...
...
Next Story

Bus accident : ఉత్తరాఖండ్‌లో విషాదం- లోయలో పడిపోయిన బస్సు.. 8 మంది మృతి!

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లా గులార్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్ నుంచి చమోలీ వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి 100 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Published on: Nov 17, 2026, 09:46:00 IST
Advertisement

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో మంగళవారం వేకువజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు గులార్ మార్కెట్ సమీపంలోని వంతెన పైనుంచి అదుపుతప్పి 100 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనాస్థలం వద్ద దృశ్యం.. (Sourced)
ఘటనాస్థలం వద్ద దృశ్యం.. (Sourced)

అధికారిక వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యూకే09పీఏ-9779 రిజిస్ట్రేషన్ నంబర్ గల బస్సు హరిద్వార్ నుంచి చమోలీ బయలుదేరింది. గులార్ మార్కెట్ దగ్గర ఉన్న వంతెన వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెన పైనుంచి కింద ఉన్న లోతైన లోయలోకి దూసుకెళ్లింది. వేకువజాము సమయం కావడంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పెను విషాదం జరిగిపోయింది.

రంగంలోకి ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు.. క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్​డీఆర్​ఎఫ్), స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. బియాసి పోస్ట్ నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ధల్వాలా పోస్ట్, బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి అదనపు బృందాలను కూడా అక్కడికి పంపించారు.

"సమాచారం అందిన వెంటనే బియాసి పోస్ట్ నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ధల్వాలా పోస్ట్, బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి అదనపు బృందాలను కూడా రప్పించాము," అని ఎస్‌డీఆర్ఎఫ్ కమాండెంట్ అర్పణ్ యదువంశీ తెలిపారు.

"నుజ్జునుజ్జయిన వాహనం నుంచి 26 మంది క్షతగాత్రులను రక్షించి, నిటారుగా ఉన్న లోయ అంచు నుంచి స్ట్రెచర్ల సాయంతో రోడ్డు పైకి తీసుకొచ్చాము. అక్కడి నుంచి అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించాము. మరణించిన ఎనిమిది మంది మృతదేహాలను కూడా వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపాము," అని అర్పణ్ యదువంశీ వివరించారు. లోయ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా ప్రయాణికులు చిక్కుకుని ఉన్నారేమోనని క్షుణ్ణంగా గాలించిన తర్వాతే సహాయక చర్యలను ముగించినట్లు ఆయన వెల్లడించారు.

ఉత్తరాఖండ్ రహదారులపై పొంచి ఉన్న ప్రమాదం.. నియంత్రణకు కొత్త పాలసీ

పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. గణాంకాల ప్రకారం ప్రతి ఏటా రాష్ట్రంలో 1,000 కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. కొండల మధ్య ఉండే ఇరుకైన దారులు, ప్రమాదకర మలుపులు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా దారి సరిగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతోంది.

పర్వత రహదారులపై జరుగుతున్న ఈ ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. 2030 నాటికి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో, 2025 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ మంత్రివర్గం ‘రోడ్ సేఫ్టీ పాలసీ-2025’కి ఆమోదం తెలిపింది.

కాగా రహదారుల విస్తరణ, బ్లాక్ స్పాట్ల వద్ద రక్షణ గోడల నిర్మాణం, రాత్రిపూట ప్రయాణాలపై నియంత్రణ వంటి చర్యలను పటిష్టంగా అమలు చేస్తేనే ఇలాంటి ఘోర ప్రమాదాలను నివారించగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks