మెట్రో నగరాల్లో నివసిస్తూ ఉద్యోగాలు చేసే యువతకు రోజూ వంట చేసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఆఫీసులో పని ఒత్తిడి, డెడ్‌లైన్లు, గంటల తరబడి ట్రాఫిక్ ప్రయాణాలు, నెలవారీ ఖర్చుల లెక్కల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కష్టమవుతోంది. కనీసం సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా నేడు ఒక భారంగా తయారైంది. ఇప్పటికే బిజీగా ఉన్న దినచర్యలో మెనూ ప్లాన్ చేసుకోవడం, శరీరానికి అవసరమైన ప్రోటీన్, కేలరీలను లెక్కించుకోవడం అదనపు బాధ్యతల్లా అనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో లక్షలాది మంది యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. హాస్టళ్లు, పీజీలలో దొరికే ఆహారం రుచిగా ఉండక, రోజూ ఆన్‌లైన్‌లో రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న భయంతో చాలామంది సతమతమవుతున్నారు. సరిగ్గా ఇదే సమస్యకు పరిష్కారం చూపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ యువ దంపతులు తమ ఐటీ ఉద్యోగాలను వదిలిపెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదిగారు!
స్టార్టప్ పీడియా కథనం ప్రకారం.. ఐటీ నిపుణులైన దియా కృష్ణకుమార్, ఆదిత్య నటరాజన్ 2024 సెప్టెంబర్‌లో 'వెల్‌ఫెడ్' (Wellfed) పేరుతో ఆరోగ్యకరమైన మీల్ సబ్‌స్క్రిప్షన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. తమ సొంత పొదుపు నుంచి రూ. 15 లక్షల పెట్టుబడితో మొదలుపెట్టిన ఈ సంస్థ, 2026 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా రూ. 56 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. ఇప్పటివరకు 1,500 మందికి పైగా వినియోగదారులకు సేవలు అందిస్తూ, 55,000కు పైగా భోజనాలను డెలివరీ చేసింది.
"యువ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందిని మార్చాలనే మేము ప్రయత్నిస్తున్నాము. ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా, ఉదయం లేదా మధ్యాహ్నం ఆఫీసు హడావుడి ఎలా ఉందన్న ఆందోళన లేకుండా వారికి ఆరోగ్యకరమైన, ఇంటి భోజనం లాంటి ఆహారం సులభంగా అందాలి. ఇప్పటివరకు 55 వేల భోజనాలు అందించిన తర్వాత కూడా మేము ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము," అని దియా కృష్ణకుమార్ పేర్కొన్నారు.
సొంత కష్టమే వ్యాపార ఆలోచనగా మారిందిలా!
బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల దియా, ఆదిత్య ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు. ఒకే ఐటీ కంపెనీలో తమ కెరీర్ ప్రారంభించి, మూడేళ్లకు పైగా కార్పొరేట్ రంగంలో పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎంబీఏ పూర్తి చేశారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న రోజుల్లో బిజీ షెడ్యూల్ మధ్య సమయానికి మంచి భోజనం దొరకడం ఎంత కష్టమో వారు స్వయంగా అనుభవించారు.
{{/usCountry}}బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల దియా, ఆదిత్య ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు. ఒకే ఐటీ కంపెనీలో తమ కెరీర్ ప్రారంభించి, మూడేళ్లకు పైగా కార్పొరేట్ రంగంలో పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎంబీఏ పూర్తి చేశారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న రోజుల్లో బిజీ షెడ్యూల్ మధ్య సమయానికి మంచి భోజనం దొరకడం ఎంత కష్టమో వారు స్వయంగా అనుభవించారు.
{{/usCountry}}అలసిపోయి ఇంటికి వచ్చాక వంట చేసే ఓపిక లేక కొన్ని రోజులు బయటి నుంచి పార్శిల్ తెచ్చుకునేవారు. మరికొన్ని రోజులు ఏదో ఒకటి వండుకుని తినేవారు. సోషల్ మీడియాలో కనిపించే 20 నిమిషాల వంటకాలు సాధారణ వంటింట్లో చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయని దియా గ్రహించారు. రోజంతా ఆఫీసులో కష్టపడిన తర్వాత ఇంటికొచ్చి వంట చేయాలని ఆశించడం ఆచరణలో సాధ్యం కాదని వారికి అర్థమైంది.
మధ్యాహ్న, రాత్రి భోజనాలు అందించే మీల్ సబ్‌స్క్రిప్షన్ సేవల కోసం వారు అన్వేషించారు. అయితే మార్కెట్లో ఉన్న సంస్థలన్నీ రకరకాల ఖరీదైన వంటకాలపై దృష్టి పెట్టాయే తప్ప, సాధారణ ఇంటి భోజనాన్ని అందించడం లేదని గుర్తించారు. కఠినమైన డైట్ చేస్తున్నామన్న భావన కలగకుండా పప్పు, కూరగాయలు, రొట్టెలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఇంటి రుచులను అందుబాటు ధరలో అందించాలని నిర్ణయించుకున్నారు. అలాంటి సేవలు ఎక్కడా కనిపించకపోవడంతో తామే ఆ వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఆరుగురితో మొదలై.. 55 వేల భోజనాల ప్రస్థానం!
వెల్‌ఫెడ్ ప్రారంభించిన కొత్తలో వ్యవస్థాపకులు ఇద్దరితో పాటు ఒక న్యూట్రిషనిస్ట్, ఒక వంటమనిషి, ఒక సహాయకుడు, ఒక డెలివరీ బాయ్‌తో కలిపి మొత్తం ఆరుగురు మాత్రమే ఉండేవారు. ఆహారంలో పోషక విలువలు, కేలరీలను న్యూట్రిషనిస్ట్ నిర్ణయిస్తే, మిగిలిన బృందం వంట, డెలివరీ బాధ్యతలను చూసుకునేది. మార్కెట్లోకి అడుగుపెట్టే ముందు తమ ఆహారాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అందరి నుంచి మంచి స్పందన రావడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు. పెద్ద పెద్ద రెస్టారెంట్ వంటకాలు ఇచ్చే అనుభూతి కంటే, ఇంటి భోజనం ఇచ్చే తృప్తి ఎంతో గొప్పదని దియా బలంగా నమ్మారు.
మెనూలో ఇంటి రుచులు.. సోషల్ మీడియాతో తొలి అడుగు
వెల్‌ఫెడ్ మెనూలో మనం రోజువారీ ఇంట్లో చేసుకునే పప్పు, ఆలూ గోబీ, జొన్న రొట్టెలు, అల్లం కోడికూర (అద్రకీ చికెన్), చోలే చాట్ వంటి వంటకాలు ఉంటాయి. శరీరానికి తగినంత ప్రోటీన్ అందేలా పనీర్, టోఫు, సోయా, చికెన్ వంటి పదార్థాలను భోజనంలో భాగం చేశారు. అప్పుడప్పుడు కొత్త రుచులు కోరుకునే వారి కోసం ర్యాప్స్, బిర్యానీలు, ఇండో-చైనీస్ వంటకాలను కూడా మెనూలో చేర్చారు.
ఈ స్టార్టప్‌కు తొలి రోజుల్లోనే సోషల్ మీడియా ద్వారా మంచి ప్రచారం లభించింది. బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వెల్‌ఫెడ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ ఒక్క వీడియో ద్వారా సంస్థకు మొదటి 100 మంది వినియోగదారులు లభించారు. తమ నిజజీవిత సమస్యనే వ్యాపార అవకాశంగా మలుచుకుని, నాణ్యమైన ఇంటి భోజనాన్ని అందిస్తూ ఈ యువ దంపతులు నేడు ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.