...
...
Next Story

Money habits : మంచి జీతం- కానీ నెల చివరికి జేబు ఖాళీ! ఈ 5 అలవాట్లే కారణం..

కొందరికి జీతం బాగానే ఉంటుంది. కానీ నెల చివరికి వచ్చేసరికి బ్యాంకులో ఒక్క రూపాయి కూడా కనిపించదు! ఈ నేపథ్యంలోనే మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీసే 5 డేంజరస్ అలవాట్లను, వాటి నుంచి బయటపడి సంపదను సృష్టించే మార్గాలను వివరించారు ప్రముఖ ఆర్థిక నిపుణుడు అంకుర్ వారికూ.

Published on: Oct 31, 2026, 16:05:57 IST
Advertisement

మంచి జీతమే వస్తోంది.. కానీ నెల చివరికి వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలడం లేదా? బ్యాంక్ ఖాతాలో జీతం పడగానే క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలకే ఊడ్చిపెట్టుకుపోతోందా? అయితే మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు, ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎలా దాస్తున్నారు అనేదే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

అంకుర్ వారికూ ఫైనాన్షియల్ టిప్స్..
అంకుర్ వారికూ ఫైనాన్షియల్ టిప్స్..

ఎక్కువ సంపాదించడం వల్ల మాత్రమే ఎవరూ ధనవంతులు అయిపోరు. మనకు తెలిసీ తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే మనల్ని నిరంతరం ఆర్థిక సంక్షోభంలో ఉంచుతాయి. ఇదే అంశంపై ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత, ఫైనాన్షియల్ కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ తన తాజా వీడియో ద్వారా స్పందించారు. సామాన్యులను పేదరికంలోనే ఉంచే 5 ప్రధాన అలవాట్లను, వాటి నుంచి బయటపడి సంపదను ఎలా సృష్టించాలో సవివరంగా వివరించారు.

మిమ్మల్ని పేదరికంలోనే ఉంచే 5 డేంజరస్ అలవాట్లు ఇవే..

మన ఆర్థిక ఎదుగుదలను దెబ్బతీసే 5 ప్రధానమైన పొరపాట్లను అంకుర్ వారికూ వర్గీకరించారు:

  • బడ్జెట్ లేకపోవడం: ఎక్కడ ఎంత ఖర్చవుతుందో లెక్క లేకుండా ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడం.
  • భారీ వడ్డీ అప్పులు: క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు వాడుతూ కేవలం 'మినిమమ్ డ్యూ' మాత్రమే చెల్లించడం.
  • ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం: ఆకస్మిక ఖర్చుల కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోవడం.
  • లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్: ఆదాయం పెరిగిన కొద్దీ ఆడంబరాలకు ఖర్చులు పెంచేయడం, పొదుపును పెంచకపోవడం.
  • ఇన్వెస్ట్‌మెంట్ ఆలస్యం చేయడం: "ఇంకా వయస్సు ఉంది కదా" అని పెట్టుబడులను వాయిదా వేయడం.

ఈ 5 తప్పులను సరిదిద్దుకుని ధనవంతులుగా మారడం ఎలా?

చాలామంది జీతం రాగానే బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం వల్ల నెల చివర్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉదాహరణకు, మీ నెలకు జీతం రూ. 50,000 అనుకుందాం. రోజువారీ అనవసర ఖర్చులు లేదా చిన్న చిన్న కొనుగోళ్లకు ప్రతిరోజూ రూ. 200 ఖర్చు చేస్తే, నెలకు రూ. 6,000 దాకా వృధా అవుతుంది. ప్రతినెలా బడ్జెట్ రాసుకుని మీ ఖర్చులను గమనిస్తే, ఇలాంటి అనవసర వ్యయాలను అరికట్టి ఆ మొత్తాన్ని పొదుపు వైపు మళ్లించవచ్చు.

2. అధిక వడ్డీ అప్పులను ముందుగా తీర్చేయండి

క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లపై ఆధారపడటం ఆర్థికంగా మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. క్రెడిట్ కార్డ్ బకాయి రూ. 50,000 ఉంటే, కేవలం మినిమమ్ డ్యూ మాత్రమే కడితే సరిపోదు. ఏటా 36 శాతం వరకు ఉండే వడ్డీ రేట్ల వల్ల నెలకు రూ. 1,500 కేవలం వడ్డీకే పోతుంది. కాబట్టి ముందుగా అధిక వడ్డీ ఉన్న అప్పులన్నింటినీ పూర్తిగా తీర్చివేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

3. ఎమర్జెన్సీ ఫండ్ ఉండాల్సిందే

హఠాత్తుగా ఉద్యోగం పోయినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా లేదా వాహనం పాడైనా చేతిలో డబ్బు లేకపోతే మళ్లీ క్రెడిట్ కార్డులు లేదా అధిక వడ్డీ అప్పులను ఆశ్రయించాల్సి వస్తుంది. కాబట్టి కనీసం 3 నుంచి 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా బ్యాంక్ డిపాజిట్లు లేదా లిక్విడ్ ఫండ్లలో దాచి ఉంచాలి.

4. ఆదాయం పెరిగితే 'లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్' నియంత్రించండి!

జీతం పెరిగిన ప్రతిసారీ దానికి తగినట్లుగా ఖరీదైన ఫోన్లు, కార్లు, బ్రాండెడ్ బట్టలు కొంటూ ఖర్చులను కూడా పెంచేస్తే పొదుపు స్థిరంగానే ఉండిపోతుంది. దీనినే 'లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్' అంటారు. ఉదాహరణకు మీ జీతం రూ. 50,000 నుంచి రూ. 70,000 కి పెరిగినప్పుడు, మీ ఖర్చులు కూడా రూ. 45,000 నుంచి రూ. 65,000 కి పెరిగితే మీ నెలవారీ పొదుపు రూ. 5,000 వద్దే ఆగిపోతుంది. పెరిగిన రూ. 20,000లలో సింహభాగాన్ని పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్‌కు కేటాయించాలి.

5. కాంపౌండింగ్ మ్యాజిక్: త్వరగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించండి

పెట్టుబడులను ఎంత త్వరగా ప్రారంభిస్తే కాంపౌండింగ్ (చక్రవడ్డీ) వల్ల అంత ఎక్కువ లాభం దక్కుతుంది.

ఉదాహరణకు:

మీరు ప్రతి నెలా రూ. 5,000 చొప్పున మ్యూచువల్​ ఫండ్ సిప్ ద్వారా 12% సగటు రిటర్న్‌తో 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, మీ మొత్తం పెట్టుబడి రూ. 12 లక్షలు కాగా.. అది ఏకంగా రూ. 45.99 లక్షలుగా మారుతుంది.

అదే పెట్టుబడిని 10 ఏళ్లు ఆలస్యంగా ప్రారంభించి, కేవలం 10 ఏళ్లు మాత్రమే రూ. 5,000 చొప్పున (మొత్తం రూ. 6 లక్షలు) ఇన్వెస్ట్ చేస్తే, మీకు దక్కేది కేవలం రూ. 11.20 లక్షలు మాత్రమే.

అంటే కేవలం 10 ఏళ్ల ఆలస్యం వల్ల మీరు దాదాపు రూ. 34 లక్షల భారీ లాభాన్ని కోల్పోతారు. కాబట్టి చిన్న మొత్తంతోనైనా సరే ఈరోజే మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని ప్రారంభించడం శ్రేయస్కరం.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks