2026లో ‘లాంగ్ వీకెండ్’ జాతర- దాదాపు ప్రతి నెలలో వరుస సెలవులు!
2026 క్యాలెండర్ చూశారా? ఈసారి చాలా ‘లాంగ్ వీకెండ్స్’ వచ్చాయి! ఇది పర్యాటకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఉరుకుల పరుగుల జీవితం నుంచి బ్రేక్ తీసుకుని ట్రిప్స్‌ని ప్లాన్ చేసుకునేందుకు 2026 లాంగ్ వీకెండ్ డేట్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
2025 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. 2026 అడుగు దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది 2026 క్యాలెండర్ తీసుకుని, హాలీడేల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, 2026లో అనేక సెలవులు వరుసగా వస్తున్నాయి! ముఖ్యంగా జనవరిలో 2, అక్టోబర్ నెలలో మూడు లాంగ్ వీకెండ్లు రావడం విశేషం. ఇలా లాంగ్ వీకెండ్లు ఉంటే, ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్లాలని లేదా ఉరుకుల పరుగుల జీవితం నుంచి బ్రేక్ తీసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో 2026 లాంగ్ వీకెండ్ క్యాలెండర్ వివరాలను ఇక్కడ చెక్ చేసుకుని, మీ బ్రేక్‌ని ప్లాన్ చేసుకోండి..

2026 లాంగ్ వీకెండ్ క్యాలెండర్ వివరాలు..
జనవరిలో రెండు సార్లు-
2026 జనవరి 1 (గురువారం)తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మీరు గనుక శుక్రవారం (జనవరి 2) ఒక్కరోజు సెలవు పెడితే, శని, ఆదివారాలతో కలిపి వరుసగా నాలుగు రోజులు హాలీడేని చేయవచ్చు!
మరోవైపు జనవరి నెలాఖరులో కూడా లాంగ్ వీకెండ్ వస్తోంది. జనవరి 24 శని, 25 ఆదివారం. ఆ వెంటనే, సోమవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవం. జనవరి 23 (శుక్రవారం)న వసంత పంచమి ఉంది. ఒకవేళ మీరు ఆరోజు సెలవు పెట్టగలిగితే వరుసగా 4 రోజులు హాలీడే దొరికనట్టు అవుతుంది!
కానీ ఫిబ్రవరిలో మాత్రం లాంగ్ వీకెండ్లు లేవు!
మార్చి నుంచి జూన్ వరకు..
మార్చి: మార్చి 27 (జమాత్-ఉల్-విదా - శుక్రవారం)తో మొదలై శని, ఆదివారాలతో లాంగ్ వీకెండ్ వస్తుంది.
ఏప్రిల్: ఏప్రిల్ 3 (గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 4 (శనివారం), ఏప్రిల్ 5 (ఈస్టర్ - ఆదివారం) వరుస సెలవులు.
మే: మే 1 (బుద్ధ పూర్ణిమ - శుక్రవారం), మే 2 శనివారం, మే 3 (ఆదివారం). అంటే మూడు రోజుల లాంగ్ వీకెండ్‌ని ఎంజాయ్ చేయొచ్చు.
జూన్: జూన్ 26 (మొహర్రం - శుక్రవారం) తో మొదలై శని, ఆదివారాలు సెలవులు లభిస్తాయి.
జులైలో మాత్రం లాంగ్ వీకెండ్లు లేవు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో..
సుమారు రెండు నెలల విరామం తర్వాత, ఆగస్టు 28 (రక్షాబంధన్ - శుక్రవారం) నుంచి ఆదివారం వరకు సెలవులు ఉన్నాయి.
సెప్టెంబర్ నెల మరింత ప్రత్యేకం! సెప్టెంబర్ 4 (జన్మాష్టమి - శుక్రవారం) తో ఒక లాంగ్ వీకెండ్ వస్తే.. సరిగ్గా వారం తర్వాత సెప్టెంబర్ 14 (వినాయక చవితి - సోమవారం) రానుంది. అంటే శని, ఆదివారాలకు తోడు అప్పుడు సోమవారం కూడా సెలవు దొరుకుతుంది.
అక్టోబర్‌లో లాంగ్ వీకెండ్స్-
అక్టోబర్‌లో మీరు ఏకంగా మూడు లాంగ్ వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు!
అక్టోబర్ 2 (గాంధీ జయంతి - శుక్రవారం)తో ఒక వీకెండ్ మొదలవుతుంది.
అక్టోబర్ 17 (శనివారం) నుంచి అక్టోబర్ 20 (దసరా - మంగళవారం) వరకు వరుసగా నాలుగు రోజులు పండగ సెలవులు లభిస్తాయి!
అక్టోబర్ 24, 25 (శని, ఆది)కి తోడు అక్టోబర్ 26 (వాల్మీకి జయంతి - సోమవారం) సెలవు కలిసొస్తుంది.
నవంబర్, డిసెంబర్ ముగింపు-
నవంబర్ 7 (శనివారం) నుంచి మొదలై నవంబర్ 8 (దీపావళి - ఆదివారం), నవంబర్ 9 (గోవర్ధన పూజ - సోమవారం) వరకు సెలవు ఉంటుంది.
ఇక ఏడాది ముగింపులో క్రిస్మస్ (డిసెంబర్ 25 - శుక్రవారం) నుంచి ఆదివారం వరకు లాంగ్ వీకెండ్‌తో 2026కు వీడ్కోలు పలకవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మీ క్యాలెండర్‌లో ఈ తేదీలను మార్క్ చేసుకుని టూర్ ప్లాన్‌కి రెడీ అవ్వండి!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












