...
...
Next Story

8th Pay Commission : 8వ వేతన సంఘం నివేదిక.. డెడ్​లైన్ మిస్ అయితే? ఉద్యోగుల పరిస్థితేంటి?

8వ వేతన సంఘం తుది నివేదిక 2027 మే నాటికి రావాల్సి ఉన్నా, ఆలస్యమైనా బకాయిలపై ఆందోళన అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. అమలు తేదీ, కేంద్రం ఆమోదంపైనే ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల లెక్క ఆధారపడి ఉంటుంది.

Published on: Nov 29, 2026, 10:00:56 IST
Advertisement

ఏర్పాటైన కాలం నుంచి.. 8వ వేతన సంఘం తన తుది నివేదికను 18 నెలల్లోగా సమర్పించాలని నిబంధనలు చెబుతున్నాయి. జీతాల సవరణ, అలవెన్సులు, పెన్షన్ సంస్కరణలకు సంబంధించిన సిఫార్సులతో ఈ నివేదిక రావాల్సి ఉంది. 2025 నవంబర్ 3న కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో, 2027 మే నాటికి తుది నివేదిక సమర్పించాల్సి ఉంది.

8వ వేతన సంఘం నివేదిక.. డెడ్​లైన్ మిస్ అయితే? (AI image)
8వ వేతన సంఘం నివేదిక.. డెడ్​లైన్ మిస్ అయితే? (AI image)

పని విస్తృతి, కమిటీ చర్చలు, ఇతర అంశాల వల్ల ఈ గడువులోగా నివేదిక ఇవ్వలేకపోతే, సవరించిన జీతాలు, పెన్షన్లు, అలవెన్సులపై స్పష్టత కోసం ఉద్యోగులు, పెన్షనర్లు కొంచెం కాలం వేచి చూడాల్సి రావచ్చు. అయితే నివేదిక సమర్పణ ఆలస్యమైనంత మాత్రాన బకాయిలు రావని చెప్పలేం! కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అమలు తేదీ, చెల్లింపు విధానాలపైనే ఈ విషయం నిలబడి ఉంటుంది.

8వ వేతన సంఘం నివేదిక ఆలస్యమైతే బకాయిలు పోతాయా?

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసే అమలు తేదీని నిశితంగా గమనించాలి. 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం సవరించిన వేతన నిర్మాణం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

నివేదిక లేదా అమలులో జాప్యం జరిగినా, 2026 జనవరి 1నే అమలు తేదీగా కేంద్రం కొనసాగిస్తే.. మధ్య కాలానికి సంబంధించిన బకాయిలు పొందే అర్హత ఉద్యోగులు, పెన్షనర్లకు లభిస్తుంది. వేతన సవరణ డ్యురేషన్ పెరిగేకొద్దీ ఈ ఖర్చులు భరించేందుకు కేంద్రంపై భారం కూడా పెరుగుతుంది.

"7వ పే కమిషన్ సమయంలో మాదిరిగానే ఉద్యోగులకు సవరించిన బేసిక్ పే సాధారణంగా పూర్వపు తేదీ నుంచి చెల్లిస్తారు; హెచ్‌ఆర్‌ఏ వంటి అలవెన్సులు అమలు తేదీ నుంచి వర్తిస్తాయి. ప్రభుత్వం పరంగా చూస్తే, అమలు జరిగే వరకు బకాయిలు పేరుకుపోతాయి; గతంలో విడతలుగా ఇవ్వడం నుంచి ఒకేసారి చెల్లించడం వరకు విభిన్న పద్ధతులు పాటించారు. సమయం సాగితే ఖర్చు కూడా పెరుగుతుంది," అని ఆదిల్ శెట్టి తెలిపారు.

ఆలస్యం వల్ల కేంద్రంపై ఆర్థిక భారం ఎందుకు పెరుగుతుంది?

నివేదిక సమర్పణ సమయం పెరగడం వల్ల కేంద్రంపై ఆర్థిక బాధ్యత ఎక్కువవుతుంది. డ్యూయిష్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 8వ వేతన సంఘం వల్ల ప్రభుత్వ ఖర్చు కనీసం రూ. 3 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

అమలును 2028 వరకు వాయిదా వేయడం వల్ల కేంద్రానికి తాత్కాలికంగా ఆర్థిక ఊరట లభించినా, పూర్వపు తేదీ నుంచి జీతాల సవరణ వర్తింపజేస్తే చివరకు చెల్లించే మొత్తం పెరిగే వీలుందని ఆ విశ్లేషణ చెబుతోంది. 2027 మే గడువు దాటిపోయినంత మాత్రాన వాటంతట అదే పొడిగింపు రాదు! సవరించిన జీతాలు ఎప్పుడు చెల్లిస్తారన్నదీ దానంతట అదే ఖరారు కాదు. నివేదిక సమయం, అమలు తేదీ, చెల్లింపు పద్ధతి, బకాయిల విధానంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.

ఉద్యోగులు, పెన్షనర్లు గమనించాల్సిన అంశాలివే..

కమిషన్ 2027 మే నాటికి నివేదిక ఇస్తుందా లేదా అన్నదాని కంటే, 2026 జనవరి 1నే అమలు తేదీగా కేంద్రం నిలుపుతుందా లేదా అన్నదే ఉద్యోగులు, పెన్షనర్లకు అసలు ప్రశ్న. 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసినందున, ప్రభుత్వ నిర్ణయానికి లోబడి 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలు కావచ్చని అంచనా వేస్తున్నారు.

తుది నివేదిక సమర్పణ, ఆ తర్వాత 8వ వేతన సంఘం ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించడంలో జాప్యం జరిగితే, సవరించిన వేతనం అందేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చు! అదే సమయంలో బకాయిల మొత్తం పెద్దదిగా ఉండే అవకాశం ఉంది.

జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల 8వ వేతన సంఘం తుది నివేదిక ఇచ్చిన తర్వాతే, ఆ నివేదిక ఆధారంగా కేంద్రం తీసుకునే చర్యలపై స్పష్టత వస్తుంది.

Also Read 8th Pay Commission: JPMorgan sees 1.83 fitment factor and 14% salary hikeAlso Read 8th Pay Commission arrears: How a delay could cost the Centre more
 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks