Arjun Tendulkar : ఏం డెడికేషన్​ బ్రో! పెళ్లైన మరుసటి రోజే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్..

Arjun Tendulkar wedding : క్రికెట్​ గాడ్​ సచిన్​ టెండుల్కర్​ కుమారుడు అర్జున్​ టెండుల్కర్​.. తన డెడికేషన్​తో వార్తల్లో నిలిచాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే అతను క్రికెట్​ మైదానంలో కనిపించాడు.

Published on: Mar 7, 2026, 08:15:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, ఆల్ రౌండర్ అర్జున్ టెండూల్కర్ తన వృత్తి పట్ల అంకితభావాన్ని మరోసారి చాటుకున్నాడు. తన వివాహ వేడుకలు ముగిసిన కేవలం ఒక్క రోజులోనే అతను తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు.

అర్జున్​ టెండుల్కర్​- సాన్యా..
అర్జున్​ టెండుల్కర్​- సాన్యా..

ఐపీఎల్ 2026 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఎంపికైన ఈ ఆల్ రౌండర్, శుక్రవారం జరిగిన డీవై పాటిల్ టీ20 కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ముంబై కస్టమ్స్‌తో జరిగిన ఈ పోరులో అర్జున్ 'డివై పాటిల్ బ్లూ' జట్టు తరఫున బరిలోకి దిగాడు. కానీ పెళ్లి తర్వాత ఆడిన మొదటి మ్యాచ్‌లో ఆయన ప్రదర్శన ఆశించిన స్థాయిలో సాగలేదు.

ఈ మ్యాచ్‌లో అర్జున్​ టెండుల్కర్​ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చూసింది. అర్జున్ వ్యక్తిగత ప్రదర్శన కూడా నిరాశపరిచింది. బ్యాటింగ్‌లో 14 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేయగా, బౌలింగ్‌లో తాను వేసిన ఏకైక ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇంకో విశేషం ఏంటంటే, వివాహానికి సరిగ్గా ఒకరోజు ముందు కెనరా బ్యాంక్‌తో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో కూడా అర్జున్ పాల్గొన్నాడు. రిజల్ట్​ ఏదైనా తాను మాత్రం అంకితభావంతో ముందుకు సాగుతానని అర్జున్​ చాటిచెబుతున్నాడు.

సచిన్ టెండూల్కర్ భావోద్వేగ కృతజ్ఞతలు..

మరోవైపు, తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ - సాన్యా చందోక్ వివాహం సందర్భంగా అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కురిపించిన ప్రేమాభిమానాలకు సచిన్ టెండూల్కర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివాహ వేడుకలకు హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్పారు.

“అర్జున్- సాన్యాలు తమ జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, అందరి నుంచి అందుతున్న ప్రేమాభిమానాలకు మేము ఎంతో కృతజ్ఞులం. మీ ప్రెజెన్స్​, సందేశాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు మా కుటుంబానికి, ముఖ్యంగా నూతన దంపతులకు ఈ వివాహాన్ని ఒక మర్చిపోలేని వేడుకగా మార్చాయి. అందరికీ చాలా ధన్యవాదాలు,” అని సచిన్ తన ‘ఎక్స్​’ (ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు.

ఘనంగా వివాహ వేడుక..

అర్జున్, సాన్యాల వివాహం గురువారం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. అంతకుముందు, మెహందీ- సంగీత్ వంటి సాంప్రదాయ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు, వీటికి క్రికెట్ ప్రపంచంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

ఈ జంట 2025 ఆగస్టులో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎవరీ సాన్యా చందోక్?

సాన్యా చందోక్ ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు. ఆమె పారిశ్రామికవేత్త, గ్రావిస్ గ్రూప్ ఛైర్మన్ రవి ఘై మనవరాలు. సాన్యాకు టెండూల్కర్ కుటుంబంతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అర్జున్ సోదరి సారా టెండూల్కర్‌తో సాన్యాకు మంచి స్నేహం ఉందని సమాచారం.

కెరీర్ విషయానికి వస్తే..

అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ తన కెరీర్‌ను నిర్మించుకుంటున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో భాగంగా ఉన్న ఈ ఎడమచేతి వాటం ఆల్ రౌండర్, ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ట్రేడ్ అయ్యాడు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More