...
...
Next Story

IND vs SL : శ్రీలంకతో టెస్టు సిరీస్- టీమిండియా స్క్వాడ్ ఇదే.. 33ఏళ్ల స్పిన్నర్ ఎంట్రీ

IND vs SL test : శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్‌ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు తొలిసారి పిలుపు లభించింది.

Published on: Jul 28, 2026, 09:58:30 IST
Advertisement

శ్రీలంక పర్యటనలో భాగంగా జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం అధికారికంగా ప్రకటించింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మరోసారి నమ్మకముంచిన సెలెక్టర్లు అతడికే పగ్గాలు అప్పగించింది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

శుభ్​మాన్ గిల్​తో కోచ్ గంభీర్.. (Gary Oakley/PA via AP)
శుభ్​మాన్ గిల్​తో కోచ్ గంభీర్.. (Gary Oakley/PA via AP)

స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌లను జట్టులోకి తీసుకున్నప్పటికీ, వారి భాగస్వామ్యం మాత్రం ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తేనే వీరిద్దరూ బరిలోకి దిగుతారు.

వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్‌లు ఎంపికయ్యారు.

స్పిన్ విభాగానికి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు నేతృత్వం వహించనుండగా, పేస్ బాధ్యతలను మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లు మోయనున్నారు.

ఊహించని సర్‌ప్రైజ్.. సారాంశ్ జైన్‌కు తొలిసారి పిలుపు!

ఈ జట్టు ఎంపికలో అత్యంత ఆసక్తికరమైన అంశం.. మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు పిలుపు రావడం! 33 ఏళ్ల ఈ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ దశాబ్దకాలానికి పైగా దేశవాళీ క్రికెట్‌లో శ్రమిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న సారాంశ్‌ను సెలెక్టర్లు ఎట్టకేలకు జాతీయ జట్టులోకి తీసుకున్నారు.

ఇటీవల ముగిసిన ఇండియా-ఏ శ్రీలంక పర్యటనలో సారాంశ్ చూపిన ఆల్‌రౌండ్ ప్రతిభే అతడికి టీమిండియా తలుపులు తెరిచింది. శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాట్‌తో కూడా నాటౌట్‌గా 70 రన్స్ చేసి అదరగొట్టాడు. అతడి ఆల్‌రౌండ్ షోతో ఇండియా-ఏ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

2014-15 సీజన్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన సారాంశ్, కష్టపడి పైకొచ్చిన అనుభవజ్ఞుడైన పక్కా రెడ్-బాల్ క్రికెటర్.

శ్రీలంక టెస్టు సిరీస్​కి భారత జట్టు..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్‌నెస్‌కు లోబడి), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా (ఫిట్‌నెస్‌కు లోబడి), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.

లంక స్పిన్ ట్రాక్‌లకు భారీ వ్యూహం!

శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అమితంగా అనుకూలిస్తాయన్న విషయాన్ని మనసులో ఉంచుకుని బీసీసీఐ సెలెక్టర్లు జట్టు నిండా స్పిన్నర్లను నింపేశారు. అనుభవజ్ఞులైన రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు మానవ్ సుతార్, సారాంశ్ జైన్‌ల రాకతో భారత స్పిన్ దళం మరింత బలంగా తయారైంది.

సిరీస్ ప్రారంభానికి ముందు ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా భారత్ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాతే శ్రీలంకతో రెండు టెస్టుల సమరంలోకి దిగుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks