...
...
Next Story

AI ఎఫెక్ట్: MBAలకు స్వస్తి.. AI, డేటా సైన్స్ కోర్సుల వైపు విద్యార్థుల మొగ్గు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తున్న వేళ, విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది. మేనేజ్‌మెంట్ డిగ్రీల కంటే AI, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ కోర్సులకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రోడిజీ ఫైనాన్స్ తాజా నివేదిక తెలిపింది.

Published on: Jul 22, 2026, 13:19:37 IST
Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు విదేశాల్లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోర్సుల ఎంపికపై స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఉన్నత విద్య అనగానే పరుగులెత్తిన సంప్రదాయ MBA డిగ్రీల స్థానంలో.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

అమెరికాలో STEM కోర్సుల హవా

AI ఎఫెక్ట్: MBAలకు స్వస్తి.. AI, డేటా సైన్స్ కోర్సుల వైపు విద్యార్థుల చూపు (Pexels)
AI ఎఫెక్ట్: MBAలకు స్వస్తి.. AI, డేటా సైన్స్ కోర్సుల వైపు విద్యార్థుల చూపు (Pexels)

ఐఐఈ ఓపెన్ డోర్స్ (IIE Open Doors) తాజా గణాంకాల ప్రకారం, 2024/25 విద్యాసంవత్సరంలో అమెరికా వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 57 శాతం మంది 'స్టెమ్' (STEM) కోర్సులనే ఎంచుకున్నారు. ఇందులో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వాటా 26 శాతం కాగా, ఇంజనీరింగ్ 18 శాతంగా నమోదు కావడం విశేషం.

అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతీయ విద్యార్థుల్లో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలే అన్ని కోర్సులను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాయి.

టెక్నాలజీతో కూడిన బిజినెస్ వ్యూహాలు

2026 విద్యా సంవత్సరంలో కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు సాధారణ మేనేజ్‌మెంట్ కోర్సుల కంటే AI, డేటా సైన్స్ రంగాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

"ఐదేళ్ల క్రితం వరకు విదేశీ విద్యను కోరుకునే ప్రతీ విద్యార్థికీ ఎంబీఏ మొదటి ప్రాధాన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మాస్టర్స్ ఇన్ AI, డేటా సైన్స్ లేదా అనలిటిక్స్ కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొందరు విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను (Technical Skills) ముందుగా నేర్చుకుని, ఆ పైన బిజినెస్ స్ట్రాటజీలను జోడించుకుంటున్నారు" అని ప్రోడిజీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ విశ్లేషించారు.

భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కోర్సులు

కరోనా తెచ్చిన డిజిటల్ మార్పులు, ఏఐ వల్ల మారుతున్న ఉద్యోగ సమీకరణాలను కళ్లారా చూసిన 2026 బ్యాచ్ విద్యార్థులు రాబోయే రోజుల్లో వెనుకబడిపోకూడదనే పట్టుదలతో ఉన్నారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యాపార నైపుణ్యాలు రెండూ కలగలిసిన డిగ్రీలకే ఓటు వేస్తున్నారు.

రూపాయి క్షీణత.. పెరుగుతున్న ఆర్థిక భారం

టెక్నికల్ మాస్టర్స్ డిగ్రీల ఫీజులు సాధారణ ఎంబీఏ కోర్సులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం విద్యార్థులకు ఆర్థికంగా సవాలుగా మారింది. దీనికి తోడు భారతీయ రూపాయి మారకపు విలువ గణనీయంగా పడిపోవడం విద్యార్థుల బడ్జెట్‌ను ప్రభావితం చేస్తోంది. జూలై 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక లెక్కల ప్రకారం డాలర్ మారకపు విలువ రూ. 95 దాటడం గమనార్హం.

ఈ ఆర్థిక వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి విద్యార్థులు కుటుంబ పొదుపులు, స్కాలర్‌షిప్‌లతో పాటు అంతర్జాతీయ రుణ సంస్థలపై ఆధారపడుతున్నారు. పూచీకత్తు (Collateral) లేదా గ్యారెంటర్ లేకపోయినా, విద్యార్థుల భవిష్యత్ సంపాదన సామర్థ్యాన్ని (Future Earning Potential) బట్టి ప్రోడిజీ ఫైనాన్స్ వంటి సంస్థలు రుణాలు అందిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks