FIFA World Cup 2026 : ఫిఫా విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? దరిదాపుల్లో కూడా లేని క్రికెట్..!
Argentina vs Spain : ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేత స్పెయిన్ జట్టుకు రికార్డు స్థాయి ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ అర్జెంటీనాతో పాటు టోర్నీలో పాల్గొన్న మిగతా జట్లకు ఫిఫా ఎంతెంత బహుమతి మొత్తం అందించిందో పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాము..
న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ కొత్త ఫిఫా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ చారిత్రాత్మక విజయంతో స్పెయిన్ ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ట్రోఫీని ముద్దాడటమే కాకుండా, ఫిఫా చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయి ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకుంది. మరోవైపు, నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో గెలిచిన టైటిల్‌ను కాపాడుకునే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుని, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా సైతం భారీ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది.
డిసెంబర్ 2025లో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశ నిర్ణయం ప్రకారం.. 2026 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీని ప్రకటించారు. టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు వారు నిలిచిన స్థానాన్ని బట్టి ఈ బహుమతి మొత్తంలో వాటాను పంపిణీ చేశారు.
విజేతలకు కాసుల పంట.. ఎవరికి ఎంత వచ్చింది?
ఫిఫా వరల్డ్ కప్ 2026 టైటిల్ గెలిచినందుకు గానూ స్పెయిన్‌కు ఏకంగా 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 400 కోట్లకు పైగా) బహుమతి లభించింది. పురుషుల ప్రపంచకప్ చరిత్రలో విజేతకు అందించిన అత్యధిక ప్రైజ్ మనీ ఇదే కావడం విశేషం. 2022లో టైటిల్ గెలిచినప్పుడు అర్జెంటీనా అందుకున్న బహుమతి కంటే ఇది 8 మిలియన్ డాలర్లు ఎక్కువ!
ఫైనల్లో 1-0 తేడాతో ఓడిపోయి, రన్నరప్‌గా నిలిచిన లియోనల్ మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా జట్టుకు 33 మిలియన్ డాలర్లు దక్కాయి. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ అందుకున్న మొత్తం కంటే ఇది 3 మిలియన్ డాలర్లు ఎక్కువ.
ఈ భారీ ప్రైజ్ మనీ కేవలం ఫైనలిస్టులకు మాత్రమే పరిమితం కాలేదు. టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు 29 మిలియన్ డాలర్లు, నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఫ్రాన్స్ జట్టుకు 27 మిలియన్ డాలర్ల పారితోషికం లభించింది.
2022 టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ పూల్‌తో పోలిస్తే ఈసారి 50 శాతం నిధులను పెంచారు. దీనితో 2026 ఫిఫా వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ పూల్ బడ్జెట్ రికార్డు స్థాయిలో 655 మిలియన్ డాలర్లకు చేరింది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 పూర్తి ప్రైజ్ మనీ లిస్ట్:
టోర్నమెంట్‌లో జట్లు సాధించిన స్థానాల ఆధారంగా ఫిఫా ప్రకటించిన ప్రైజ్ మనీ వివరాలు ఇలా ఉన్నాయి:
విజేత (స్పెయిన్): 50 మిలియన్ డాలర్లు
రన్నరప్ (అర్జెంటీనా): 33 మిలియన్ డాలర్లు
మూడో స్థానం (ఇంగ్లాండ్): 29 మిలియన్ డాలర్లు
నాలుగో స్థానం (ఫ్రాన్స్): 27 మిలియన్ డాలర్లు
5 నుండి 8వ స్థానం: 19 మిలియన్ డాలర్లు
9 నుండి 16వ స్థానం: 15 మిలియన్ డాలర్లు
17 నుండి 32వ స్థానం: 11 మిలియన్ డాలర్లు
33 నుండి 48వ స్థానం: 9 మిలియన్ డాలర్లు
ఇండియాలో క్రేజ్ ఉన్న క్రికెట్‌తో పోల్చితే, ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ చాలా రెట్లు ఎక్కువ! ఉదాహరణకు.. 2026 టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్‌కు 11.25 మిలియనా డాలర్ల ప్రైజ్ మనీ అందింది. ఇక ఐపీఎల్ 2026లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు.. సుమారు 2.10 మిలియన్ డాలర్ల ఆర్థిక బహుమతి అందింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


