హోండా ‘డియో 125 ఎక్స్​ ఎడిషన్’.. స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న కొత్త స్కూటర్!

హోండా సంస్థ తన డియో 125 శ్రేణిలో కొత్తగా 'ఎక్స్​ ఎడిషన్'ను ప్రవేశపెట్టింది. స్టైలిష్ గ్రాఫిక్స్, డ్యూయల్ టోన్ కలర్స్‌తో వచ్చిన ఈ స్కూటర్ ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 30, 2026, 06:45:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత మార్కెట్ కోసం హోండా సంస్థ డియో 125 స్కూటర్​లో సరికొత్త 'ఎక్స్​ ఎడిషన్'ను ఆవిష్కరించింది. తన 125 సీసీ స్కూటర్ లైనప్‌కు మరింత మెరుగులు దిద్దుతూ, సరికొత్త హంగులతో దీనిని తీసుకొచ్చింది. అయితే, ఈ అప్‌డేట్ కేవలం బాహ్య రూపానికి సంబంధించినది మాత్రమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డియో 125 మోడల్‌కు స్టైల్‌ను జోడించి ఈ వేరియంట్‌ను రూపొందించారు. ఇందులో మెకానికల్ లేదా హార్డ్‌వేర్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ హోండా డియో 125 ఎక్స్​ ఎడిషన్​ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హోండా ‘డియో 125 ఎక్స్​ ఎడిషన్’..
హోండా ‘డియో 125 ఎక్స్​ ఎడిషన్’..

హోండా డియో 125 ఎక్స్​ ఎడిషన్​- వివరాలు..

హోండా డియో 125 ఎక్స్​ ఎడిషన్ స్కూటర్‌లో డ్యూయల్-టోన్ బాడీ ప్యానెల్స్, సరికొత్త గ్రాఫిక్స్, ప్రత్యేకమైన 'ఎక్స్​ ఎడిషన్' డీకాల్స్ (స్టిక్కర్లు) ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి సాధారణ వేరియంట్ల కంటే దీనికి విభిన్నమైన రూపాన్ని ఇస్తాయి. ఈ ఎక్స్‌టీరియర్ మార్పులు మినహాయిస్తే, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇంజిన్ పరంగా ఇది ప్రస్తుతం ఉన్న 'హెచ్-స్మార్ట్' వేరియంట్ మాదిరిగానే ఉంటుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో టీఎఫ్టీ స్క్రీన్ డిస్‌ప్లే, సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఫంక్షన్, ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ వంటివి కొనసాగుతున్నాయి. హోండా డియో 125 హై-ఎండ్ వేరియంట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లనే ఎటువంటి మార్పు లేకుండా ఎక్స్​ ఎడిషన్‌లోనూ అందించారు.

డియో 125 ఎక్స్​ ఎడిషన్‌లో పాత 123.92 సీసీ, సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఎస్ఐ ఇంజిన్‌నే ఉపయోగించారు. ఇది 6,500 ఆర్పీఎం వద్ద 8.1 హెచ్​పీ పవర్​ని, 5,000 ఆర్​పీఎం వద్ద 10.5 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ ట్యూనింగ్, ట్రాన్స్‌మిషన్ లేదా మైలేజీ గణాంకాల్లో ఎటువంటి మార్పులు లేవు.

బ్రేకింగ్ వ్యవస్థ కూడా మారలేదు. ముందు భాగంలో 190 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అలాగే ముందు 90/90-12 సైజు ట్యూబ్‌లెస్ టైర్, వెనుక 90/100-10 సైజు ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. సస్పెన్షన్ బాధ్యతలను ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు మూడు రకాలుగా అడ్జస్ట్ చేసుకోగలిగే స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ యూనిట్ నిర్వహిస్తాయి.

హోండా డియో 125 ఎక్స్​ ఎడిషన్​- డైమెన్షన్స్​..

డైమెన్షన్స్​ పరంగా చూస్తే, ఈ స్కూటర్ 1,830 ఎంఎం పొడవు, 707 ఎంఎం వెడల్పు, 1,172 ఎంఎం ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 1,260 ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 171 ఎంఎం కాగా, సీటు పొడవు 708 ఎంఎంగా ఉంది. ఈ ఎక్స్​ ఎడిషన్ మొత్తం బరువు 105 కిలోలు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లుగానే ఉంది.

దీని ధర ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న డియో 125 ప్రీమియం వేరియంట్లకు దరిదాపుల్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్​ ధరపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More