8th Pay Commission : 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతాల పెంపు అంతంత మాత్రమే! కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి?
8th Pay Commission salary hike : 8వ వేతన సంఘంపై కసరత్తు జోరుగా సాగుతోంది. ఉద్యోగ సంఘాలు ఇటీవలే తమ డిమాండ్లను ప్రభుత్వ కమిటీల ముందు ఉంచాయి. అయితే అన్ని డిమాండ్లను పరిష్కరించే యోచనలో కేంద్రం లేదని, మరీ ముఖ్యంగా ఈసారి జీతాల పెంపు పెద్దగా ఉండకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
8th Pay Commission latest news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలకు సంబంధించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవలి వారాల్లో వివిధ ఉద్యోగ సంఘాలు జీతాల పెంపు, ఫార్ములాలపై ప్రభుత్వ కమిటీకి పలు ప్రతిపాదనలు సమర్పించాయి. అయితే, తాజా నివేదికల ప్రకారం.. ఉద్యోగ సంఘాలు కోరుతున్న అన్ని డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారీ పెంపునకు కాకుండా మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

దేశవ్యాప్తంగా దాదాపు 1.1 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలపై 8వ వేతన సంఘం ప్రభావం చూపనుంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే సాంప్రదాయం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం 3 నవంబర్ 2025న 8వ వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి జీతాల పెంపు లెక్కలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ వేతన సవరణలో కీలకమైన ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల వివరాలు ఇక్కడ చూద్దాము..
1. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ ఏంటి?
ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83కి పెంచాలని ట్రేడ్ యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. దీనితో పాటు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ - కరువు భత్యం)ని ప్రాథమిక వేతనం (బేసిక్ పే)తో విలీనం చేయాలని కూడా కోరుతున్నాయి.
2. అసలు 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అంటే ఏంటి? దాని లెక్క ఎలా ఉంటుంది?
కేంద్ర వేతన సంఘం పాత బేసిక్ శాలరీని కొత్త శాలరీ స్ట్రక్చర్‌లోకి మార్చడానికి ఉపయోగించే ఒక గణిత గుణకాన్ని (మాథ్స్ మల్టిప్లయర్) ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ అంటారు.
కొత్త బేసిక్ పేను లెక్కించే ఫార్ములా ఇది:
ప్రస్తుత ప్రాథమిక వేతనం x ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ = కొత్త ప్రాథమిక వేతనం
7వ పే కమిషన్ ఉదాహరణ: గత 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేసింది. దీనివల్ల 6వ పే కమిషన్‌లో ఉన్న కనీస ప్రాథమిక వేతనం రూ. 7,000 నుంచి ఒకేసారి రూ. 18,000కి పెరిగింది.
ఆ లెక్క ఇలా ఉంది: రూ. 7,000 x 2.57 = రూ. 18,000
3. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83 కి పెరుగుతుందా?
మీడియా నివేదికల ప్రకారం.. ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83కి పెంచడం ప్రభుత్వానికి అంత సులువు కాదు. ఎందుకంటే దీనివల్ల ఖజానాపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుంది.
కేంద్రం గనుక జీతాలను భారీగా పెంచితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా అదే స్థాయి డిమాండ్లు వస్తాయి. ఇది దీర్ఘకాలంలో ప్రభుత్వాలపై పెన్షన్లు, రిటైర్మెంట్ ప్రయోజనాల భారాన్ని భారీగా పెంచుతుంది.
అందువల్ల, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లు, దేశ ఆర్థిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఒక మధ్యేమార్గం లేదా మోడరేట్ ఫార్ములాను ఖరారు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


