...
...
Next Story

BGauss C12 MaxR : సింగిల్​ ఛార్జ్​తో 178 కి.మీ రేంజ్- బిగాస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హైలైట్స్ ఇవే..

ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ప్రముఖ సంస్థ బిగాస్ తన సరికొత్త ప్రీమియం స్కూటర్ 'సీ12 మ్యాక్స్ఆర్'ను రూ. 1.46 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. 178 కిలోమీటర్ల రేంజ్, పవర్ ఫుల్ మోటార్, భారీ స్టోరేజ్ ఆప్షన్లతో వచ్చిన ఈ ఈ-స్కూటర్ పూర్తి సమాచారం మీకోసం..

Published on: Sep 10, 2026, 07:30:35 IST
Advertisement

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో రోజురోజుకూ పోటీ తీవ్రమవుతున్న వేళ, ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ‘బిగాస్’ సరికొత్త మోడల్‌ను రంగంలోకి దించింది. రైడింగ్​ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చేందుకు 'బిగాస్ సీ12 మ్యాక్స్​ఆర్' (BGauss C12 MaxR) పేరిట ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. భారతీయ రోడ్ల పరిస్థితులకు, నిత్యం ప్రయాణాలు చేసే ఉద్యోగులు, కుటుంబాల అవసరాలకు అనుగుణంగా దీనిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు.

బిగాస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
బిగాస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈ నేపథ్యంలో ఈ బిగాస్ సీ12 మ్యాక్స్​ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

బిగాస్ సీ12 మ్యాక్స్​ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- బ్యాటరీ, సేఫ్టీ..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత సురక్షితమైన 3.8 kWh సామర్థ్యం గల ‘ఎల్ఎఫ్‌పీ’ బ్యాటరీని అమర్చారు. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ67 రేటింగ్ ఇచ్చారు. వేడిని త్వరగా బయటకు పంపేలా ప్రత్యేక అల్యూమినియం కేసింగ్‌లో ఈ బ్యాటరీని అమర్చడం గమనార్హం.

110 రకాల సేఫ్టీ చెక్స్: ఇందులోని ఇంటెలిజెంట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వేడి, ఛార్జింగ్ లెవల్స్​ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. బ్యాటరీ సురక్షితంగా పనిచేసేలా ఏకంగా 110 రకాల రక్షణ ఫీచర్లను జోడించారు.

రేంజ్: ఐడీసీ నిబంధనల ప్రకారం ఈ బిగాస్ సీ12 మ్యాక్స్​ఆర్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 178 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ధ్రువీకరించింది. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారికి లేదా నగరంలో ప్రయాణించేవారికి పెట్రోల్ భారం నుంచి ఇది పెద్ద ఊరటనిస్తుంది!

బిగాస్ సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన 'హైపర్ జెన్' ఇన్-వీల్ మోటార్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ పనిచేస్తుంది.

మోటార్, గేర్ ట్రాన్స్‌మిషన్, బ్రేకింగ్, మోటార్ కంట్రోల్ యూనిట్​లన్నింటినీ ఒకే చోట అనుసంధానించడం వల్ల సాధారణ బెల్ట్ లేదా చైన్ డ్రైవ్ అవసరం లేకుండా పోయింది. దీనివల్ల బండి మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా తగ్గుతాయి!

ఈ బిగాస్ కొత్త ఈ-స్కూటర్‌లో ఈకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్లను కూడా అందించారు. కొండ ప్రాంతాలు, ఎత్తుపల్లాల రోడ్లపై సైతం సులువుగా ప్రయాణించేలా 18 డిగ్రీల గ్రేడబిలిటీని ఇచ్చారు.

బిగాస్ సీ12 మ్యాక్స్​ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- 1.5 లక్షల కిలోమీటర్ల లైఫ్!

ఈ స్కూటర్‌ను బిగాస్ స్వదేశీ 'డబ్ల్యూఎస్​ఏ ప్లాట్‌ఫామ్' ఆధారంగా నిర్మించింది. హై-టెన్సైల్ మైక్రో-ఎల్లాయ్ స్టీల్‌తో, రోబోటిక్ సాయంతో దీని ఫ్రేమ్‌ను అసెంబుల్ చేశారు. ఎంతటి కఠినమైన రోడ్లనైనా తట్టుకుని, దాదాపు 1,50,000 కిలోమీటర్ల వరకు సుదీర్ఘ కాలం మన్నికగా ఉండేలా దీనిని డిజైన్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

బిగాస్ సీ12 మ్యాక్స్​ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- ప్రాక్టికల్ ఫీచర్లు..

భారతీయ వినియోగదారుల రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌లో అత్యుత్తమ స్టోరేజ్ సదుపాయాలను కల్పించారు:

రెండు హెల్మెట్ల స్థలం: సీటు కింద ఏకంగా రెండు హెల్మెట్లను ఉంచేంత విశాలమైన బూట్ స్పేస్‌ను అందించడం ఈ ఈ- స్కూటర్ ప్రధాన ఆకర్షణ.

ప్రత్యేక సదుపాయాలు: పాప్-అవుట్ గొడుగు హోల్డర్, పత్రాలు/పర్స్ దాచుకోవడానికి లాక్ చేయగల బాక్స్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, వాటర్ బాటిల్ హోల్డర్, డస్ట్ క్లాత్ ఉంచుకునే ప్రదేశం వంటి చిన్న చిన్న సౌకర్యాలను కూడా అందించారు. విశాలమైన ఫుట్‌బోర్డ్‌పై మధ్యస్థ పరిమాణం గల లగేజ్ బ్యాగ్‌ను కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు.

కస్టమర్లను ఆకట్టుకునేందుకు ముందు భాగంలో వినూత్నమైన ‘ క్రిస్టల్ ల్యాంప్’, ఆల్-ఎల్ఈడీ లైటింగ్‌ను ఇందులో అందించారు.

5-అంగుళాల టీఎఫ్​టీ డిస్‌ప్లే: నేవిగేషన్, కాల్ నోటిఫికేషన్లు, రైడింగ్ వివరాలు, డిజిలాకర్ అనుసంధానంతో పాటు డిస్టెన్స్-టు-ఎంప్టీ, ఫాల్ సెన్స్ (కిందపడితే గుర్తించే సాంకేతికత) వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

స్మార్ట్ కనెక్టివిటీ: మొబైల్ యాప్ ద్వారా పేరెంటల్ లాక్, వెహికల్ హెల్త్ చెక్, సేఫ్ లాక్, ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ పొందవచ్చు.

రైడింగ్ కంఫర్ట్: 12-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, ముందువైపు టెలిస్కోపిక్, వెనుకవైపు 5-స్టెప్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ గ్యాస్ సస్పెన్షన్‌ను ఇచ్చారు. 160 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 150 కేజీల బరువును మోసే సామర్థ్యం దీనికి ఉంది.

బిగాస్ సీ12 మ్యాక్స్​ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- ధర, కలర్ ఆప్షన్స్..

బిగాస్ సీ12 మ్యాక్స్​ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.46 లక్షలు. ఇది స్పార్క్​లింగ్ వైన్ విత్ షాంపైన్ గోల్డ్, టెర్రా గ్రీన్ విత్ షాంపైన్ గోల్డ్, పెర్ల్ వైట్, శాటిన్ బ్లాక్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

ప్రస్తుతం విపణిలో ఉన్న ఏథర్, ఓలా, టీవీఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లకు ఇది గట్టి పోటీనివ్వనుంది!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks