India AI Impact Summit 2026 : 'ఏఐ' మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదనలు

కొత్త ఆవిష్కరణలు మన జీవితాల్లో పెను మార్పులు తెస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోందన్నారు. ఇండియా - ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌-2026లో మాట్లాడిన ఆయన…  నేషనల్ ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

Published on: Feb 20, 2026, 22:05:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కృత్రిమ మేధస్సు యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో “ఏఐ కౌన్సిల్”ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ప్రధానమంత్రి గారిని కోరారు. అలాగే జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చట్టపరమైన రక్షణ చర్యలు రూపొందించే ప్రత్యేక “ఏఐ మంత్రిత్వ శాఖ”ను ఏర్పాటు చేయాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సిద్ధంగా ఉంది - సీఎం రేవంత్

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా - ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌-2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారత ప్రభుత్వం సహకారంతో దేశానికి ఒక “ఏఐ స్టార్టప్ విలేజ్”ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐలో శరవేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి నిరంతరం అభివృద్ధిని పర్యవేక్షించే “జాతీయ ఏఐ వార్‌రూమ్” ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. కేంద్రం అనుమతిస్తే అందుకు హైదరాబాద్‌ కేంద్రంగా వార్‌రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఏఐ పురోగతిలో తెలంగాణతో భాగస్వామ్యం కావాలని సదస్సు ద్వారా ప్రపంచ నాయకులు, సాంకేతిక నిపుణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. సామాజిక న్యాయ సాధనకు, పేదరిక నిర్మూలనకు ఏఐను శక్తివంతమైన సాధనంగా వినియోగించాల్సిన అవసరాన్ని ప్రధానంగా నొక్కిచెప్పారు. వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో ఏఐకి సంబంధించి ప్రతి ఏటా ఒక్కసారి జరిగే చర్చలు సరిపోవని పేర్కొంటూ, దేశంలోని వివిధ నగరాలలో సంవత్సరానికి రెండుసార్లు ఏఐ సమ్మిట్‌లు నిర్వహించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.

“జీపీయూ చిప్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజీ, కోర్ ల్యాంగ్వేజెస్ ఆధారిత సేవల వరకు ఏఐ చైన్ మొత్తం మీద భారతదేశం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. అందుకు భారత్‌కు స్పష్టమైన రోడ్‌మ్యాప్ అవసరం” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఏఐ వర్శిటీ ఏర్పాటు చేయాలి…

ఏఐలో ప్రమాణిక పరిశోధనల కోసం అత్యున్నత ప్రమాణాలతో, అవసరమైన నిధులతో వివిధ క్యాంపస్‌లతో కూడిన ఏఐ యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడానికి, భారత యువత ప్రపంచ స్థాయి యూనికార్న్ సంస్థలుగా ఎదిగేందుకు ఏఐ రంగంలో ఏమాత్రం జాప్యం చేయకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోకుండా, వారికి మరిన్ని అవకాశాలు సృష్టించేలా సమగ్ర రీ-స్కిల్లింగ్ వ్యూహాలు అమలు చేయాలన్నారు.

కొన్ని దేశాల్లో ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సేవల రంగంలో దేశం పురోగతి సాధించినప్పటికీ, ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫామ్‌ల సృష్టికర్తగా నిలబడలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాట్‌ఫామ్‌ల సేవలందించే దేశంగా మాత్రమే నిలిచామన్నారు. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, మెటా సంస్థల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్ వంటి విస్తృతంగా వినియోగించే సేవలు భారతదేశంలో సృష్టించబడలేదని గుర్తుచేశారు.

భారత్ ఏఐ విప్లవాన్ని కోల్పోవద్దని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దృఢమైన విధానాలు, బలమైన సంస్థలు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా, భారతదేశం కేవలం నామమాత్రపు పాత్రలో కాకుండా కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ నాయకుడిగా అవతరించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More