...
...
Next Story

Monsoon : రుతుపవనాలపై ఎల్​ నినో దెబ్బ- 2 దశాబ్దాల్లోనే అతి తక్కువ వర్షపాతం!

El Nino : దేశంలో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి బలహీనమైన రుతుపవనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్​ నినో కారణంగా సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షపాతం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Published on: Aug 25, 2026, 06:45:01 IST
Advertisement

భారతీయ వ్యవసాయానికి జీవనాధారంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈసారి తీవ్ర నిరాశను మిగిల్చేలా ఉన్నాయి! గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత బలహీనంగా ఈసారి రుతుపవనాలు ముగియనున్నట్లు వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేశాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే వర్షపాతం దాదాపు 15 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, 2009 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి అని ఇద్దరు సీనియర్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

రుతుపవనాలు మరింత బలహీనపడే అవకాశం!
రుతుపవనాలు మరింత బలహీనపడే అవకాశం!

ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశంలో వ్యవసాయానికి వర్షాలే ప్రధాన ఆధారం. దేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 70శాతం ఈ రుతుపవనాల ద్వారానే వస్తుంది. వర్షాలు ఇలా తగ్గిపోతే పంట దిగుబడులు దెబ్బతినడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం తగ్గి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టే అవకాశం ఉంది.

మరింత ఆందోళనకరంగా సెప్టెంబర్‌s!

పంటలు చేతికి వచ్చే కీలకమైన సెప్టెంబర్ నెలలో తగినన్ని వర్షాలు కురవకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి ఖరీఫ్ పంటల దిగుబడులు భారీగా పడిపోతాయి. అలాగే గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలకు ఎంతో అవసరమైన నేలలోని తేమ కూడా తగ్గిపోతుంది.

"మనం రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. సెప్టెంబర్‌లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వర్షపాతంలో రెండంకెల లోటును చూసే ప్రమాదం ఉంది," అని భారత వాతావరణ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.

తూర్పు రాష్ట్రాలు మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలే కురుస్తాయని, దీనివల్ల సీజనల్ లోటు మరింత పెరుగుతుందని సదరు అధికారి వివరించారు. ఈ నెల చివరి నాటికి ఐఎండీ సెప్టెంబర్ నెల అధికారిక అంచనాను విడుదల చేసే అవకాశం ఉంది.

తొందరగా వెనక్కి తగ్గుతున్న రుతుపవనాలు!

వాయువ్య ప్రాంతాల నుంచి ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే కొన్ని రోజులు ముందే వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఎలాంటి వాతావరణ వ్యవస్థ ఏర్పడకపోతే సెప్టెంబర్‌లోనే ఈ ఉపసంహరణ మొదలుకావచ్చని మరొక వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

సాధారణంగా జూన్‌లో ప్రవేశించే రుతుపవనాలు సెప్టెంబర్ 17 నుంచి వాయువ్య ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం ప్రారంభించి, అక్టోబర్ మధ్యనాటికి దేశం పూర్తిగా వీడిపోతాయి.

ఎల్ నినో తీవ్రత పెరుగుతుండటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్‌లో ఎల్ నినో ప్రభావం మరింత బలపడి, భారతదేశంలో వర్షాలను అణచివేసే అవకాశం ఉందని వారు తెలిపారు.

పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్ నినో అంటారు. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థను పూర్తిగా తలకిందులు చేసి, ఆగ్నేయాసియా దేశాల్లో వర్షాలు తగ్గేలా చేస్తుంది. గతంలో చాలా ఎల్ నినో సంవత్సరాల్లో భారతదేశం తక్కువ వర్షపాతాన్ని ఎదుర్కొంది. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన కరవులకు సైతం దారితీసి, పంటలను నాశనం చేయడంతో పాటు కొన్ని రకాల ధాన్యాల ఎగుమతులపై ఆంక్షలు విధించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా చేసింది.

జూన్ 1న రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో సాధారణం కంటే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణం కంటే 35.4 శాతం తక్కువ వర్షాలు పడగా, జులైలో 1 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే ఆగస్టులో రుతుపవనాలు మళ్లీ బలహీనపడటంతో, ఇప్పటివరకు వర్షపాతం 15 శాతం లోటుతో కొనసాగుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe