BCCL IPO gmp : భారత్ కోకింగ్ కోల్ ఐపీఓ జోరు.. మరి అప్లై చేయాలా? వద్దా?

భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదటి రోజే 8 రెట్లు సబ్‌స్క్రైబ్ అవ్వగా, గ్రే మార్కెట్‌లో షేరు ధరకు కూడా సానుకూల డిమాండ్ కనిపిస్తోంది. మరి ఈ బీసీసీఎల్​ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..

Published on: Jan 12, 2026 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
బీసీసీఎల్​ ఐపీఓ అప్లై చేయాలా? వద్దా?
బీసీసీఎల్​ ఐపీఓ అప్లై చేయాలా? వద్దా?

కోల్ ఇండియా అనుబంధ సంస్థ 'భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్' (బీసీసీఎల్​) ఐపీఓ డే 2 సబ్​స్క్రిప్షన్​ కొనసాగుతోంది. బిడ్డింగ్ ప్రారంభమైన మొదటి రోజు ఇన్వెస్టర్లు ఈ ఇష్యూపై విపరీతమైన ఆసక్తిని కనబరిచారు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత రహిత ఇన్వెస్టర్లు (ఎన్​ఐఐ) షేర్ల కోసం పోటీ పడ్డారు. మరి ఈ బీసీసీఎల్​ ఐపీఓ జీఎంపీ ఎంత ఉంది? ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా?

బీసీసీఎల్​ ఐపీఓ- సబ్‌స్క్రిప్షన్..

జనవరి 9న ప్రారంభమైన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్​ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ జనవరి 13, మంగళవారం వరకు కొనసాగుతుంది.

మొదటి రోజు సాయంత్రం సమయానికి ఈ ఐపీఓ 8.09 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 9.26 రెట్లు, ఎన్ఐఐ కోటా 16.39 రెట్లు బుక్ అవ్వడం విశేషం. మొత్తం 34.69 కోట్ల షేర్లకు గానూ ఏకంగా 280 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి.

బీసీసీఎల్​ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం..

ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో భారత్ కోకింగ్ కోల్ షేరుకు 10.6 రూపాయల ప్రీమియం (జీఎంపీ) నడుస్తోంది. ఐపీఓ గరిష్ట ధర 23 రూపాయలు కాగా, ఈ ప్రీమియంను కలిపితే షేరు ధర 33.6 రూపాయల వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే లిస్టింగ్​ నాడు ఇన్వెస్టర్లకు లాభం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే గత 10 రోజులతో పోలిస్తే జీఎంపీలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. గతంలో ఇది గరిష్టంగా 16.25 రూపాయల వరకు వెళ్లింది.

కీలక తేదీలు ఇవే (టెంటేటివ్):

షేర్ల కేటాయింపు: జనవరి 14, బుధవారం

రీఫండ్స్ ప్రారంభం: జనవరి 15, గురువారం

డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు: జనవరి 15, గురువారం

స్టాక్ మార్కెట్ లిస్టింగ్: జనవరి 16, శుక్రవారం (బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో)

బీసీసీఎల్​ ఐపీఓ- అప్లై చేయాలా? వద్దా?

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ బీసీసీఎల్​ ఐపీఓపై సానుకూల రేటింగ్ ఇచ్చాయి. "ధన్బాద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మొదటి అర్థభాగంలో ఫలితాలు కొంత తగ్గినా, కంపెనీకి ఉన్న బలమైన పునాదుల దృష్ట్యా దీర్ఘకాలిక లాభాల కోసం దీనికి సబ్‌స్క్రైబ్ చేయవచ్చు," అని కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ పేర్కొంది.

నిర్మల్ బ్యాంగ్ సంస్థ కూడా కంపెనీ అప్పులు లేని బ్యాలెన్స్ షీట్‌ను ప్రశంసించింది. ఆదాయ మార్గాలు స్థిరంగా ఉండటం, ఈవీ/ఎబిటా వ్యాల్యుయేషన్ ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చని సూచించింది.

స్టీల్ పరిశ్రమకు అవసరమైన కోకింగ్ కోల్ ఉత్పత్తిలో ఈ కంపెనీకి తిరుగులేదని, లిస్టింగ్ లాభాల కోసం కూడా ఇన్వెస్టర్లు ప్రయత్నించవచ్చని ఆనంద్ రాఠీ సంస్థ అభిప్రాయపడింది.

బీసీసీఎల్ ఐపీఓ-​ కంపెనీ నేపథ్యం..

భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ పూర్తిస్థాయిలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ. భారతదేశపు మొత్తం కోకింగ్ కోల్ ఉత్పత్తిలో దాదాపు 58.5 శాతం వాటా ఈ సంస్థదే. స్టీల్ తయారీకి అత్యంత కీలకమైన హై-గ్రేడ్ కోకింగ్ కోల్ నిల్వలు ఈ కంపెనీ వద్ద సుమారు 7.91 బిలియన్ టన్నులు ఉన్నాయి. ఈ ఐపీఓ ద్వారా సేకరించే రూ. 1,071 కోట్లు పూర్తిగా మాతృ సంస్థ అయిన కోల్ ఇండియాకు చేరుతాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More