Aadhar card update : ఇకపై ఆధార్ వివరాలు ఇంట్లో నుంచే మార్చుకోవచ్చు!
యూఐడీఏఐ నుంచి భారీ అప్‌డేట్! ఇక నుంచి ఆధార్ వివరాలు ఇంట్లో నుంచే మార్చుకోవచ్చు. ఈ మేరకు కొత్తగా ఆన్‌లైన్ అప్‌డేట్ విధానాన్ని తీసుకొచ్చారు. వీటితో పాటు ఫీజులను సవరణ సవరించారు. ఇవి నేటి నుంచే అమల్లో వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ అప్‌డేట్‌లను మరింత వేగంగా, సులభంగా, పూర్తిగా డిజిటల్‌గా మార్చేందుకు పలు ముఖ్యమైన మార్పులు చేసింది. నవంబర్ 1, 2025 నుంచి ప్రజలు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు! దీని వల్ల ఇకపై ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం, పొడవైన క్యూలలో నిలబడాల్సిన ఇబ్బంది తప్పుతుంది!

ఆధార్ సేవలు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో..
యూఐడీఏఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిర్ణయం ఆధార్ సేవలను మరింత సురక్షితంగా, వినియోగదారునికి అనుకూలంగా, సమర్థవంతంగా మార్చడానికి తీసుకున్నారు.
ఇంతకుముందు, ఆధార్‌లోని సవరణలు లేదా అప్‌డేట్‌ల కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రం వద్దకు వెళ్లాల్సి వచ్చేది.
కొత్త విధానం ద్వారా, పౌరులు తమ ఇంటి నుంచే, కొన్ని క్లిక్‌లలో తమ గుర్తింపు వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు.
వినియోగదారులు సమర్పించిన సమాచారాన్ని పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు వంటి ప్రభుత్వ పత్రాల ద్వారా డిజిటల్‌గా ధృవీకరిస్తారు. దీనివల్ల ప్రక్రియ మరింత వేగవంతం అవడంతో పాటు మరింత నమ్మదగినదిగా మారుతుంది.
ఆధార్-పాన్ లింకింగ్ గడువు పెంపు..
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వం ఆధార్-పాన్ అనుసంధానం అన్ని పాన్ కార్డు హోల్డర్లకు తప్పనిసరి చేసింది. దీనికి గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించింది.
ఒకవేళ గడువులోగా లింక్ చేయకపోతే, జనవరి 1, 2026 నుంచి ఆ పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.
ఆ తర్వాత ఆ పాన్ కార్డు అన్ని రకాల పన్ను, ఆర్థిక లావాదేవీల కోసం చెల్లుబాటు కాకుండా పోతుంది.
కొత్తగా పాన్ కార్డు కోసం రిజిస్టర్ చేసుకునేవారు కూడా దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ ఆధారిత ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
సవరించిన ఫీజుల వివరాలు..
నవంబర్ 1 నుంచి ఆధార్ సేవల కోసం కొత్త ఫీజుల విధానాన్ని అమలులోకి తెచ్చింది యూఐడీఏఐ. ఆ వివరాలు..
చిరునామా, లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్- రూ. 75
బయోమెట్రిక్స్ (వేలిముద్ర, కనుపాప స్కానింగ్ లేదా ఫోటో) అప్‌డేట్- రూ. 125
5- 7 సంవత్సరాలు, 15-17 సంవత్సరాల మధ్య పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్‌లు- ఉచితం
ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేట్‌లు (జూన్ 14, 2026 వరకు)- ఉచితం
ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేట్‌లు (ఆ తర్వాత కేంద్రాలలో)- రూ. 75
ఆధార్ రీప్రింట్- రూ. 40
హోమ్ ఎన్‌రోల్‌మెంట్ సర్వీస్ (మొదటి దరఖాస్తుదారు)- రూ. 700
హోమ్ ఎన్‌రోల్‌మెంట్ సర్వీస్ (ఒకే చిరునామాలో అదనపు వ్యక్తికి)- రూ. 350
డిజిటల్ కేవైసీ సరళీకృతం..
బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కేవైసీ ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా కాగిత రహితంగా సులభంగా మారింది. వినియోగదారులు కింది పద్ధతుల్లో కేవైసీ పూర్తి చేయవచ్చు:
- ఆధార్ ఓటీపీ ఆధారిత ధృవీకరణ
- వీడియో కేవైసీ
- వ్యక్తిగత ధృవీకరణ (ఇది ఐచ్ఛికం)
ఆధార్‌లో ఈ కొత్త డిజిటల్ సేవలు, ఫీజుల మార్పుల గురించి మరింత సమాచారం కోసం యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












