Barrier Less Tolls : టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు! కానీ ఒక్క తప్పు చేస్తే రెట్టింపు టోల్ బాదుడు..
Toll charges latest news : ఇక దేశంలో బారియర్ లేని టోల్ వ్యవస్థను చూడబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్హెచ్ఏఐ కొత్త రూల్స్ తీసుకొస్తోంది! ఫాస్టాగ్‌లో డబ్బులు లేకుండా ఈ టోల్స్ దాటి, 72 గంటల్లోపు ఫీజు చెల్లించకపోతే రెట్టింపు జరిమానా పడుతుంది. పూర్తి వివరాలు..
భారత జాతీయ రహదారులపై ప్రయాణం మరింత వేగవంతం కానుంది. హైవేల మీద ఎక్కడా ఆగకుండా వెళ్లేలా 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' (ఎంఎల్ఎఫ్ఎఫ్) అనే సరికొత్త టోల్ విధానాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) విస్తరిస్తోంది. అయితే, ఈ బారియర్-లెస్ (అడ్డంకులు లేని) టోలింగ్‌లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సి వస్తుందని ఎన్హెచ్ఏఐ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

ఎంఎల్ఎఫ్ఎఫ్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద బారియర్లు ఉంటాయి, మనం టోల్ కట్టిన తర్వాతే అవి తెరుచుకుంటాయి. కానీ ఎంఎల్ఎఫ్ఎప్ విధానంలో ఎక్కడా టోల్ గేట్లు, బూత్‌లు ఉండవు. హైవేపై ఎత్తైన గ్యాంట్రీలకు కెమెరాలు, సెన్సార్లను అమర్చుతారు.
మీరు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడే ఈ సెన్సార్లు మీ వాహనాన్ని గుర్తించి, ఫాస్టాగ్ ద్వారా టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా కట్ చేస్తాయి.
దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఉండదు, సమయం ఆదా అవుతుంది, ఇంధనం ఆదా అవుతుంది.
రెట్టింపు టోల్ ఎందుకు పడుతుంది?
భౌతిక అడ్డంకులు లేనందున, టోల్ చెల్లింపు పూర్తిగా మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ ఫాస్టాగ్ స్కాన్ కాకపోయినా లేదా బ్యాలెన్స్ లేకపోయినా సిస్టమ్ మీ వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి 'ఈ-నోటీస్' జారీ చేస్తుంది.
72 గంటల గడువు చాలా కీలకం:
ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం, మీకు ఈ-నోటీస్ వచ్చిన 72 గంటల్లోపు టోల్ చెల్లించాలి.
72 గంటల లోపు చెల్లిస్తే: సాధారణ టోల్ మొత్తం (1x) మాత్రమే పడుతుంది.
72 గంటలు దాటితే: మీరు రెట్టింపు టోల్ (2x) జరిమానాతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
"ఇది రోడ్డును వాడినందుకు వేసిన జరిమానా కాదు, సకాలంలో టోల్ కట్టనందుకు విధించిన అదనపు చార్జీ," అని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది.
పెండింగ్ టోల్ ఎలా చెక్ చేయాలి?
మీ వాహనంపై ఏదైనా ఈ-నోటీస్ జారీ అయిందో లేదో తెలుసుకోవడానికి మీరు పాత పద్ధతుల్లో కాకుండా అధికారిక పోర్టల్‌ను ఉపయోగించాలి.
- https://nhfeenotice.parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
- మీ వాహనం నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని వెరిఫై చేయండి.
- పెండింగ్ నోటీసులు ఉంటే అక్కడే ఆన్‌లైన్‌లో పేమెంట్ పూర్తి చేయండి.
తప్పుగా నోటీసు వస్తే ఏం చేయాలి?
ఒకవేళ మీరు టోల్ కట్టినా లేదా పొరపాటున నోటీసు వచ్చిందని భావిస్తే, అదే పోర్టల్‌లో 72 గంటల్లోపు ఫిర్యాదు చేయవచ్చు. గడువు దాటిన తర్వాత చేసే అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోరు.
జరిమానా నుంచి తప్పించుకోవడానికి చిట్కాలు:
ఫాస్టాగ్ బ్యాలెన్స్: ఎల్లప్పుడూ మీ ఫాస్టాగ్ వాలెట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి.
హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్: మీ వాహనానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి.
అలర్ట్‌లు గమనించండి: మీ మొబైల్‌కు వచ్చే ఎస్ఎంఎస్లను ఎప్పటికప్పుడు చెక్ చేయండి.
మౌలిక సదుపాయాల ఆధునీకరణలో భాగంగా తీసుకొచ్చిన ఈ ఎంఎల్ఎఫ్ఎఫ్ వ్యవస్థ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అయితే, సాంకేతికతతో పాటు డ్రైవర్ల అవగాహన కూడా తోడైనప్పుడే జేబుకు చిల్లు పడకుండా వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


