పైథాన్ ప్రోగ్రామింగ్ - ఐఐటీ బాంబే

నేటి డిజిటల్ యుగంలో పైథాన్ భాషకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఐటీ బాంబే 'స్వయం' ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఉచిత ఆన్‌లైన్ కోర్సును అందిస్తోంది. హైస్కూల్ విద్యార్థుల నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు ఎవరైనా ఇందులో చేరి డేటా సైన్స్, ఆటోమేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు.

ఐఐటీ విద్య కేవలం జేఈఈ టాపర్లకు మాత్రమే పరిమితం కాదు అనే విషయాన్ని ఈ కోర్సులు స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్నెట్ సాయంతో ప్రపంచస్థాయి విద్యను సామాన్యులకు కూడా అందుబాటులోకి తేవడమే ఐఐటీల ప్రధాన లక్ష్యం.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- ఈ కోర్సుల్లో చేరడానికి జేఈఈ స్కోర్ అస్సలు అవసరం లేదా?

సమాధానం- అవసరం లేదు. పైన పేర్కొన్న కోర్సులు ప్రత్యేకంగా రూపొందించినవి. వీటికి ప్రవేశ పరీక్షల కంటే ఆయా సబ్జెక్టులపై ఆసక్తి, కనీస అర్హత (డిగ్రీ లేదా ఇంటర్మీడియట్) ఉంటే సరిపోతుంది. వీటి వల్ల నేరుగా ఇంజనీరింగ్ డిగ్రీ రాదు కానీ, ఐఐటీ సర్టిఫికేషన్, నైపుణ్యాలు లభిస్తాయి.

ప్రశ్న- ఐఐటీ దిల్లీ అందించే రోబోటిక్స్ కోర్సు ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది?

సమాధానం- ఈ కోర్సు ప్రధానంగా ఉద్యోగస్తుల కోసం ఉద్దేశించినది. బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50% మార్కులు ఉన్నవారు దీనికి అర్హులు. రోబోటిక్స్ రంగంలోకి కెరీర్ మార్చుకోవాలనుకునే వారికి లేదా ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో నైపుణ్యం పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

ప్రశ్న- ఐఐటీ బాంబే అందించే పైథాన్ కోర్సు ఉచితమేనా?

సమాధానం- అవును, ఐఐటీ బాంబే 'స్వయం' ప్లాట్‌ఫామ్ ద్వారా అందిస్తున్న పైథాన్ కోర్సు నేర్చుకోవడానికి ఉచితం. అయితే, మీరు అధికారికంగా ఐఐటీ సర్టిఫికేట్ పొందాలనుకుంటే మాత్రం నిర్ణీత ఫీజు చెల్లించి, పరీక్ష రాయాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More