Real Estate : ఏఐ గండం! ఇల్లు కొనేందుకు భయంగా ఉందా? ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? నిపుణుల సూచనలు..
ఇది లేఆఫ్స్ ప్రపంచం! ఏఐ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత భయంకరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో భారీ ఈఎంఐలతో కూడిన హోం లోన్ తీసుకోవాలంటే చాలా మంది భయపడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? నిపుణులు సూచనలు ఇవి..
బెంగళూరులోని ఒక మధ్యతరగతి ఐటీ కుటుంబానికి ఇప్పటికే ఒక సొంత 2బీహెచ్‌కే ఇల్లు ఉంది. ఇద్దరు పిల్లలు (ఒకరు కాలేజీ, మరొకరు స్కూల్) పెరుగుతున్న నేపథ్యంలో, పెద్ద ఇంటికి మారడం అనేది వారికి ఒక సహజమైన అవసరంగా అనిపించింది. ఆర్థిక స్తోమత ఉంది, అనువైన ప్రాంతంలో ఇల్లు కూడా దొరికింది. కానీ, వారినిప్పుడు ఒక్కటే ఆందోళన వెంటాడుతోంది.. అదే ‘ఉద్యోగ భద్రత’!

“బెంగళూరులో ఒక మంచి ప్రాపర్టీని గుర్తించాను. కానీ ప్రస్తుతం ఏఐ (కృత్రిమ మేధ) వల్ల వస్తున్న మార్పులు, లేఆఫ్స్ వార్తలు చూస్తుంటే లోన్ తీసుకుని డీల్ ఫైనలైజ్ చేయడానికి భయం వేస్తోంది,” అని ఒక యూజర్ రెడిట్ వేదికగా తన ఆవేదన పంచుకున్నారు. “లేఆఫ్స్ జరుగుతాయేమో, ఒకవేళ ఉద్యోగం పోతే అంత భారీ ఈఎంఐలను ఎలా కట్టాలి అనే ఆలోచనలు నిద్రలేకుండా చేస్తున్నాయి,” అని ఆయన పేర్కొన్నారు.
ఇది సదరు వ్యక్తి భయం మాత్రమే కాదు! నేటి లేఆఫ్స్ ప్రపంచంలో.. బెంగళూరు రియల్ ఎస్టేట్ వైపు చూద్దామని ఆలోచిస్తున్న చాలా మంది టెక్ నిపుణుల పరిస్థితి ఇదే. ఏఐ కారణంగా సాగుతున్న పునర్నిర్మాణ ప్రక్రియ, ఉద్యోగాల కోత వంటివి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.
“ఒకవేళ మేము ముందుకు వెళితే, నెలకు రూ. 1.8 లక్షల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగాల్లో అనిశ్చితి మా నమ్మకాన్ని సడలిస్తోంది,” అని ఆ ఆయన రాశారు.
ఈఎంఐలు, రిస్క్ సామర్థ్యం, ‘35% రూల్’..
బెంగళూరు రియల్ ఎస్టేట్ గురించి టెకీ చర్చపై స్పందించిన పలువురు నెటిజన్లు, భారీ అప్పు చేసే ముందు కచ్చితమైన ప్రణాళిక ఉండాలని సూచించారు. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వారు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇవే:
డౌన్‌పేమెంట్: కనీసం 25శాతం సొంత నిధులు ఉండేలా చూసుకోవాలి.
ఎమర్జెన్సీ ఫండ్: అవాంతరాలు ఎదురైతే తట్టుకోవడానికి కనీసం ఒక ఏడాదికి సరిపడా ఈఎంఐ మొత్తాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి.
35శాతం రూల్: మీ నెలవారీ ఈఎంఐ మొత్తం, మీ చేతికి వచ్చే ఆదాయంలో 35 శాతానికి మించకూడదు.
జీవితం అంటే ఈఎంఐలు మాత్రమే కాదు: “కేవలం అప్పులు కట్టడానికే జీవితాన్ని గడపకూడదు. విహారయాత్రలు, ఇతర సంతోషాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల చదువులు, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి సమాంతర ఆర్థిక లక్ష్యాలను మర్చిపోవద్దు,” అని ఒక యూజర్ గుర్తు చేశారు.
మరో వాదన: ‘కొంత రిస్క్ తప్పనిసరి’
అయితే, అందరూ ఒకేలా ఆలోచించడం లేదు. రిస్క్ తీసుకోవాలని కోరేవారు కూడా ఉన్నారు. “మధ్యతరగతి వారికి పెద్ద కొనుగోళ్లు చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక కారణం అడ్డు వస్తూనే ఉంటుంది. మనకు ధనికుల్లా వ్యక్తిగత రక్షణ వలయాలు ఉండవు, పేదల్లా సామాజిక భద్రతా పథకాలు ఉండవు. కాబట్టి, జీవితంలో ఎదగాలంటే లెక్కలతో కూడిన కొంత రిస్క్ తీసుకోవాల్సిందే,” అని ఒకరు వాదించారు.
మరోవైపు, లోన్ డిఫాల్ట్ అయితే ఎదురయ్యే పరిణామాలను కూడా కొందరు గుర్తు చేశారు. అప్పు కట్టలేక బ్యాంకులు వేలం వేస్తే, ఆ ప్రాపర్టీ మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్ముడయ్యే ప్రమాదం ఉంది. “హోమ్ లోన్ల వల్ల కేవలం ఇద్దరికే లాభం ఉంటుంది.. ఒకటి బిల్డర్, రెండు బ్యాంక్. కాబట్టి లోన్ తీసుకుంటే 5 నుంచి 10 ఏళ్లలోనే దానిని క్లియర్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి,” అని హెచ్చరించారు.
బెంగళూరు రియల్ ఎస్టేట్- ఆర్థిక నిపుణుల విశ్లేషణ
ప్రముఖ ఆర్థిక నిపుణుడు సురేష్ సదగోపన్ ప్రకారం.. భారీ ఈఎంఐలు కుటుంబ ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తాయి.
నగదు లభ్యత: అన్ని ఖర్చులు, ఈఎంఐలు పోగా నెలకు కనీసం రూ. 80,000 మిగులు లేకపోతే, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు తట్టుకోవడం కష్టం.
వాస్తవ పరిస్థితులు: అఫార్డిబులుటీ అనేది కేవలం పేపర్ మీద బాగుంటే సరిపోదు. అనారోగ్య సమస్యలు, జీవనశైలి ఖర్చులు, విద్యార్థుల ఫీజులు వంటివి అంచనాలను మారుస్తాయి. కాబట్టి ఈఎంఐ వీలైనంత వరకు రూ. 1 లక్ష లోపు ఉంటేనే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది.
ప్లాన్-బి తప్పనిసరి: “లేఆఫ్స్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. అనిశ్చితి ఉన్నప్పుడు భారీ బాధ్యతలు నెత్తిన వేసుకోవద్దు. ఒకవేళ లోన్ తీసుకుంటే మాత్రం కచ్చితంగా 'ప్లాన్-బీ' సిద్ధంగా ఉంచుకోవాలి,” అని ఆయన సూచించారు.
సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారు తొందరపడకుండా, క్రమశిక్షణతో పొదుపు చేసి డౌన్‌పేమెంట్ మొత్తాన్ని పెంచుకోవడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు- సమాధానాలు :-
1. నా ఆదాయంలో గరిష్టంగా ఎంత శాతం వరకు హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించవచ్చు?
ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం.. మీ నెలవారీ ఈఎంఐ మీ నికర ఆదాయంలో (టేక్ హోం) 35 శాతం మించకూడదు. దీనినే '35% రూల్' అని పిలుస్తారు. ఉదాహరణకు, మీ చేతికి వచ్చే జీతం నెలకు రూ. 2 లక్షలు అయితే, మీ హోమ్ లోన్ ఈఎంఐ రూ. 70,000 లోపు ఉండటం సురక్షితం. ఇలా చేయడం వల్ల పిల్లల చదువులు, అత్యవసర వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ పొదుపుకు ఆటంకం కలగకుండా ఉంటుంది.
2. ఐటీ రంగంలో ఉద్యోగాల కోత భయాలు ఉన్నప్పుడు, హోమ్ లోన్ తీసుకోవడం సరైనదేనా?
ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలతో ముందుకు వెళ్లవచ్చు. ముందుగా, కనీసం 12 నెలల ఈఎంఐ మొత్తాన్ని ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ ఫండ్‌గా సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగ మార్పు లేదా తాత్కాలిక ఆదాయ అంతరాయం కలిగితే ఈ నిధి మీకు అండగా ఉంటుంది. అంతేకాకుండా, సాధ్యమైనంత వరకు డౌన్‌పేమెంట్ మొత్తాన్ని పెంచుకోవడం (కనీసం 40-50%) ద్వారా లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ అనిశ్చితి ఎక్కువగా ఉంటే, కొన్నాళ్లు వేచి చూసి, మరింత ఆర్థిక వెసులుబాటు కలిగాక నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


