Air India : ఎయిర్ ఇండియా తప్పిదం- 8 గంటల ప్రయాణం తర్వాత వెనక్కి!
సాంకేతిక అనుమతుల విషయంలో ఎయిర్ ఇండియా చేసిన పొరపాటు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కెనడా వెళ్లాల్సిన విమానానికి ఆ దేశ నిబంధనల ప్రకారం క్లియరెన్స్ లేకపోవడంతో, గాలిలో 8 గంటల పాటు ప్రయాణించిన తర్వాత తిరిగి దిల్లీలోనే ల్యాండ్ అయింది.
కెనడాలోని వాంకోవర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు అది ఎక్కడికీ వెళ్లని ప్రయాణంగా మిగిలిపోయింది! కెనడాలోకి ప్రవేశించడానికి అవసరమైన రెగ్యులేటరీ క్లియరెన్స్ లేని విమానాన్ని ఎయిర్ ఇండియా పొరపాటున పంపడంతో.. దాదాపు ఎనిమిది గంటల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత ఆ విమానం తిరిగి దిల్లీకి వచ్చేసింది.

చైనా సరిహద్దుల వరకు వెళ్లి..
ఏఐ185 విమానం గురువారం ఉదయం 11:34 గంటలకు ప్రయాణికులతో దిల్లీ నుంచి బయలుదేరింది. తొలుత తూర్పు దిశగా ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే, సుమారు నాలుగు గంటల ప్రయాణం తర్వాత, విమానం కున్మింగ్ సమీపంలోని చైనా గగనతలంలోకి ప్రవేశించింది. సరిగ్గా ఆ సమయంలోనే సదరు విమానానికి కెనడాలో కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదనే విషయాన్ని ఎయిర్ ఇండియా గుర్తించింది.
వెనువెంటనే విమానాన్ని వెనక్కి పిలిపించడంతో, ప్రయాణం మొదలైన చోటికే తిరిగి రావడానికి మరో నాలుగు గంటల సమయం పట్టింది. మొత్తంగా ఈ విమానం 7 గంటల 54 నిమిషాల పాటు గాలిలోనే ప్రయాణించి చివరకు దిల్లీలో ల్యాండ్ అయింది.
అసలు చిక్కు ఎక్కడ వచ్చింది?
ఈ ప్రయాణానికి వాడిన విమానం.. ‘బోయింగ్ 777-200LR’ రకానికి చెందినది. కానీ, ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు కెనడా సర్వీసుల కోసం కేవలం ‘బోయింగ్ 777-300ER’ శ్రేణి విమానాలకు మాత్రమే అనుమతి ఉంది. విమానయాన రంగంలో దేశాలు ఇచ్చే అనుమతులు రకరకాలుగా ఉంటాయి. కొన్ని అనుమతులు విమానయాన సంస్థకు ఇస్తే, మరికొన్ని నిర్దిష్ట విమాన రకాలకు లేదా విమానం వెనుక ఉండే టెయిల్ నంబర్ల ఆధారంగా ఇస్తుంటారు.
విషయం అర్థమైన వెంటనే విమానాన్ని మధ్యలోనే వెనక్కి మళ్లించారు. బయలుదేరిన సుమారు ఎనిమిది గంటల తర్వాత విమానం దిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానం దిగారు.
కానీ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎయిర్ ఇండియా వివరణ..
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘ఆపరేషనల్ ఇష్యూ’ కారణంగానే విమానం వెనక్కి రావాల్సి వచ్చిందని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. "విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది, ప్రయాణికులు, సిబ్బంది అందరూ దిగిపోయారు. మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాము," అని సంస్థ పేర్కొంది.
దిల్లీలోని గ్రౌండ్ టీమ్స్ ప్రయాణికులకు హోటల్ వసతితో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాయని, వారు వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది. శుక్రవారం రోజు ఉదయం ప్రయాణికులందరితో విమానం తిరిగి వాంకోవర్ బయలుదేరింది.
భారీగా ఇంధన వృథా..
ఈ పొరపాటు వల్ల ఎయిర్ ఇండియాకు భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఒక బోయింగ్ 777 విమానం గంటకు సుమారు 8 నుంచి 9 టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఎనిమిది గంటల ప్రయాణానికి వాడిన ఇంధనం, ఇతర నిర్వహణ ఖర్చులు సంస్థపై అదనపు భారంగా మారనున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


